
20వేల మందికి జీవనోపాధితో స్ఫూర్తినిస్తున్న విజయనగరం వాసి
సీఐఐ వుమెన్ ఎగ్జంప్లర్ 2024 అవార్డు అందుకున్న సరస్వతి మల్లువలస
న్యూఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి అవార్డు స్వీకరణ
ప్రశంసాపత్రం, ట్రోఫీతో పాటు రూ.మూడు లక్షల నగదు ప్రదానం
సాక్షి, అమరావతి: నిజ జీవితంలో పేదరికం, సామాజిక, లింగ వివక్ష వంటి రుగ్మతలను సమర్థంగా ఎదుర్కొని తోటి మహిళలకు ఆదర్శంగా నిలిచిన విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సరస్వతి మల్లువలస జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. సీఐఐ ఫౌండేషన్ మహిళా సాధికారతను ప్రోత్సహించడంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, సామాజిక లింగ – ఆధారిత వివక్షను ఎదుర్కొన్న అట్టడుగు మహిళా నాయకులను గుర్తించి ఎగ్జంప్లర్ పేరుతో అవార్డునిస్తోంది.
ఇందులో భాగంగా సీఐఐ వుమెన్ ఫౌండేషన్ 19వ ఎడిషన్‌లో సూక్ష్మ మధ్య చిన్నతరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ) రంగంలో సరస్వతి ఎంపిక కాగా శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అవార్డును అందించారు. మొత్తం మూడు విభాగాల్లో అవార్డులను ప్రకటించగా విద్యారంగం నుంచి మహారాష్ట్రకు చెందిన రంజిత పవార్, ఆరోగ్యరంగంలో బిహార్‌కు చెందిన రుమీ పర్వీన్, ఎంఎస్‌ఎంఈ రంగంలో మన రాష్ట్రానికి చెందిన సరస్వతి ఎంపికయ్యారు.
అవార్డు గ్రహీతలకు ట్రోఫీ, సర్టిఫికెట్‌తో పాటు రూ.మూడు లక్షల నగదును అందజేశారు. ఈ అవార్డు కోసం దేశవ్యాప్తంగా మొత్తం 300మంది పోటీపడగా వాటిలో తుది పోటీకి 16మందిని ఎంపిక చేసి స్వయంగా వెళ్లి పరిశీలించి, వారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసినట్లు సీఐఐ శుక్రవారం పేర్కొంది.
మహిళా రైతులతో నెట్‌వర్క్
విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సరస్వతి మల్లువలస నిజజీవితంలో గృహ హింస, లింగ వివక్షను ఎదుర్కొన్నారు. ఆహార భద్రత, ఆర్థిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడాల్సి రావడమే ఈ వివక్షకు ప్రధాన కారణమని గుర్తించిన ఆమె ఇంకెవ్వరూ ఇలాంటి కష్టాలు ఎదుర్కోకూడదని మిల్లెట్ సిస్టర్స్ పేరుతో చిన్న స్థాయి మహిళా రైతుల నెట్‌వర్క్‌ను స్థాపించారు. దీని ద్వారా 20,000 మంది మహిళలకు ఆదాయాన్ని మెరుగుపర్చేలా జీవనోపాధిని కల్పించి ఆదర్శంగా నిలిచారు.
మహిళా సాధికారితలో అయిదు ‘ఈ’లు ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ, ఎంప్లాయిమెంట్, ఎకనావిుక్ డెవలప్‌మెంట్, ఎంపవర్‌మెంట్ ప్రధానమైనవిగా గుర్తించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సీఐఐ 19వ ఎడిషన్‌లో ఎంపికైన 16 మందితో కలిపి ఇప్పటి వరకు 120 కంటే ఎక్కువ మందిని గుర్తించామని, వీరి ద్వారా 30 లక్షల మంది జీవితాల్లో స్పష్టమైన మార్పులను గమనిస్తున్నట్లు సీఐఐ పేర్కొంది.