మున్సిపల్‌ సమ్మె వాయిదా  | Postponement of municipal strike | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ సమ్మె వాయిదా 

Jan 3 2024 5:03 AM | Updated on Jan 3 2024 5:03 AM

Postponement of municipal strike - Sakshi

సాక్షి, అమరావతి: పట్టణ పారిశుధ్య కార్మికుల సమ్మెను కార్మిక సంఘాలు వాయిదా వేసుకొనేందుకు అంగీకారం తెలిపాయి. మంగళవారం మంత్రుల బృందంతో చర్చల అనంతరం సీఐటీయూ మినహా మిగతా కార్మిక సంఘాలు బుధవారం నుంచి చేపట్టనున్న సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసుకొన్నాయి. మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సచివాలయంలో కార్మిక సంఘాల నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పారిశుద్ధ్య కార్మికుల ప్రధాన డిమాండ్‌ అయిన కేటగిరీల వారీగా బేసిక్‌ పే నిర్ణయం, పొరుగు సేవల సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్ధికరించడం తదితర అంశాలపై చర్చించారు.

అవుట్‌ సోర్సింగ్‌పై పనిచేసే పారిశుద్ధ్య, ఇంజినీరింగ్, ఇతర సిబ్బందికి అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని, నియామకాల్లో వారికి వెయిటేజీ మార్కులు కేటాయించాలని, ఖాళీగా ఉన్న రెగ్యులర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేసి, అవసరానికి తగ్గట్టుగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేశారు. ఘన వ్యర్థాల తరలింపునకు కాంట్రాక్టు విధానంలో తీసుకున్న వాహనాల పనితీరును మెరగుపరచాలని, పారి­శుద్ద్య కార్మికులు, ఇంజినీరింగ్‌ సిబ్బంది, పార్కుల నిర్వహణ, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వర్కర్లకు పనుల ఆధారంగా వారికి బేసిక్‌ పే పైనా సమావేశంలో చర్చించారు.

కార్మికుల డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రులు చెప్పారు. సంక్రాంతి ముందు లేదా తర్వాత ప్రభుత్వంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని, అంతవరకు సమ్మెను వాయిదా వేయాలని మంత్రులు కోరారు. ప్రస్తుతం సీఐటీయూ కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి. మిగిలిన సంఘాలు బుధవారం నుంచి సమ్మెకు దిగాలని మొదట నిర్ణయించాయి. మంత్రుల విజ్ఞప్తి మేరకు సీఐటీయూ మినహా మిగిలిన సంఘాల నేతలు సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు ప్రకటించారు.

ఈ చర్చల్లో మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, సీడీఎంఏ కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ గంధం చంద్రుడు, ఆప్కాస్‌ ఎండీ వాసుదేవరావు తదితర అధికారులు, రాష్ట్ర మున్సిపల్‌ ఉద్యోగుల సంఘాల నేతలు ఆనందరావు, రమణ (వైఎస్సార్‌టీయూసీ), రంగనాయకులు, పి.సుబ్బారాయుడు (ఏఐటీయూసీ), అబ్రహం లింకన్‌ (ఐఎఫ్‌టీయూ), జి.ప్రసాద్, కె.ఉమామహేశ్వరరావు (ఏపీసీఐటీయూ), జి.రఘురామరాజు, శ్యామ్‌ (టీఎన్‌టీయూసీ), మధుబాబు, ఆంజనేయులు (ఏపీ ఎంఈడబ్లు్యయూ), వరప్రసాద్, కె.శ్రీనివాసరావు (ఏఐసీటీయూ) పాల్గొన్నారు. 

చాలా సమస్యలు పరిష్కరించాం: మంత్రి సురేష్‌
అనంతరం మంత్రి సురేష్‌ పాత్రికేయులతో మాట్లా­డు­తూ.. కార్మికుల డిమాండ్లలో చాలా పరిష్కరించామని, మిగతా వాటిపైనా సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రధా­నం­గా మున్సిపల్‌ శాఖలో అవుట్‌ సోర్సింగ్‌ విధా­నంలో పనిచేస్తున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వర్కర్లు, పారి­శుద్ధ్య వాహనాల డ్రైవర్లు, మలేరియా వర్కర్లకు నెలకు రూ.6 వేలు చొప్పున ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్స్‌ చెల్లించేందుకు ఉత్త­ర్వులు జారీ చేశామ­న్నారు.

మరికొన్ని డిమాండ్ల­పై­నా ప్రభు­త్వం సానుకూ­లంగా స్పందించిందని చెప్పా­రు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌ స్కిల్డ్‌ వర్కర్ల కేటగిరీల్లో కొన్ని తప్పులు జరిగాయని, వాటినీ పరిష్కరి­స్తా­మన్నారు. ప్రమాదవశాత్తు చని­పో­యి­న­వారి కుటుంబాలకు పరి­హారం చెల్లింపు­పై­నా సానుకూలనిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement