విద్యాశాఖ అస్తవ్యస్తం | Negligence in the Education Department of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

విద్యాశాఖ అస్తవ్యస్తం

Apr 13 2026 2:17 AM | Updated on Apr 13 2026 2:17 AM

Negligence in the Education Department of Andhra Pradesh

మూల్యాంకనం.. పరీక్షలు.. బోధన.. ఒకేసారి  

పదో తరగతి మూల్యాంకనం సమయంలోనే 9వ తరగతికి బ్రిడ్జికోర్సు బోధన 

ఇతర తరగతులకు వార్షిక పరీక్షలు 

సిబ్బంది లేక స్కూళ్లల్లో సర్కస్‌ ఫీట్లు 

పాఠ్యపుస్తకాలు లేకుండా ఇంటర్‌ తరగతులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యాశాఖలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. బోధన నుంచి పరీక్షల నిర్వహణ వరకు పద్ధతి లేకుండా అస్తవ్యస్తం చేశారు. ఇష్టారీతిన చేస్తున్న ప్రయోగాలతో అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు ప్రయోజనం లేకపోగా.. అదనపు భారంతో అవస్థలు పడుతున్నారు. పాఠశాల విద్యలోనూ, ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖలో ఇవే విధానాలు కొనసాగుతున్నాయి. ఎక్కడైనా శాఖలో వ్యతిరేక ఫలితాలు వస్తే దానిపై సంబంధితశాఖ మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించి తప్పులను సరిచేస్తారు. కానీ విద్యాశాఖలో మాత్రం అన్నీ అధికారులకు అప్పగించి మంత్రి చోద్యం చూస్తున్నారు. 2025–26 విద్యాసంవత్సరంలో మోడల్‌ ప్రైమరీ స్కూళ్లలో మొదలైన ప్రయోగాలు వికటించి ఆయా స్కూళ్లు మూతబడే స్థితికి చేరుకున్నాయి.

జూన్‌లో ప్రారంభించాల్సిన విద్యాసంవత్సరాన్ని ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు ఏప్రిల్‌ ఒకటినే ప్రారంభించారు. పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా, లెక్చరర్లు లేకుండా బోధన మాత్రం జరిగిపోతున్నట్టు కలరింగ్‌ ఇస్తున్నారు. ఒక విద్యాసంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ఒకసారి, 1–9 తరగతుల వార్షిక పరీక్షలు ఒకేసారి జరుగుతాయి. అలాగే విద్యాసంవత్సరం జూన్‌ రెండోవారంలో ప్రారంభమవుతుంది. కానీ గత విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి రెండో ఏడాది విద్యార్థులకు విద్యాసంవత్సరం ప్రారంభిస్తున్నారు.

అన్ని కాలేజీల్లోనూ ఏప్రిల్‌ 23 వరకు తరగతులు నిర్వహించాలని సిలబస్‌ సైతం ఇచ్చారు. ఈ సమయంలో జూనియర్‌ లెక్చరర్లు వార్షిక పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం విధుల్లో ఉన్నారు. మూల్యాంకనం జూనియర్‌ కాలేజీల్లోనే జరుగుతుండడంతో విద్యార్థులను అనుమతించే పరిస్థితి కూడా లేదు. మరోపక్క అవసరమైన పాఠ్యపుస్తకాలు సైతం ప్రభుత్వం ఇవ్వకుండా తరగతులు ఎలా నిర్వహిస్తుందనే విషయం ఎవరికీ అంతుబట్టని అంశంగానే మిగిలిపోయింది. వేసవి ఎండల్లో కాలేజీలకు విద్యార్థులు వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో తరగతులను ఎవరికి కోసం.. ఎందుకోసం తలపెట్టారో ఎవరికీ అర్థం కావడం లేదు.   

పరీక్షలతోనూ ప్రయోగాలు.. 
ఆరు నుంచి తొమ్మిదో తరగతి పరీక్షలు జరిపే విధానం కూడా ఈ ఏడాది అస్తవ్యస్తంగా తయారైంది. విద్యాశాఖ చరిత్రలోనే తొలిసారి 9వ తరగతికి ఒకసారి, 6, 7, 8 తరగతులకు మరోసారి పరీక్షలు నిర్వహించారు. దీంతో ఉపాధ్యాయుల కొరతతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ స్కూల్‌ అసిస్టెంట్లే చూడాలి. కానీ ఈ ఏడాది ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా మారింది. తొమ్మిదో తరగతికి మార్చి 2 నుంచి 12వ తేదీ వరకు ఎస్‌ఏ–2 పరీక్షలు నిర్వహించారు.

అనంతరం ఆ విద్యార్థులకు పదో తరగతి సిలబస్‌ ఏప్రిల్‌ 23 వరకు బోధించాలని ప్రత్యేకంగా బ్రిడ్జి కోర్సు రూపొందించారు. ఈ బోధన ప్రారంభం కాకుండానే పదోతరగతి వార్షిక పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభించడంతో స్కూల్‌ అసిస్టెంట్లు, ప్రధాన ఉపాధ్యాయులు పబ్లిక్‌ పరీక్షల విధుల్లో నిమగ్నమయ్యారు. దీంతో 9వ తరగతి విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు బోధనను గాలికి వదిలేశారు. పదోతరగతి పరీక్షలు ఏప్రిల్‌ 2వ తేదీతో ముగిశాయి. అనంతరం బ్రిడ్జి కోర్సు బోధన చేపట్టాలని భావించినా ఏప్రిల్‌ 6 నుంచి పదోతరగతి మూల్యాంకనం ప్రారంభమైంది.

స్కూల్‌ అసిస్టెంట్లు అందరికీ ఆ విధులు అప్పగించారు. ఇదిలా ఉంటే ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులకు వార్షిక పరీక్షలు మొదలయ్యాయి. ఉపాధ్యాయుల కొరతతో ఒకే గదిలో మూడు తరగతులకు పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకపక్క మూల్యాంకనం, ఇంకోపక్క ఉన్నత తరగతులకు పరీక్షలు, మరోపక్క తొమ్మిదో తరగతికి బ్రిడ్జికోర్సు బోధన ఎలా సాధ్యమవుతుందన్న కనీస ఆలోచన కూడా లేకుండా విధానాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement