
విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి భాస్కరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేయించిన వైనం
మద్యం కేసులో నిందితులకు నిబంధనల మేరకే బెయిల్ మంజూరు
అది జీర్ణించుకోలేక రగిలి పోతున్న బాబు అండ్ కో
సాక్షి, అమరావతి: ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..? అంటూ గతంలో ఎస్సీలను ఘోరంగా అవమానించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మరోసారి ఎస్సీలను లక్ష్యంగా చేసుకున్నారు. మద్యం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి భాస్కరరావు ఇటీవల వరుసగా బెయిళ్లు మంజూరు చేస్తూ వస్తుండటంతో చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎస్సీ అయిన ఆయన్ను లక్ష్యంగా చేసుకుని న్యాయ చరిత్రలో ఎన్నడూ, ఎవ్వరూ చేయని విధంగా తన ఆస్థాన న్యాయవాది సిద్దార్థ లూథ్రా చేత హైకోర్టులో అనుచిత వ్యాఖ్యలు చేయించారు.
భాస్కరరావు నిబంధనల మేరకు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి వైఎస్సార్‌సీపీ నేతలకు బెయిల్ మంజూరు చేస్తుండటాన్ని సహించలేని చంద్రబాబు.. ఆ న్యాయాధికారిపై తన అసహనాన్ని, ఆక్రోశాన్ని లూథ్రా ద్వారా వెళ్లగక్కించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ పీవీ మిధున్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో లూథ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. భాస్కరరావును ఏసీబీ కోర్టు నుంచి బదిలీ చేయించాలని తాను ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు లూథ్రా బహిరంగంగానే తెలిపారు.
భాస్కరరావు తాము చేస్తున్న ప్రతీ వాదనను తోసిపుచ్చుతున్నారని, తమ వాదనలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా వైఎస్సార్‌సీపీ నేతలకు బెయిల్ మంజూరు చేసేస్తున్నారని లూథ్రా కోర్టుకు నివేదించారు. ఇటీవల మిధున్‌రెడ్డికి బెయిల్ మంజూరు సందర్భంగా తాము చేసిన ఏ వాదనను కూడా ఆయన పట్టించుకోకుండా తీర్పు ఇచ్చారని తెలిపారు. సీఆర్‌పీసీ సెక్షన్ 161 కింద, సెక్షన్ 164 కింద సాక్షులు ఇచ్చిన సాక్ష్యాలను సైతం ఆయన పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
అంతేకాక గూగుల్ టేకౌట్‌ను కూడా పట్టించుకోలేదన్నారు. ఎన్ని ఆధారాలు సమర్పించినా వాటిని ఆరోపణలనే పేర్కొంటూ ఆధారాల్లేవని చెబుతున్నారని తెలిపారు. మిధున్‌రెడ్డి ఏ నేరం చేయలేదంటూ క్లీన్ చీట్ ఇచ్చేశారన్నారు. బెయిలు మంజూరు సమయంలో భాస్కరరావు ఏ ఒక్క నిబంధనను కూడా పాటించలేదని తెలిపారు.
మిధున్‌రెడ్డికి బెయిల్ తీర్పును కొట్టేయాలని పిటిషన్
మద్యం కేసులో మిధున్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ సీఐడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పులోని పలు అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తింది. ఆ తీర్పులోని అంశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి ప్రతాప గురువారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా మిధున్‌రెడ్డికి బెయిల్ ఇస్తూ ఇచ్చిన తీర్పులోని పలు అంశాలను స్టే చేయాలని, లేని పక్షంలో మిగిలిన నిందితులు ఆ అంశాలను ఆధారంగా చేసుకుని బెయిల్ పొందే అవకాశం ఉందని సిట్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదించారు.
దర్యాప్తు మొత్తం ప్రభావితం అయ్యేలా మిధున్‌రెడ్డికి ఏసీబీ కోర్టు న్యాయాధికారి బెయిల్ ఇచ్చారని తెలిపారు. దీని వల్ల మొత్తం దర్యాప్తే నిర్వీర్యమై పోతుందన్నారు. మిధున్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసే సమయంలో అతని పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించిందని లూథ్రా తెలిపారు. ఇదిలా ఉండగానే న్యూయార్క్‌లోని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు వీలుగా పార్లమెంటరీ కార్యదర్శి నుంచి సెప్టెంబర్ 26న మిధున్‌రెడ్డికి మెయిల్ వచ్చిందన్నారు.
అప్పుడు మిధున్‌రెడ్డి జైల్లో ఉన్నారని తెలిపారు. ఈ సమావేశాల్లో పాల్గొనే నిమిత్తం న్యూయార్క్ వెళ్లేందుకు వీలుగా మిధున్‌రెడ్డికి ఏసీబీ కోర్టు పాస్‌పోర్టును వెనక్కి ఇచ్చేసిందన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి షరతులు విధించలేదన్నారు. ఈ సందర్భంగా సిట్ తరఫున లూథ్రా ఏసీబీ కోర్టు న్యాయాధికారిపై పలు ఆరోపణలు చేశారు.
