అనుమతిచ్చారు.. కొనడం మరిచారు! | YSRCP led farmer protest at Ongole Collectorate | Sakshi
Sakshi News home page

అనుమతిచ్చారు.. కొనడం మరిచారు!

Jul 18 2026 4:44 AM | Updated on Jul 18 2026 4:44 AM

YSRCP led farmer protest at Ongole Collectorate

150 మిలియన్‌ కేజీల పొగాకు సాగుకు అనుమతిచ్చిన ప్రభుత్వం

అనుమతిచ్చిన మేరకైనా కొనుగోలు చేయకుండా నాటకాలు 

వైఎస్సార్‌సీపీ నాయకుల ఆగ్రహం 

పొగాకు రైతుల ఆందోళన ధర్మాగ్రహమని ఉద్ఘాటన 

ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో రైతు నిరసన దీక్ష  

చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌ ప్రాంతం 

ఒంగోలు టౌన్‌: మూడు నెలలుగా గిట్టుబాటు ధరల కోసం పోరాటాలు చేస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై పొగాకు రైతులు చేస్తున్న ఆందోళన.. ధర్మాగ్రహమని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 మిలియన్‌ కేజీల పొగాకు సాగుకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. అనుమతిచ్చిన మేరకైనా పొగాకు కొనుగోలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. నగరంలోని కలెక్టరేట్‌ వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం పొగాకు రైతు నిరసన దీక్ష జరిగింది.  

పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు అధ్యక్షత వహించిన ఈ ఆందోళన కార్యక్రమంలో పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి,  మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు తదితరులు ప్రసంగిస్తూ,  ‘పోలీసులు అనుమతివ్వకపోయినా ఒంగోలు కలెక్టరేట్‌ ముందు ధర్నాకు వేలాది మంది తరలిరావడం ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం. 

ఆక్వారంగంసహా రాష్ట్రంలో రైతులందరూ గిట్టుబాటు ధర లభించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అమరావతి పేరుతో ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్క్‌ఫెడ్‌ ద్వారా పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటే..చంద్రబాబు ప్రభుత్వం రైతు సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసింది’ అని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కలెక్టరేట్‌ పరిసరాలు దద్దరిల్లాయి.  నిరసన దీక్షలో జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కె.నాగార్జునరెడ్డి, దద్దాల నారాయణ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.  

ఐదు పంటల పేర్లు చెప్పగలిగితే.. రాజకీయాలకు గుడ్‌బై: లోకేశ్‌కు కాకాణి సవాల్‌ 
‘మంత్రి లోకేశ్‌కు సవాల్‌ విసురుతున్నా.. నేను ఐదు రకాల పంటలు చూపిస్తా.  వాటి పేర్లు లోకేశ్‌ చెప్పగలిగితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని కాకాణి గోవర్ధన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. కనీసం పంటల పేర్లు కూడా తెలియని లోకేశ్‌ లాంటి వారు వ్యవసాయం గురించి మాట్లాడటం సరికాదని ఎద్దేవా చేశారు. రైతులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తే, దీనిని ఎత్తివేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులను కష్టాల కడలిలోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకో­వా­లని డిమాండ్‌ చేశారు. లేదంటే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement