కళ్యాణ్ చక్రవర్తి (ఫైల్)
కృష్ణా జిల్లాలో ఘటన
కోనేరు సెంటర్: మద్యం మత్తులో ఉన్న తండ్రీకొడుకులు గొడవ పడగా..ఆగ్రహంతో కుమారుడిని తండ్రి హత్య చేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..బందరు మండలం బోట్లవానిపాలెంకు చెందిన బొల్లా రామ్మోహనరావు తాపీ పని, అతడి పెద్ద కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి (30) పెయింటింగ్ పని చేస్తుంటారు. నాలుగేళ్ల క్రితం కళ్యాణ్‌కు గూడూరు మండలానికి చెందిన దుర్గాభవానితో వివాహం కాగా, తన భార్యతో పాటు అతడు తన అత్తవారి ఊర్లో ఉంటున్నాడు. మంగినపూడి బీచ్‌కి సమీపంలో పెయింటింగ్ పనులకు వచ్చిన కళ్యాణ్..రెండు రోజులుగా తల్లిదండ్రుల వద్దే ఉన్నాడు. గురువారం రాత్రి తండ్రీకొడుకులు మద్యం తాగారు. అనంతరం కళ్యాణ్ తన తల్లిదండ్రులతో గొడవకు దిగాడు.
ఈ క్రమంలో తండ్రీ
కొడుకులు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుకున్నారు. ఓ దశలో తీవ్ర ఆగ్రహంతో తండ్రి రామ్మోహనరావు మంచంపై పడుకుని ఉన్న కళ్యాణ్ తలపై సరుగుడు బాదుతో బలంగా కొట్టగా తలకు గాయాలై కళ్యాణ్ స్పృహ కోల్పోయాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో బంధువులు అతడిని మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు ఆసుపత్రికి వచ్చి ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. మృతుని భార్య దుర్గాభవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


