సాక్షి, అమరావతి: జార్ఖండ్– ఉత్తర ఒడిశాపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం తెలిపింది. దీని ప్రభావంతో సముద్రంలో అలల ఉధృతి పెరిగే అవకాశం ఉందని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో శనివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
24 జిల్లాల్లో లోటు వర్షపాతం
రాష్ట్రంలోని 24 జిల్లాల్లో లోటు వర్షపాతం, మరో నాలుగు జిల్లాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. అలాగే రాష్ట్రంలో జూన్ 1 నుంచి జూలై 15 వరకు సాధారణ వర్షపాతంతో పోలిస్తే 48.3 శాతం లోటు వర్షపాతం నమోదైందని ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) జి.సాయిప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సీఎస్ ఆదేశించారు.


