
సాక్షి, ఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లు తేలేవరకు.. ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్లు విచారించవద్దన్న ఏపీ హైకోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బెయిల్ రద్దు, బెయిల్ పిటిషన్లను మెరిట్ ఆధారంగానే నిర్ణయించాలని స్పష్టం చేస్తూ.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది.
అక్రమ మద్యం కేసులోచెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తీర్పు సందర్భంగా.. ‘‘ఈ కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఇమిడి ఉంది. బెయిల్ కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎదురు చూడాలనే ఆదేశం ఏమాత్రం సరికాదు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే. బెయిల్ రద్దు పిటిషన్లు గానీ, బెయిల్ పిటిషన్లు గానీ మెరిట్ ఆధారంగానే నిర్ణయించాలి’’ జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏ-38 నిందితుడిగా ఉన్నారు. తుడా (Tirupati Urban Development Authority) అధికార వాహనాలను ఉపయోగించి అక్రమ మద్యం డబ్బును తరలించారని, 2024 ఎన్నికల నిధుల కోసం అక్రమంగా ఆ డబ్బును వాడినట్లు సిట్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో..
ఈ ఏడాది జూన్ 18న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తానే తప్పూ చేయలేదని.. దేవుడు అంతా చూస్తున్నాడని.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని పలుమార్లు ఆయన జైలు, కోర్టు బయట ఆవేదన వ్యక్తం చేయడం చూసిందే. మరోవైపు.. బెయిల్ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటిదాకా ఫలించ లేదు. తాజాగా సుప్రీం కోర్టు జోక్యం నేపథ్యంలో ఆయనకు ఉపశమనం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: లిక్కర్ కేసులో మోహిత్‌రెడ్డికి బిగ్ రిలీఫ్