కల్వర్టును ఢీకొన్న కారు
ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
నంద్యాల జిల్లా: దైవదర్శనానికి వెళ్తుండగా రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పాణ్యం మండలం బలపనూరు గ్రామం వద్ద 40వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు..
మహారాష్ట్రలోని పర్భాని జిల్లా జెర్నీ గ్రామానికి చెందిన మహేష్ రుద్రయ్యమాట్‌పతి(51), సంజయ్‌జాదవ్, కన్‌హబ్‌రాంరావు స్కార్పియో వాహనంలో తిరుపతి దర్శనానికి ఆదివారం సాయంత్రం బయలుదేరారు. మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారు సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో బలపనూరు వద్ద కానుగల వాగుపై ఉన్న కల్వర్టును ఢీకొంది. కారులో ఉన్న ముగ్గురు తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని శాంతిరామ్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మహేష్ రుద్రయ్యమాట్‌పతి మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
మిగిలిన ఇద్దరికి వైద్య సేవలు అందిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి ప్రమాద వివరాలపై ఆరా తీశారు. హైవే సిబ్బంది ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనాన్ని తొలగించి స్టేషన్‌కు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్న ట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన కన్‌హబ్‌రాంరావు నిరంతరంగా దాదాపు 12 గంటల పాటు వాహనం నడుపుతూ అలసిపోయి నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో మిగతా ఇద్దరు గాయాలతో బయటపడ్డారు.


