
సాక్షి, కాకినాడ జిల్లా: సముద్రపు ఒడ్డు జీవనాధారంగా జీవించే గంగపుత్రులు ఇప్పుడు ఆవేదనతో రోడ్డుపైకి వచ్చారు. పిఠాపురం(Pithapuram) నియోజకవర్గం పరిధిలోని యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం వద్ద పరిశ్రమల వ్యర్థాల వల్ల సముద్రం కలుషితమవుతోందని, ఓఎన్జీసి కార్యకలాపాలు తమ వృత్తికి ఆటంకంగా మారుతున్నాయని మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
వేటకు వెళ్లే సముద్రపు నీరు పరిశ్రమల వ్యర్థాలతో కలుషితమవుతోందన్నది మత్స్యకారుల ప్రధాన ఆరోపణ. ఓఎన్జీసి కార్యకలాపాలు, బోట్లు, బార్జీలు, తీరంలో నిర్మాణాలు.. వేటకు ఆటంకంగా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదని.. వేలాఇ కుటుంబాల జీవనాధారం మీద నేరుగా ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్జీసి ద్వారా నష్టపరిహరం ఇప్పించడంతో పాటు ఇక మీదట సముద్ర జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు(Fishermen Protests).

పవన్ చేతిలో పనే, కానీ..
ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కల్యాణ్(Pawan Kalyan).. ప్రస్తుతం పర్యావరణ శాఖను నిర్వహిస్తున్నారు కూడా. అయినప్పటికీ, స్థానిక సమస్యలపై ఆయన స్పందన లేకపోవడం గంగపుత్రులలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది.
సముద్రం కలుషితమైతే, మత్స్యకారుల ఆరోగ్యం.. వేటపై ప్రభావం, తద్వారా జీవనోపాధి ద్వారా వచ్చే ఆదాయం తీవ్రంగా ప్రభావితమవుతాయి. పరిశ్రమల వ్యర్థాలు, ఓఎన్జీసీ వంటి సంస్థల కార్యకలాపాల వల్ల సముద్రం కలుషితమవుతుంటే.. నియంత్రించాల్సిన బాధత్య పర్యావరణ శాఖది. పైగా తీర ప్రాంతాల్లో జరిగే నిర్మాణాలు, డ్రిల్లింగ్, రవాణా కార్యకలాపాలు వేటకు ఆటంకం కలిగిస్తే, వాటిపై పర్యావరణ ప్రభావ అధ్యయనాలు (EIA) నివేదికలు ఆధారంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పర్యావరణ శాఖదే. అలాంటిది ఆ శాఖ మంత్రి, పైగా పిఠాపురం ఎమ్మెల్యే మౌనంగా ఉండడం అక్కడి జనాలకు కోపం తెప్పిస్తోంది. మరి ఇప్పుడైనా పవన్ స్పందిస్తారా? లేదంటే తన శాఖ పరిధిలోకి రాదని.. అధికారులదే బాధ్యత అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? చూడాలి..