
సాక్షి, కర్నూలు: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో వేళ.. న్యాయం కోరుతూ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో, ఫ్లకార్డుతో నిరసన చేపట్టారు. మోదీకి తమ కుటుంబం పడుతున్న బాధేంటో తెలియజేసుకునే అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా వాళ్లు కోరుతున్నారు.
సుగాలి ప్రీతిపై అఘత్యానికి పాల్పడ్డ వాళ్లను కఠినంగా శిక్షించాలి(Sugali Preethi Case News). అసలు లోకేష్ రెడ్ బుక్‌లో వాళ్ల పేర్లు లేవా?. మా కుటుంబానికి ఇప్పటికైనా న్యాయం చేయాలి అంటూ ఫ్లకార్డలతో నినాదాలు చేశారు. మరోవైపు.. తమకు న్యాయం చేయాలని, తమ గోడను ప్రధాని మోదీకి వినిపించే అవకాశాన్ని కల్పించాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి వేడుకుంటున్నారు.
2017లో కర్నూలులోని ఓ స్కూల్లో అనుమానాస్పద స్థితిలో సుగాలి ప్రీతిబాయి మృతి చెందింది. అయితే.. స్కూల్ యజమాన్యమే అత్యాచారం చేసి, తన బిడ్డను హత్య చేసిందని ప్రీతిబాయ్ తల్లితండ్రులు ఆరోపిస్తూ వస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల బెనిఫిట్స్ ప్రీతి కుటుంబానికి అందాయి. అలాగే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినప్పటికీ.. ఆ అంశం ముందుకు కదల్లేదు. ఈలోపు ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ఈ కేసు విపరీతమైన రాజకీయ ప్రచారానికి వాడుకున్నారు. అయితే తాజాగా బాధిత కుటుంబం కూటమి పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేయడం, ఆందోళనకు దిగిన నేపథ్యంలో.. ప్రభుత్వం దిగి వచ్చి కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది.

ఇదిలా ఉంటే.. న్యాయం చేస్తానని నమ్మించి పవన్ నమ్మక ద్రోహం చేశారని పార్వతి ఆరోపిస్తున్నారు(Sugali Preethi Mother Slams Pawan Kalyan). అంతేకాదు.. జనసేన ఎమ్మెల్యేలు, నేతలు తమను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘2017 నుండి నా కూతురు సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాం. ఎనిమిదేళ్లుగా నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తూనే ఉన్నాం. విజయవాడ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించాను అయినా మాకు న్యాయం జరగలేదు. ప్రీతికి న్యాయం జరగకపోతే.. చంద్రబాబు, పవన్, లోకేష్‌కు మా ఉసురు తగులుతుంది’’ అని వాపోయారామె.
ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ రేపు(అక్టోబర్ 16న) కర్నూలుకు రానున్నారు(PM Modi AP Kurnool Tour). ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌ను మోదీ అప్పాయింట్‌మెంట్ ఇప్పించాలని పార్వతి విజ్ఞప్తి చేశారు. అయితే.. అవతలి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదు.
ఇదీ చదవండి: న్యాయం గెలిచింది.. కూటమికి గట్టి దెబ్బ