‘విజయ్ అంటే విజయకాంత్ కాదు’ | Vijay is no Vijayakanth Premalatha fights to keep Captain’s legacy | Sakshi
Sakshi News home page

‘విజయ్ అంటే విజయకాంత్ కాదు’

Apr 12 2026 9:32 PM | Updated on Apr 12 2026 9:35 PM

Vijay is no Vijayakanth Premalatha fights to keep Captain’s legacy

చెన్నై: తమిళనాడులో డీఎండీకే వ్యవస్థాపకుడు, దివంగత నేత, సినీనటుడు “కెప్టెన్” విజయకాంత్‌ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆయన భార్య ప్రేమలత పోరాడుతున్నారు. విజయకాంత్‌ 2023 డిసెంబరు 28న కన్నుమూశారు. కొన్ని నెలల క్రితం సినీనటుడు విజయ్‌ కూడా టీవీకే పేరుతో పార్టీని స్థాపించారు. అయితే, కొందరు విజయకాంత్‌ను విజయ్‌తో పోల్చుతుండడం సరికాదన్నట్లు ప్రేమలత మాట్లాడారు. తాజాగా ఆమె తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

విజయ్‌ను కొందరు విజయకాంత్‌తో పోల్చుతుండడం పట్ల తాను ఎలాంటి అభిప్రాయాన్నీ వ్యక్తం చేయలేనని తెలిపారు. విజయకాంత్ కేవలం నటుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి మాత్రమే కాదని, ప్రజల మధ్య వారి కోసం నిలిచిన నాయకుని చెప్పారు.

“కెప్టెన్ ప్రజల నాయకుడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తన అభిమాన సంఘాలను రాజకీయ పార్టీగా మార్చి ఎన్నికల్లోకి వచ్చారు. ఏ సమస్య వచ్చినా ముందుగా అక్కడికి వెళ్లేవారు. ప్రజలతో నిలబడేవారు. నాయకుడు వేరుగా, ప్రజలు వేరుగా ఉంటే ఆ బంధం నిలబడదు. పార్లమెంటరీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు. 

విజయకాంత్ కలలు, లక్ష్యాలను నెరవేర్చడమే డీఎండీకే లక్ష్యం. రాజకీయాల్లో లింగ వివక్ష లేదు. నేను పురుషుడు, మహిళ అనే కోణంలో ఆలోచించను. సరైనది ఏదైతే అదే చేస్తాం. మాతృభాషను రక్షించాలి, అన్ని భాషలు నేర్చుకోవాలి. మాతృభాష మన కళ్లలా.. ఇతర భాషలు కళ్లద్దాల్లా.. అవసరమైనప్పుడు వాడుతాం. తమిళనాడులో ఎప్పటినుంచో రెండు భాషల విధానం ఉంది. మూడు భాషల విధానం లేదు’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement