చెరబట్టిన పచ్చ తోడేళ్లు
ప్రకాశం బ్యారేజీ ఎగువన, దిగువన కృష్ణా నదీ గర్భంలో అడ్డగోలుగా ఇసుక తవ్వకం
8–9 మీటర్ల లోతు వరకు ఇసుకను తవ్వేసి అక్రమంగా తరలిస్తున్న మాఫియా
హైదరాబాద్ సహాతెలంగాణ, విజయవాడ, గుంటూరులలో విక్రయం
ఇప్పటికే రూ.వంద కోట్లకు పైగా కొల్లగొట్టిన వైనం
సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ బంగ్లాకు కూతవేటు దూరంలోనే స్మగ్లర్లు ఇష్టారాజ్యం
బ్యారేజీ దిగువన గుండిమెడ వద్ద నదీ స్వరూపమే మారిపోయిందని పర్యావరణవేత్తల ఆందోళన
2014–19 మధ్య కూడా ప్రకాశం బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో ఇసుక దోచేసిన స్మగ్లర్లు
అప్పట్లో చంద్రబాబు సర్కార్‌పై రూ.వంద కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ
సాక్షి, అమరావతి: బిరా బిరా పరుగులిడుతూ రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తున్న కృష్ణమ్మను ‘పచ్చ’ తోడేళ్లు చెరబట్టాయి. ప్రకాశం బ్యారేజీ ఎగువన, దిగువన నదీ గర్భంలోని ఇసుకను భారీ పొక్లెయిన్‌లు, డ్రెడ్జర్‌లతో అడ్డగోలుగా తవ్వేస్తున్నాయి. రాజధాని నిర్మాణ పనుల పేరుతో ప్రకాశం బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో భారీ ఎత్తున ఇసుకను తవ్వేస్తూ.. రోజూ వేలాది టిప్పర్లలో ఇసుకను హైదరాబాద్ సహా తెలంగాణ ప్రాంతానికి తరలించి విక్రయిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కూడా నదీ గర్భాన్ని అడ్డదిడ్డంగా తవ్వేస్తూ.. భారీ ఎత్తున టిప్పర్లలో ఇసుకను గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌కు తరలించి, విక్రయిస్తూ రూ.కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ బంగ్లాకు కూతవేటు దూరంలోనే సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) మార్గదర్శకాలను తుంగలో తొక్కి, ఇసుకను తవ్వేస్తూ అక్రమంగా తరలిస్తుండటం గమనార్హం. ప్రకాశం బ్యారేజీ దిగువన ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ వద్ద కృష్ణా నదిలో అడ్డగోలుగా తవ్వేయడంతో నది స్వరూపమే మారిపోయిందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2014–19 మధ్య కూడా కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడంలో విఫలమైన చంద్రబాబు సర్కార్‌పై అప్పట్లో ఎన్జీటీ రూ.100 కోట్ల జరిమానా విధించడం సంచలనం రేపిన విషయం విదితమే. ఇప్పుడు రెండేళ్లుగా అదే రీతిలో ఇసుకను దోచేస్తున్నా సర్కారు పట్టించుకోక పోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
సుప్రీంకోర్టు ఉత్తర్వులు తుంగలోకి..
పర్యావరణ పరిరక్షణ చట్టం–1986, వాయు కాలుష్య నియంత్రణ చట్టం–1981, జల పరిరక్షణ, కాలుష్య నియంత్రణ చట్టం–1974, ఈఐఏ9 (పర్యావరణ ప్రభావ అంచనా) నోటిఫికేషన్–2006, ఇసుక మైనింగ్‌మార్గదర్శకాలు–2016, ఇసుక తవ్వకంపై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ 2020లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఇసుక క్వారీలకు అనుమతులు ఇవ్వడానికి జిల్లా స్థాయిలో జిల్లా ఇసుక కమిటీల(డీఎల్‌ఎస్‌ఈ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
గనులు, భూగర్భ జలాల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. ఏ ప్రాంతంలో ఇసుక తవ్వుకోవచ్చో సర్వే చేసి, పర్యావరణ అనుమతులు ఇచ్చేది ఈ కమిటీనే. అనుమతి ఇచ్చిన రీచ్‌లలో కూడా ఒక మీటరు లోతు వరకే ఇసుకను మనుషులతో తవ్వించాలి. ఎలాంటి యంత్రాలు ఉపయోగించకూడదు. అది కూడా పగటి పూట మాత్రమే ఇసుక తవ్వాలి. కానీ.. పచ్చ ఇసుక తోడేళ్లు సుప్రీంకోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కేస్తూ అడ్డగోలుగా ఇసుకను రేయింబవళ్లు తవ్వేస్తూ.. రూ.వందల కోట్లు కొల్లగొడుతున్నారు.
