సాక్షి, తాడేపల్లి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో.. చేపల వేటకు వెళ్లిన బోటు సముద్రంలో గల్లంతు కావడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాళ్లు సురక్షితంగా బయటకు రావాలని ఆకాంక్షించిన ఆయన.. గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని జగన్ పేర్కొన్నారు. వారి ఆచూకీ లభించే వరకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బోటులో ఉన్న 8 మంది మత్స్యకారుల ఆచూకీ కోసం అందుబాటులో ఉన్న అన్ని వ్యవస్థలను రంగంలోకి దించి మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావాలని ప్రభుత్వానికి వైఎస్ జగన్ సూచించారు.
అన్ని వ్యవస్థలను రంగంలోకి దించాలి
కోస్ట్‌గార్డ్, నేవీ, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో రంగంలోకి దించాలని జగన్ సూచించారు. సముద్రంలో గాలింపు చర్యలకు అవసరమైన అన్ని వనరులను వినియోగించాలని కోరారు. కేవలం ప్రభుత్వ యంత్రాంగంపైనే ఆధారపడకుండా కాకినాడ, విశాఖపట్నం, పారాదీప్ తదితర సముద్ర తీర ప్రాంతాల్లోని మత్స్యకారుల బోట్లు, ఇతర నౌకల సహకారాన్ని కూడా తీసుకోవాలని సూచించారు.
అలసత్వం వద్దు
గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని జగన్, ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని సూచించారు. “గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. వారి ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి” అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.