ఏకపక్షంగా స్టే ఇవ్వలేం
మిధున్‌రెడ్డికి బెయిలిస్తూ ఇచ్చిన తీర్పులోని అంశాలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. మిధున్‌రెడ్డి వాదనలు వినకుండా ఏకపక్షంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సోమవారం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్‌రెడ్డి తదితరుల బెయిల్ పిటిషన్లపై విచారణ ఉందని, మిధున్‌రెడ్డికి ఇచ్చిన తీర్పులోని అంశాలను స్టే చేయాలంటూ తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను తేల్చేంత వరకు తన ముందున్న వ్యాజ్యాలపై విచారణ జరపకుండా ఏసీబీ కోర్టును నియంత్రించాలని లూథ్రా హైకోర్టును కోరారు.
ఇందుకు అంగీకరించిన హైకోర్టు.. సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై తాము నిర్ణయం వెలువరించేంత వరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరుల పిటిషన్లపై విచారణ జరపొద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. కాగా, సిట్ తరఫున ఇంకా హైకోర్టు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.
వ్యక్తిగత పర్యటన కాదు.. అది ప్రతిష్టాత్మక సమావేశం
ఈ సమయంలో మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది తప్పెట నాగార్జునరెడ్డి స్పందిస్తూ, అనుబంధ పిటిషన్‌కు సంబంధించిన కాపీలను సిట్ తరఫు న్యాయవాదులు ఇప్పుడే తమకు అందచేశారన్నారు. వాటన్నింటినీ పరిశీలించి తగిన విధంగా స్పందించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. మి«థున్‌రెడ్డి పాల్గొనే సమావేశం చాలా ప్రతిష్టాత్మకమైనదని చెప్పారు. ఈ సమావేశానికి వెళుతున్న అతి తక్కువ మందిలో మిథున్ రెడ్డి ఒకరని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పార్లమెంట్ కార్యదర్శి నుంచి మెయిల్ వచ్చాక పాస్‌పోర్ట్‌ను వెనక్కి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశామన్నారు.
సమావేశంలో పాల్గొనే హక్కు ఎంపీగా మిథున్‌రెడ్డికి ఉందని, దానిని పరిగణనలోకి తీసుకునే ఏసీబీ కోర్టు పాస్‌పోర్ట్‌ను వెనక్కి ఇచ్చిందన్నారు. మిథున్ దేశం తరఫున ఆ సమావేశానికి వెళుతున్నారే తప్ప అది వ్యక్తిగత పర్యటన కాదన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. బెయిల్ మంజూరు చేసిన న్యాయాధికారికి ఉద్దేశాలు ఆపాదించడం సరికాదన్నారు.
ఎంపీ తన వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లడం లేదని, అధికారిక కార్యక్రమంలో భాగంగానే వెళ్తున్నారని.. ఈ ప్రోగ్రాం మొత్తాన్ని పీఎంవో పర్యవేక్షణ చేస్తుందని తెలిపారు. చెవిరెడ్డి తదితరుల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు సోమవారం విచారణ జరుపుతుంది కాబట్టి, మిధున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌లోని అంశాలపై స్టే ఇవ్వాలని ఎలా కోరతారని ఆయన ప్రశ్నించారు. స్టే కావాలనుకుంటే అందుకు ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
లూథ్రా సిఫారసు చేస్తే సరిపోతుందా?
ఏసీబీ కోర్టు జడ్జి భాస్కరరావును అక్కడి నుంచి బదిలీ చేయించాలని తాను ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు లూథ్రా చెప్పిన నేపథ్యంలో ఓ న్యాయాధికారి బదిలీ అంత సులభమా అని సందేహం కలుగుతోంది. ప్రభుత్వం అనుకున్నంతనే న్యాయాధికారి బదిలీ జరిగిపోదు. న్యాయవాదులు ప్రభుత్వ పరిధిలో హైకోర్టు నియంత్రణలో పని చేస్తుంటారు. వారిని బదిలీ చేసే అధికారం హైకోర్టుకే ఉంటుంది. ప్రభుత్వానికి కేవలం న్యాయాధికారుల బదిలీని నోటిఫై చేసే అధికారం మాత్రమే ఉంటుంది.
న్యాయాధికారుల బదిలీల విషయంలో హైకోర్టుదే తుది నిర్ణయం. న్యాయాధికారుల బదిలీల విషయంలో పరిపాలన హెడ్‌గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన సహచర సీనియర్ న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి ఉంటారు. ఆ కమిటీనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లూథ్రా సిఫారసు చేశారనో, ప్రభుత్వం అడిగిందనో బదిలీ చేయడం ఉండదు. అందునా సీఐడీకి నచ్చని విధంగా న్యాయాధికారి వ్యవహరిస్తున్నారనే కారణంతో బదిలీ చేయడం అన్నది జరిగే పని కాదు.