బరి వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లు
కోడి పందేలు, జూద క్రీడలకు హైటెక్ ఏర్పాట్లు
ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరిలో భారీగా బేరాలు
మూడు రోజుల్లో చేతులు మారనున్న రూ.వందల కోట్లు
రూ.కోట్లు దండుకోనున్న కూటమి ప్రజాప్రతినిధులు
కేసరపల్లి బరికి నియోజకవర్గ ప్రజాప్రతినిధికి రూ.2 కోట్లు
పెనమలూరు నియోజకవర్గంలో క్యాసినోకు రూ.70 లక్షలు
పెద్దఎత్తున బరులు... బేరం పెట్టి రేటు నిర్ణయం..
సంక్రాంతి సంప్రదాయం మాటున డబ్బు లూటీ
చక్రం తిప్పుతున్న కూటమి పార్టీల నాయకులు..
అడ్వాన్స్‌లు చెల్లిస్తున్న జూదాల నిర్వాహకులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ, సాక్షి భీమవరం: కత్తులు దూసే కోళ్లు... దానివెనుక జూద క్రీడలు.. చుట్టూ గ్యాలరీలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు... వేలల్లో సందర్శకులు..! పెద్దమొత్తంలో చేతులు మారనున్న నగదు..! ఇదీ ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంప్రదాయం మాటున అధికార కూటమి నేతల ‘బరి’తెగింపు. కార్పొరేట్ హంగులతో భారీ ప్రాంగణాల్లో బరులు ఏర్పాటు చేస్తూ కోడి పందేలు, జూదం నిర్వహించేందుకు వీరంతా సిద్ధమవుతున్నారు.
కోడి పందేలపై నిషేధం ఉన్నా పండుగ ముసుగులో 20 రోజుల ముందే బరులకు బేరాలు పెట్టి రేట్లు ఖరారు చేశారు. వీవీఐపీల కోసం ఏసీల వంటి హైటెక్ సదుపాయాలూ కల్పిస్తున్నారు. సాధారణంగా కోడి పందేలు, జూదం సాయంత్రం చీకటి పడే వరకే జరుగుతాయి. ఈసారి ఏకంగా మూడు రోజులు రేయింబవళ్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
కూటమి నేతలతో నిర్వాహకులకు సిఫార్సులు
సంక్రాంతికి మూడు వారాలు మాత్రమే ఉండడంతో కోడిపందేలకు పెట్టింది పేరైన పశ్చిమ గోదావరి జిల్లాలో సన్నాహాలు మొదలయ్యాయి. కోడిపందేలు చూసేందుకు వచ్చినవారి జేబులు ఖాళీ చేయించడంలో గుండాట, పేకాట, కోతాట, జూదం నిర్వహణలో ఆరితేరినవారిదే ప్రధాన పాత్ర. దీంతో బరుల కోసం కూటమి నేతలతో నిర్వాహకులకు సిఫార్సు చేయించుకునే పనిలో ఉన్నారు.
బరి ప్రత్యేకత, జనం రద్దీని బట్టి రూ.25 లక్షల నుంచి రూ.కోటిపైగా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. భీమవరం చుట్టుపక్కల రూ.కోటి పైనే పలుకుతుండగా, ఇతరచోట్ల రూ.25 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఇస్తామని ముందుకొస్తున్నారు. భీమవరం దగ్గర పెద్ద బరిలో గుండాటకు రూ.70 లక్షలు, పేకాటకు రూ.40 లక్షలు, కోతాటకు రూ.20 లక్షలు ఇచ్చేందుకు అడ్వాన్స్‌లు చెల్లించినట్లు తెలిసింది.
జూదాలతోనే జనం జేబులు గుల్ల
కోడి పందేలతో పోలిస్తే బరుల వద్ద జరిగే జూదాలే నిర్వాహకులకు ఆదాయ వనరు. పెద్ద బరిలో రోజుకు 20–25 పందేలు మాత్రమే జరుగుతాయి. ఒక్కోదానికి రూ.25 వేల వరకు వసూలు చేస్తే మూడు రోజుల్లో వచ్చే మొత్తం రూ.20 లక్షలు. చిన్న బరుల్లో రూ.5 లక్షలలోపు ఉంటుంది. రెండు, మూడు ఎకరాలలో టెంట్లు, పందెం బరి, గ్యాలరీలు, కుర్చీలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు తదితరాలతో పెద్ద బరికి రూ.40 లక్షలు, చిన్న, మధ్యస్థాయి వాటికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుంది.
పోలీసు పోస్టుకు గిరాకీ
» గన్నవరం నియోజకవర్గంలో పెద్దఎత్తున బరులు, జూద క్రీడలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ఓ పోలీసు సర్కిల్ అధికారి పోస్టుకు గిరాకీ నెలకొంది. మూడు నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టుకు ఉన్నత స్థాయిలో భారీగా ముడుపులు తీసుకుని, అనుకూలమైన వారికి పోస్టింగ్ వేయించుకున్నట్లు టీడీపీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేల మాటున చట్టవిరుద్ధంగా జరిగే కార్యకలాపాల వైపు ఎవరూ కన్నెత్తి చూడకుండా నేతలు, సంబంధిత వర్గాలకు భారీగా మామూళ్లు ముట్టజెప్పాలి.