రాజధాని ముసుగులో దోపిడీ
ప్రకాశం బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం ఇసుకను కేటాయించింది. ఇదే అదునుగా ఇసుక తోడేళ్లు కృష్ణా నదిని చెరబట్టాయి. ముఖ్యనేత సన్నిహితులైన మాఫియా నేతలు.. తాళ్లాయపాలెం, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, హరిశ్చంద్రాపురం వరకు భారీ ఎత్తున పొక్లెయిన్‌లు, డ్రెడ్జర్‌లతో 24 గంటలూ ఇసుకను తవ్వేస్తున్నారు.
వేలాది టిప్పర్లలో ఇసుకను హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాలకు తరలిస్తూ రూ.వందల కోట్లు కొల్లగొడుతున్నారు. సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ బంగ్లాకు కూతవేటు దూరంలో తాళ్లాయపాలెం వద్ద భారీ ఎత్తున ఇసుకను తవ్వేస్తూ అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాజధాని నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుంటే ఇసుక మాత్రం లక్షలాది టన్నులు తరలిస్తూ భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారనే చర్చ కాంట్రాక్టర్లలో సాగుతోంది.
పర్యావరణానికీ పెనుముప్పు
నదీ గర్భాన్ని ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా తవ్వేయడం వల్ల కృష్ణా బేసిన్‌లో పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతోందని, మత్స్య సంపద, జంతువులకే కాకుండా మనుషుల జీవన ప్రమాణాలను ఘోరంగా దెబ్బ తీస్తుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదిలో ఒక మీటరు కంటే ఎక్కువ లోతుకు ఇసుక తవ్వకూడదు. కానీ.. కృష్ణా నదిలో 8–9 మీటర్ల లోతు వరకు ఇసుకను తవ్వేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. కొద్దోగొప్పో ఉన్న నీళ్లు కలుషితమైపోయాయి. తీర ప్రాంత గ్రామాల ప్రజలకు భూగర్భ జలాలే తాగునీటికి ఆధారం. కలుషిత నీటిని తాగుతున్న ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. సాగుకూ ఆ జలాలే ఆధారం. కలుషిత నీటి వల్ల పంట పొలాలు చౌడుబారిపోతున్నాయి. నదీ గర్భాన్ని అడ్డగోలుగా తవ్వేయడం వల్ల మత్స్య సంపద నశించిపోతోంది. వేలాది మంది మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోతోంది.
బ్యారేజీ దిగువ గ్రామాలకు ముంపు ముప్పు
ప్రకాశం బ్యారేజీకి దిగువన తాడేపల్లి మండలం గుండిమెడ, చిరావూరు, కొల్లిపర మండలం మున్నంగి ప్రాంతాల్లో కృష్ణా నది గర్భాన్ని ఇసుక మాఫియా నేతలు ఇష్టారాజ్యంగా తవ్వేశారు. దాంతో ఆ ప్రాంతాల్లో నదీ స్వరూపం పూర్తిగా మారిపోయింది. గుండిమెడ వద్ద 4.971 హెక్టార్లలో 49,710 క్యూబిక్ మీటర్ల ఇసుకను మాత్రమే తవ్వడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ.. అక్రమార్కులు భారీ పొక్లెయిన్‌లతో ఎనిమిది నుంచి పది మీటర్ల లోతు వరకు తవ్వుతూ సుమారు 7–9 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను కొల్లగొట్టి.. రూ.వందల కోట్లు వెనకేసుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. దాంతో నది స్వరూపం మారిపోయి చేపల చెరువులను తలపిస్తోంది.
గుండిమెడ వద్ద కృష్ణా నదిలో నాలుగు ఇసుక దిబ్బలు ఉండేవి. 2024 నుంచి ఇప్పటికే మూడు ఇసుక దిబ్బలు మాయం అయ్యాయి. మరో ఇసుక దిబ్బ కూడా ఒకట్రెండు నెలల్లో మాయం అవుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. కృష్ణా నదికి 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా, తమ గ్రామానికి ముంపు ముప్పు ఉండేది కాదని.. ఇసుక దిబ్బలు కరకట్టగా నిలిచేవని.. ఇప్పుడు వాటిని ఇసుక స్మగ్లర్లు తొలగించడం వల్ల 3 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తమ గ్రామాలను కృష్ణమ్మ ముంచెత్తుతుందని గుండిమెడ, చిరావూరు, రామచంద్రాపురం వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండిమెడ ఇసుక రీచ్ నుంచి రోజూ 400 టిప్పర్ల ఇసుకను తరలిస్తూ.. 20 టన్నుల లారీ ఇసుకను రూ.40 వేలకు విక్రయిస్తూ ఇప్పటికే రూ.వంద కోట్లు వెనకేసుకున్నారని చెబుతున్నారు.


