
సాక్షి, ఢిల్లీ: అక్రమ మద్యం కేసులో వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి(chevireddy mohith reddy)కి భారీ ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీం కోర్టు ఆయనకు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే.. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
లిక్కర్ కేసులో మోహిత్ రెడ్డిని ఏ-39గా, ఆయన తండ్రి.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఏ38 నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. జూన్ 18వ తేదీన భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం విజయవాడ జైల్లో ఆయన జ్యుడీషియల్ రిమాండ్ మీద ఉన్నారు. ఇక.. మద్యం ముడుపుల సొమ్మును మోహిత్ అధికార వాహనాల ద్వారా తరలించారన్నది సిట్ ఆరోపణ. అయితే..
ఈ కేసులో ఉపశమనం కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. ఊరట దక్కలేదు. దీంతో సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మోహిత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించగా.. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూత్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదించారు. జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
కేవలం తన పేరుతో ఉన్న కారులో డబ్బు పట్టుబడ్డాయని కేసు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారని మోహిత్‌రెడ్డి న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే.. మోహిత్‌రెడ్డి వాదనలతో ఏకీభవించిన జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చింది.
ఇదీ చదవండి: టార్గెట్ ఎస్సీలు.. బాబు కుతంత్రం