వారికి పంపే కోజాలు (పందెం పుంజులు), బౌన్సర్లు, సిబ్బంది జీతాలు, అతిథులకు భోజనాలు తదితర రూపాల్లో బరిని బట్టి రూ.20 లక్షల నుంచి రూ.కోటి పైనే అవుతుంది. జూదాలు, అశ్లీల నృత్యాలు, మద్యం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుంచి ఈ మొత్తాన్ని రాబట్టనున్నారు.
మద్యం, పేకాట శిబిరాలకు తలుపులు బార్లా
సంక్రాంతికి ముందు మద్యం, పేకాట శిబిరాలకు చంద్రబాబు ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. దీంతో పెద్దఎత్తున కోడి పందేలు, క్యాసినో, గుండాట, పేకాట, మద్యం దుకాణాలు, వ్యాపార సముదాయాలు నెలకొల్పేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. కొన్నిచోట్ల ఎంట్రీ ఫీజు రూ.5 వేలుగా నిర్ణయించారు. ఏ ఇబ్బందీ రాదని బరుల నిర్వాహకులకు ప్రజాప్రతినిధులు భరోసా ఇస్తున్నట్లు సమాచారం.
జూదరుల కోసం హోటల్ రూమ్‌లను బుక్ చేస్తున్నారు. పండుగ మూడు రోజుల్లో రూ.వంద కోట్లు చేతులు మారనున్నాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా క్యాసినో నిపుణులను దించుతున్నారు. ‘అందర్–బాహర్, తీన్‌పత్తి, బ్లాక్ జాక్, నంబరింగ్, బకారత్’తో పాటు కోత ముక్క, స్టైక్ తదితర జూద క్రీడలకు బేరాలు మాట్లాడారు. ఈ ఆటల్లో నిపుణులైన నార్త్, గోవా, నేపాల్ డీలర్లతో బరుల నిర్వాహకులు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ఇందుకు సంబంధించి మహిళలను రప్పించేందుకూ అధికార పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
రూ.కోట్లు దండుకోనున్న కూటమి ప్రజాప్రతినిధులు
» ఉమ్మడి కృష్ణాలో ఒక్కో నియోజకవర్గంలో పదిపైగా బరులు ఏర్పాటు చేస్తున్నారు. స్థాయిని బట్టి రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు టీడీపీ ప్రజాప్రతినిధులకు ఇవ్వాలి. ఇలా కేసరపల్లి బరికి నియోజకవర్గ ప్రజాప్రతినిధికి రూ.2 కోట్లు ఇవ్వనున్నారు. గన్నవరం, పెనమలూరు, గుడివాడ, పామర్రు, అవనిగడ్డల్లో టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు రూ.కోట్లు దండుకోనున్నారు.
» 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా విజయవాడ, పరిసర ప్రాంతాలైన రామవరప్పాడు, ఎనికేపాడుల్లో సంక్రాంతి సంబరాల పేరుతో బరులు ఏర్పాటు చేస్తున్నారు.
» పెనమలూరు నియోజకవర్గం ఉప్పులూరులో క్యాసినో ఆడించేందుకు ప్రజాప్రతినిధితో రూ.70 లక్షలకు ఒప్పందం కుదిరింది. క్యాసినో ఆడించడంలో దిట్టగా పేరొందిన వ్యక్తితో పాటు, గంజాయి కేసులో నిందితుడికి ఈ బరిని అప్పజెప్పారు.
» నున్న ప్రాంతంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో హైటెక్ బరిలో పెద్దఎత్తున క్యాసినో ఆడించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా సరిహద్దులో ఉన్న ఆగిరిపల్లిలో పేకాట ఆడించడంలో కృష్ణా జిల్లా వారే కీలక పాత్ర పోషించడం గమనార్హం.
» పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, పరిసరాల్లో జరిగే కోడి పందేలను చూసేందుకు తెలుగు రాష్ట్రాల రాజకీయ, సినీ ప్రముఖులు వస్తుంటారు. బరుల వద్ద గుండాట, పేకాట, కోతాట తదితర జూద క్రీడలు పెద్దఎత్తున జరుగుతాయి. జిల్లాలో వందపైనే బరులు రానున్న నేపథ్యంలో గుండాట, పేకాట, కోతాట, మద్యం బెల్టు షాప్‌లు నెలకొల్పేందుకు బేరాలు సాగుతున్నాయి. బరిని బట్టి రూ.కోటి పైనే చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నట్టు సమాచారం.
భీమవరంలోని గొల్లవానితిప్ప, ఉండి, తాడేరు రోడ్డుతో పాటు ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లులో పెద్ద బరులు ఏర్పాటు కానున్నాయి. చాలాచోట్ల టీడీపీ–జనసేన నేతలు సంయుక్తంగా, కొన్నిచోట్ల వేర్వేరుగా సిద్ధం చేస్తున్నారు.


