ఆధారాలు లేకుండా అరెస్టులా..? | Supreme Court overturns High Court verdict on Mithun Reddy bail Issue | Sakshi
Sakshi News home page

ఆధారాలు లేకుండా అరెస్టులా..?

May 14 2025 12:58 AM | Updated on May 14 2025 7:22 AM

Supreme Court overturns High Court verdict on Mithun Reddy bail Issue

అరెస్టు.. పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది..

అది పౌరుడి గౌరవం, ప్రతిష్టను ప్రభావితం చేస్తుంది..

కేసు పెట్టాం కాబట్టి అరెస్ట్‌ చేసి తీరాలన్న ఆలోచన ఎంతమాత్రం సరికాదు

మద్యం కేసులో ప్రభుత్వ యంత్రాంగం తీరుపై ‘సుప్రీం’ విస్మయం

పోలీసులు తమ విచక్షణాధికారాన్ని జాగ్రత్తగా వాడాలని హితవు

ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసిన సుప్రీం

హైకోర్టు తీర్పును చూస్తే.. ఆధారాలు పూర్తిస్థాయిలో పరిశీలించలేదని స్పష్టమవుతోందని వ్యాఖ్య

తిరిగి విచారించి 4 వారాల్లో నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు స్పష్టీకరణ

నిర్ణయం వెలువరించేంత వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయొద్దని ఏసీబీకి ఆదేశం  

‘‘అరెస్ట్‌ అనేది.. పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది. అరెస్ట్‌ అన్నది.. వ్యక్తి గౌరవాన్ని, ప్రతిష్టను, సమాజంలో వారి స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల అరెస్ట్‌ విషయంలో దర్యాప్తు అధికారి తనకున్న అధికారాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది..’’
– సుప్రీంకోర్టు ధర్మాసనం..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న అరెస్టులపై సుప్రీంకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు, కారణాలు లేకుండా అరెస్టులు చేయడం సరికాదని పేర్కొంది. కేసు పెట్టిన వెంటనే కారణాలు లేకుండా అరెస్ట్‌లు చేయడం తగదంది. ‘ఏదైనా కేసులో అరెస్టు చేయడానికి సహేతుక కారణాలు చూపించాలి. కేసు పెట్టాం కాబట్టి అరెస్ట్‌ చేసి తీరాలన్న ఆలోచన ఎంతమాత్రం సరికాదు. 

ఇలాంటి యాంత్రిక అరెస్ట్‌లు సబబు కాదు...’ అని గత ప్రభుత్వ మద్యం విధానంపై నమోదైన అక్రమ కేసుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అరెస్ట్‌ చేసే అధికారం పోలీసులకు ఉన్నప్పటికీ విచారణకు స్వీకరించదగ్గ ప్రతి నేరంలో నిందితుడిని అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అరెస్టుల విషయంలో పోలీసులు తమ అధికారాన్ని జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే ఉపయోగించాలని పునరుద్ఘాటించింది.

హైకోర్టు తీర్పును రద్దు చేసిన ‘సుప్రీం’...
మద్యం కేసులో రాజంపేట పార్లమెంట్‌ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా రద్దు చేసింది. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై తిరిగి విచారణ జరిపి తగిన నిర్ణయం వెలువరించాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు తీర్పును పరిశీలిస్తే.. ఆధారాలను పూర్తిస్థాయిలో పరిశీలించలేదన్న విషయం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది. 

దర్యాప్తు అధికారి సేకరించిన ఆధారాలను మరోసారి జాగ్రత్తగా పరిశీలించి నాలుగు వారాల్లో ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. మిథున్‌రెడ్డి పరువు, ప్రతిష్టలను కూడా కేసు విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. హైకోర్టు నిర్ణయం వెలువరించేంత వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని ఏసీబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జంషేడ్‌ బుర్జోర్‌ పార్ధీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు మిథున్‌రెడ్డి...
గత ప్రభుత్వ మద్యం విధానంపై నమోదైన అక్రమ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మి«థున్‌రెడ్డి తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు విచారణ జరిపారు. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ గత నెల 3న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్‌ పార్ధీవాలా ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ జరిపింది.

దర్యాప్తునకు సహకరిస్తున్నారు...
మిథున్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, రంజిత్‌ కుమార్‌లు వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ ఇప్పటికే దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరయ్యారని తెలిపారు. మద్యం కేసులో మిథున్‌రెడ్డిని నిందితుడిగా చేర్చామని రాష్ట్ర ప్రభుత్వ తరపు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్టు తీర్పును ఆక్షేపించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం వెలువరించాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆదేశించింది. తీర్పు వెలువరించేంత వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయబోమన్న రాష్ట్ర ప్రభుత్వ హామీని ధర్మాసనం రికార్డ్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement