అమరావతి భూములపై బాబు కాకి లెక్కలు | Sajjala Ramakrishna Reddy Slams Chandrababu Naidu: AP | Sakshi
Sakshi News home page

అమరావతి భూములపై బాబు కాకి లెక్కలు

Apr 13 2026 2:22 AM | Updated on Apr 13 2026 2:22 AM

Sajjala Ramakrishna Reddy Slams Chandrababu Naidu: AP

వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో–ఆర్డీనేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం

అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అంటూ మళ్లీ అబద్ధాలు

కనీస మౌలిక సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు కావాలి

వడ్డీలకే ఏటా రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు అవుతుంది

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అని, ప్రభుత్వం చేతిలో ఉన్న ఐదు వేల ఎకరాల ల్యాండ్‌ బ్యాంక్‌ విలువ ప్రస్తుత రేట్ల ప్రకారం రూ.50 వేల కోట్లు పైమాటేనంటూ కాకి లెక్కలతో నమ్మించటానికి యత్నించి సీఎం చంద్రబాబు మరోసారి అడ్డంగా దొరికిపోయారని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో–ఆర్డీనేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించా­రు. అమరావతిపై ద్వేషంతోనే వైఎస్సార్‌సీపీ విమర్శలు చేస్తోందంటూ చంద్రబాబు మరోసారి పచ్చి అబద్ధాలాడుతున్నారని ధ్వజమెత్తారు.

అమరా­వతి పేరుతో రాష్ట్రాన్ని శాశ్వతంగా అప్పుల ఊబి­లో ముంచే చంద్రబాబు మార్క్‌ ‘ఎండమావి’ కావాలా? లేక అందులో పదో వంతు ఖర్చుతో (అది కూడా దశలవారీగా) రాష్ట్ర రాజధానిని అతి స్వల్ప కాలంలోనే అగ్రశ్రేణి నగరాల సరసన నిలిపే జగన్‌ మార్క్‌ గ్రోత్‌ ఇంజన్‌ ‘మావిగన్‌’ కావాలో ప్రజలు ఆలోచించాలని ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.

అమరావతిలో చంద్రబాబు ఇంటి కోసం కొనుగోలు చేసిన 25 వేల గజాల (5 ఎకరాలు) స్థలం ధర గజం రూ.7,500 మాత్రమే. దస్తావేజుల ప్రకారం ఎకరం భూమి విలువ రూ.3.63 కోట్లు. నిజానికి ఆ ప్రాంతంలో ప్రభుత్వ రికార్డుల (ఎస్‌ఆర్‌ఓ) ప్రకారం గజం ధర రూ.6 వేలు మాత్రమే. ఆ ప్రకారం అక్కడ ఎకరం భూమి విలువ రూ.2.91 కోట్లు. చంద్రబాబు కొనుగోలు చేసిన ధర ప్రకారం ఐదు వేల ఎకరాలు అమ్మితే వచ్చేది దాదాపు రూ.18 వేల కోట్లు మాత్రమే. అంతకు మించి పైసా రాదు. 

రాష్ట్రం మీద పడే భారం మాటేమిటి? 
అమరావతిలో చంద్రబాబు సర్కారు ఇప్పటికే ఇచ్చిన కాంట్రాక్ట్‌ల విలువ రూ.50 వేల కోట్లకు పైనే. అక్కడ రోడ్లు లాంటి మౌలిక సదుపాయాల కోసం ఆయన చెబుతున్న ప్రకారమే రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది అంతా అప్పులు చేసే. ఇంకా తెచ్చేది కూడా అప్పే. దానికి వడ్డీ లెక్క వేస్తే రూ.2 లక్షల కోట్లకు ఏటా రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు అవుతుంది. ఎకరం రూ.20 కోట్లు పలికేలా అభివృద్ధి చెందడానికి 20 ఏళ్లు పడుతుందని చంద్రబాబు చెబుతుండగా 15 ఏళ్లు పడుతుందని ఆయన కుమారుడు అంటున్నారు. అప్పటికి వడ్డీ రూ.3 లక్షల కోట్లో రూ.4 లక్షల కోట్లో అవుతుంది. ఆ వడ్డీ కట్టడానికి కూడా మళ్లీ అప్పు చేయాల్సిందే కదా? చంద్రబాబు ఆయన కోసం సంపద సృష్టించుకుంటే, రాష్ట్రం మీద పడే భారం మాటేమిటి? దీనిపై రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement