అడవి బిడ్డలకు అక్షర యజ్ఞం | Sakshi
Sakshi News home page

అడవి బిడ్డలకు అక్షర యజ్ఞం

Published Mon, Aug 28 2023 3:27 AM

Students of tribal areas will get education of global standards at Tribal University of Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి:  పచ్చని తివాచీ కప్పుకున్నట్టు ఉండే ఎత్తయిన కొండలు.. దట్టమైన చెట్లు.. నడుమ పచ్చిక మైదానంలో కళ్లు చెదిరేలా రంగురంగుల భవంతులు. వాటిలోనే గిరిజన విద్యా కుసుమాలు వికసిస్తున్నాయి. అదే ఏజెన్సీ ప్రాంతంలోని మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం. అత్యంత బలహీన తెగల(పీవీటీజీ)కు చెందిన గిరిజన బాలల కోసం ఉద్దేశించిన ఈ గురుకులం మూడు నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం చదువులతో కార్పొరేట్‌ విద్యాలయాలను తలదన్నుతోంది.

దీనిలో ఆధునిక హంగులతో కూడిన క్లాస్‌ రూమ్‌ నుంచి భోజనశాల, బాత్‌రూమ్, ఆర్వో ప్లాంట్, వసతి వరకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన నాడు–నేడు ద్వారా 2020లో ప్రభుత్వం సకల సౌకర్యాలు సమకూర్చింది. రాష్ట్రంలో గిరిజన విద్యపై సర్కారు ప్రత్యేక ఫోకస్‌ పెట్టిందనేందుకు ఇదే గొప్ప నిదర్శనం. ఇదే కాదు.. రాష్ట్రంలోని అడవి బిడ్డల కోసం ప్రభుత్వం పెద్దఎత్తున అక్షర యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తోంది.


      బుట్టాయగూడెం ఈఆర్‌ఎం స్కూలులోని తరగతి గదులు

2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు 
రాష్ట్రంలో మొత్తం 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. అందులో 1,958 గిరిజన పాఠశాలలు, 371 ఆశ్రమ పాఠశాలలు, 18 ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లు, 159 పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో 1,55,599 మంది విద్యార్థులు చదువుతున్నారు. వాటి పరిధిలోని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ఆహారం, సౌందర్య సాధనాలు, ఇతర సౌకర్యాలతో పాటు ఉచిత వసతి తదితర వాటికి ఈ ఏడాది(2023–24) ప్రభుత్వం రూ.920.31 కోట్లు కేటాయించింది.

నూరు శాతం గిరిజన జనాభా ఉన్న షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని విద్యాలయాల్లో మొత్తం సీట్లు అన్నీ వారికే కేటాయిస్తోంది. 70 శాతం లోపు గిరిజన జనాభా కలిగిన నాన్‌ షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో ఎస్టీలకు 70   శాతం, ఎస్సీ, బీసీ, ఇతరులకు పది శాతం చొప్పున సీట్లు కేటాయిస్తున్నారు.


భోజనాలు చేస్తున్న గిరిజన విద్యార్థులు  

ఎన్నో పథకాల ద్వారా 
జగనన్న విద్యా కానుక పథకం ద్వారా 1నుంచి 10వ తరగతి వరకు చదివే గిరిజన విద్యార్థులకు సైతం ప్రభుత్వం కిట్‌లు అందిస్తోంది. మూడు జతల యూనిఫామ్‌ క్లాత్, టెక్ట్స్‌బుక్స్, నోట్‌ బుక్స్‌ సెట్, ఒక జత షూ, రెండు జతల సాక్స్, స్కూల్‌ బ్యాగ్, బెల్ట్, మూడు మాస్‌్కలు అందిస్తున్నారు. గత విద్యా సంవత్సరం(2022–23)లో ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 1,25,901 మంది గిరిజన విద్యార్థులు ప్రయోజనం పొందారు.

స్వచ్ఛ కార్యక్రమం కింద కౌమార బాలికలకు రుతుస్రావ సమయంలో అత్యంత భద్రత, పరిశుభ్రతను నిర్థారించడానికి నాణ్యమైన(బ్రాండెడ్‌) శానిటరీ న్యాప్‌కిన్‌లు నెలకు 10 చొప్పున 17,060 మంది బాలికలకు అందజేస్తున్నారు. మరోవైపు గిరిజన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పిల్లలకు నిజమైన అభ్యాస కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. నాడు–నేడు మొదటి దశలో ప్రభుత్వం రూ.140 కోట్లుతో 352 పాఠశాలల్లో సమగ్ర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది.

 
మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలోని మరుగుదొడ్లు   

ఉన్నత విద్యాలయాలకు శ్రీకారం 

  • రూ.153.853 కోట్లతో కురుపాంలో ఇంజనీరింగ్‌ కళాశాలకు 2020 అక్టోబర్‌ 2న సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. అకడమిక్‌ బ్లాక్, హాస్టల్‌ బ్లాకుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. 
  • విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీకి ప్రభుత్వం 561.88 ఎకరాలు కేటాయించింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం కొండకరకంలో ఏయూ పాత క్యాంపస్‌లో కొనసాగుతోంది.
  • అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో రూ.500 కోట్లతో గిరిజన వైద్య కళాశాల మంజూరైంది. వంద వైద్య విద్యా సీట్లు కేటాయించిన ఈ కళాశాల గిరిజనుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్య సేవలు అందించడంతోపాటు వైద్య పరిశోధనలకు, వైద్య వృత్తిని స్వీకరించేలా గిరిజన యువతను ప్రోత్సహించేందుకు దోహదం చేస్తుంది.  

ఐఐటీ, ఎన్‌ఐటీ ప్రవేశాల్లో గిరిజన బిడ్డల సత్తా  
గురుకులాల్లో చదివే గిరిజన బిడ్డలు ఐఐటీ, ఎన్‌ఐటీ, మెడిసిన్‌ సీట్లు సాధించేలా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. 

గిరిజన పాఠశాలల రూపురేఖలు మారాయి 
గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యావకాశాలను అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా నాడు–నేడు ద్వారా ప్రభుత్వం చేపడుతున్న పనులతో గిరిజన విద్యాలయాల రూపురేఖలు మారిపోతున్నాయి. గతంలో అరకొర వసతులు, ఎప్పుడు పడిపోతాయో తెలియనట్టు ఉండే భవనాల్లో చదువుకోవాలంటేనే గిరిజన పిల్లలకు ఆసక్తి ఉండేదికాదు. ఇప్పుడు కార్పొరేట్‌ విద్యా సంస్థలను తలదన్నే సౌకర్యాలను గిరిజన విద్యాలయాల్లో చూస్తే గిరిజనుల్లో ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలుగుతుంది. 
–  కంగాల వెంకటేశ్వరరావు, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు, ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, నూతిరామన్నపాలెం  

విద్యతోనే గిరిజనులకు గొప్ప పురోగతి 
విద్యతోనే పురోగతి అని నమ్మడమే కాకుండా అందుకు అనుగుణంగా గొప్ప సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో గిరిజనులకు కూడా విద్యావకాశాలు మెరుగుపరిచారు. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో బడులను చూస్తేనే భయం వేసేది. ఇప్పుడు అన్ని సౌకర్యాలతో గిరిజన బిడ్డలకు విద్యను అందించేలా ప్రభుత్వం నిధులకు కూడా వెనుకాడక ఖర్చు చేస్తోంది. గిరిజన విద్యార్థులకు అవసరమైన విద్యతోపాటు వసతి,  ఆహారం, సౌందర్య సాధనాలు(కాస్మోటిక్స్‌) తదితర అనేక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి 

మాకు ఇంగ్లిష్‌ చదువులు అందించారు 
మా గిరిజన పిల్లలకు మామూలు చదువులు అందడమే కష్టంగా ఉండేది. బడుల్లో సౌకర్యాలు లేక, దూరభారమైన ప్రైవేటు కాన్వెంట్లకు వెళ్లి చదువులు కొనలేక మాలాంటి ఎంతో మంది గిరిజన పిల్లలు చదువుకు దూరమయ్యేవారు. ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ మావయ్య..మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ బడులు, గురుకులాల్లో ఇంగ్లిష్‌ చదువులు అందించారు. మేము బాగా చదువుకోవాలని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. 
–ఇన్నా కరుణ జెస్సీ ప్రియ,5వ తరగతి(ఇంగ్లిష్‌ మీడియం), మారేడుమిల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 

Advertisement
 
Advertisement