పోలవరం రిజర్వాయర్‌ కాదు బ్యారేజే | Polavaram is not a reservoir it is a barrage | Sakshi
Sakshi News home page

పోలవరం రిజర్వాయర్‌ కాదు బ్యారేజే

Aug 7 2026 5:34 AM | Updated on Aug 7 2026 5:34 AM

Polavaram is not a reservoir it is a barrage

మరోసారి స్పష్టం చేసిన కేంద్రం    

నీటి నిల్వ 41.15 మీటర్లకే పరిమితమని స్పషీ్టకరణ 

ఆ మేర పనులకే రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం 

ఇప్పటికే రూ.8,322.62 కోట్లు విడుదల చేశామని వెల్లడి 

లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత మిథున్‌రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం 

41.15 మీటర్ల వరకే నీటిని నిల్వచేస్తే ప్రాజెక్టు లక్ష్యాలు నీరుగారినట్టే

కేవలం 1.98 లక్షల ఎకరాలకే నీరు.. అదీ వరద ఉన్నప్పుడే సాధ్యం 

ప్రాజెక్టుకు చంద్రబాబు సర్కారు ఉరేసిందంటున్న నిపుణులు 

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం మరోసారి బట్టబయలైంది. ఈ ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తే ఎత్తు 45.72 మీటర్లు కాదు.. 41.15 మీటర్లేనని కేంద్రం పునరుద్ఘాటించింది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి 2023 ధరల ప్రకారం అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లుగా ఆమోదించామని, మిగిలిన పనులు పూర్తి చేయడానికి రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించామని స్పష్టం చేసింది. అందులో 2024–25లో రూ.5,512.40 కోట్లు, 2025–26లో రూ.2,810.22 కోట్లు వెరసి రూ.8,322.62 కోట్లు విడుదల చేశామని తెలిపింది. 

ఈ మేరకు లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్‌ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 41.15 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేసేలా ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం గాŠయ్‌ప్‌–1, గ్యాప్‌–2లతోపాటు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను 2027 జూన్‌ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించినట్లు తెలిపారు. గరిష్ఠ నీటి మట్టం 45.72 మీటర్ల ఎత్తు వరకూ స్పిల్‌ వే, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం వంటి సివిల్‌ పనులు పూర్తి చేసేందుకు అయ్యే వ్యయంతోపాటు.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేయడానికి అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడం.. కుడి, ఎడమ కాలువలను పూర్తి చేయడానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు. 

ప్రాజెక్టులో అంతర్భాగమైన జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణానికి అయ్యే ఖర్చును పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే భరించాలని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్పిస్తున్న నిధుల వినియోగ ధ్రువీకరణ పత్రాలు (యూసీలు), సాంకేతిక పత్రాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జల్‌ శక్తి శాఖ పరిశీలించాకే నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. 

7.20 లక్షల ఎకరాలకు కాదు 1.98 లక్షల ఎకరాలకే 
పోలవరం ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 45.72 మీటర్లు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. కనీస నీటిమట్టం 41.15 మీటర్లు, కనీస నీటి నిల్వ 119.4 టీఎంసీలు. పోలవరం నీటి మట్టాన్ని కనీస స్థాయికే పరిమితం చేస్తే.. కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కేవలం 1.98 లక్షల ఎకరాలకు.. అదీ గోదావరికి వరద వచ్చిన రోజుల్లో మాత్రమే నీళ్లందించే అవకాశం ఉంటుందని అధికారులే స్పష్టంగా చెబుతున్నారు. 

ఇక కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల మళ్లింపు, గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లందించే అవకాశమే ఉండదని తేల్చి చెబుతున్నారు. ఎడమ గట్టుపై 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న విద్యుత్‌ కేంద్రంలోనూ గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే అరకొరగా విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. అంటే.. పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేశారన్నది స్పష్టమవుతోంది. 

పోలవరానికి ఉరేసిన చంద్రబాబు సర్కారు
జలయజ్ఞంలో భాగంగా 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ బృహత్తర ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. గోదావరి ట్రిబ్యునల్‌ అనుమతి ఇచ్చిన మేరకు సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం), అటవీ, పర్యావరణం సహా అన్ని అనుమతులు సాధించి.. 45.72 మీటర్ల గరిష్ఠ నీటి మట్టం, 194.6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు మళ్లించి 13.08 లక్షల ఎకరాలను స్థిరీకరించడం, గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలకు రెండో పంటకూ సమృద్ధిగా నీళ్లందించి స్థిరీకరించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా దీని నిర్మాణం చేపట్టారు.

 2014–19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు స్వలాభం కోసం కేంద్రం నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకొని, అనేక అవకతవకలు, అరకొర పనులతో ప్రాజెక్టును నీరుగార్చారు. 2019లో అధికారం చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పోలవరం ప్రాజెక్టును దారిలోకి తెచ్చి , నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జూన్‌ 11 నాటికే 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా పోలవరం స్పిల్‌ వేను పూర్తి చేశారు. వైఎస్‌ జగన్‌ వినతిమేరకు 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు 2020 మార్చి 17న కేంద్రం అంగీకరించింది. 

2024లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడంతోనే పోలవరం ప్రాజెక్టుకు ఉరేశారని సాగు నీటి రంగ నిపుణులు అంటున్నారు. 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్‌లో పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ.. ఆ మేరకు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇచ్చేలా తీర్మానాన్ని ఆమోదించగా.. అదే కేబినెట్‌లో సభ్యునిగా ఉన్న టీడీపీ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement