టీడీపీ మరో కుట్ర: ఎద్దు ఈనిందట.. గాటికి కట్టేశారట! 

TDP And Yellow Media Fake News On Retirement Age - Sakshi

ఉద్యోగ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు అంటూ నకిలీ జీవో సృష్టించిన పచ్చ పార్టీ 

సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం 

దానిని నిర్ధారించుకోకుండానే ఈటీవీ సహా పలు చానళ్ల ప్రసారం 

యువతను తప్పుదారి పట్టించాలనే కుతంత్రం 

తీవ్రంగా ఖండించిన ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్‌ 

గుంటూరు డీఐజీకి ఫిర్యాదు చేసిన ఆర్థిక శాఖ అధికారులు

కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశం 

అది తప్పుడు జీవో.. దాన్ని నమ్మొద్దని ఉద్యోగులకు వినతి

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుపెట్టుకుని తాజాగా మరో కుట్రకు తెరలేపింది టీడీపీ, పచ్చ మీడియా. ‘ఎద్దు ఈనిందంటే.. గాటికి కట్టెయ్యండి’ అన్న చందంగా ప్రభుత్వంపై సాగిస్తున్న దుష్ప్రచారానికి బ్రేకింగ్‌ న్యూస్‌ అంటూ ఆజ్యం పోసింది ఈటీవీ. ఉద్యోగుల పదవీ విరమణ వయసును రాష్ట్ర ప్రభుత్వం 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచినట్లు టీడీపీ నకిలీ జీవోను సృష్టించింది. సోషల్‌ మీడియాలో దాన్ని వైరల్‌ చేసి, రాజకీయంగా లబ్ధి పొందాలని ఉవ్విళ్లూరింది.

ఇందుకు పచ్చ మీడియా వంత పాడింది. ప్రజలు ఏమనుకుంటారన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా.. నిర్ధారించుకోకుండానే ఆ నకిలీ జీవోను ఈటీవీతో పాటు మరి కొన్ని చానల్స్‌ పెద్ద ఎత్తున ప్రసారం చేయడం విస్తుగొలుపుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. అయితే ఇప్పుడు మళ్లీ 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ జీవో ఇచ్చినట్లు పచ్చ పార్టీ నేతలు కొందరు నకిలీ జీవోను సృష్టించారు.

అసలు ఆ జీవో వాస్తవమైనదా? కాదా? అనే విషయాన్ని సరిచూసుకోకుండానే ఈటీవీ బ్రేకింగ్‌ న్యూస్‌లో ప్రచారానికి తెగపడింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచుతూ జీవో 15 జారీ చేసినట్లు వార్తలు ప్రసారం చేశారు. తద్వారా యువతను తప్పుదోవ పట్టించి, లబ్ధి పొందాలనే కుట్ర పూరిత ఆలోచనలో భాగంగానే ఇలా దుష్ప్రచారం సాగించారు. 

మోసపోకండి.. అది నకిలీ జీవో 
నకిలీ జీవోతో దుష్ప్రచారం సాగిస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో.. అలాంటి జీవో జారీ చేయలేదని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ తీవ్రంగా ఖండించారు. నకిలీ జీవో సృష్టించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఒక ప్రకటన ద్వారా హెచ్చరించారు. తప్పుడు, నకిలీ జీవోను చూసి ఉద్యోగులు, ప్రజలు మోసపోవద్దని సూచించారు.

నకిలీ జీవో విషయమూ ఆర్థిక శాఖ అధికారులు గుంటూరు డీఐజీకి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేయాల్సిందిగా ఆయన ఎస్పీని ఆదేశించారు. కాగా,  ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును 62 నుండి 65 ఏళ్లకు పెంచినట్లు  జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు ఎవ్వరూ ఆ ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top