
చిలమత్తూరు/నగరంపాలెం (గుంటూరు వెస్ట్): సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై కూటమి ప్రభుత్వ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. న్యాయస్థానాలు ఎంత హెచ్చరించినా ఖాకీలు మాత్రం బేఖాతరు చేస్తున్నారు. తాజాగా, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను విమర్శించినందుకు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు నాగమణిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు.
సినీనటుడు చిరంజీవితోపాటు మాజీ సీఎం జగన్‌పై అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపడుతూ శుక్రవారం నాగమణి సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. దీనిపై టీడీపీ మహిళా విభాగం నాయకులు హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఒకటో పట్టణ పోలీసులు ఆమెపై బీఎన్‌ఎస్ 196(1),(ఎ), 353(2), 61(2), 351(4), బీఎన్‌ఎస్, 67 ఐటీఏ 2000–08 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అలాగే, సీఎంపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు గుంటూరు సీఐడీ సైబర్ క్రైం ఎస్పీ డాక్టర్ కేవీ శ్రీనివాస్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలానికి చెందిన గడ్డం శివప్రసాద్(మెడికల్ రిప్రజెంటేటివ్) ఫేస్‌బుక్‌లో సీఎంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు గుంటూరు వికాస్‌నగర్‌లోని టీడీపీ నాయకుడు కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.
సీఐడీ డీజీపీ సూచనల మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఈ నెల 26న ధర్మవరం టౌన్‌లో గడ్డం శివప్రసాద్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా, దర్యాప్తు చేసి అతడిని సీబీసీఐడీ కోర్టు ముందు హాజరుపరచగా.. కోర్టు శివప్రసాద్‌ను 35 బీఎన్‌ఎస్‌ఎస్ కింద నోటీసులు ఇచ్చి విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది.