breaking news
fishermen agitation
-
పిఠాపురం.. పైగా పవన్ చేతిలో పనే.. అయినా సైలెన్స్!
సాక్షి, కాకినాడ జిల్లా: సముద్రపు ఒడ్డు జీవనాధారంగా జీవించే గంగపుత్రులు ఇప్పుడు ఆవేదనతో రోడ్డుపైకి వచ్చారు. పిఠాపురం(Pithapuram) నియోజకవర్గం పరిధిలోని యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం వద్ద పరిశ్రమల వ్యర్థాల వల్ల సముద్రం కలుషితమవుతోందని, ఓఎన్జీసి కార్యకలాపాలు తమ వృత్తికి ఆటంకంగా మారుతున్నాయని మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు కొనసాగిస్తున్నారు.వేటకు వెళ్లే సముద్రపు నీరు పరిశ్రమల వ్యర్థాలతో కలుషితమవుతోందన్నది మత్స్యకారుల ప్రధాన ఆరోపణ. ఓఎన్జీసి కార్యకలాపాలు, బోట్లు, బార్జీలు, తీరంలో నిర్మాణాలు.. వేటకు ఆటంకంగా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదని.. వేలాఇ కుటుంబాల జీవనాధారం మీద నేరుగా ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్జీసి ద్వారా నష్టపరిహరం ఇప్పించడంతో పాటు ఇక మీదట సముద్ర జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు(Fishermen Protests). పవన్ చేతిలో పనే, కానీ.. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కల్యాణ్(Pawan Kalyan).. ప్రస్తుతం పర్యావరణ శాఖను నిర్వహిస్తున్నారు కూడా. అయినప్పటికీ, స్థానిక సమస్యలపై ఆయన స్పందన లేకపోవడం గంగపుత్రులలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. సముద్రం కలుషితమైతే, మత్స్యకారుల ఆరోగ్యం.. వేటపై ప్రభావం, తద్వారా జీవనోపాధి ద్వారా వచ్చే ఆదాయం తీవ్రంగా ప్రభావితమవుతాయి. పరిశ్రమల వ్యర్థాలు, ఓఎన్జీసీ వంటి సంస్థల కార్యకలాపాల వల్ల సముద్రం కలుషితమవుతుంటే.. నియంత్రించాల్సిన బాధత్య పర్యావరణ శాఖది. పైగా తీర ప్రాంతాల్లో జరిగే నిర్మాణాలు, డ్రిల్లింగ్, రవాణా కార్యకలాపాలు వేటకు ఆటంకం కలిగిస్తే, వాటిపై పర్యావరణ ప్రభావ అధ్యయనాలు (EIA) నివేదికలు ఆధారంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పర్యావరణ శాఖదే. అలాంటిది ఆ శాఖ మంత్రి, పైగా పిఠాపురం ఎమ్మెల్యే మౌనంగా ఉండడం అక్కడి జనాలకు కోపం తెప్పిస్తోంది. మరి ఇప్పుడైనా పవన్ స్పందిస్తారా? లేదంటే తన శాఖ పరిధిలోకి రాదని.. అధికారులదే బాధ్యత అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? చూడాలి.. -
మూడు రోజుల పాటు చేపల వేట బహిష్కరణ
ఒంగోలు, టాస్క్ ఫోర్స్: తమిళనాడులోని కడలూరు నుంచి వచ్చే సోనాబోట్ల అక్రమ చేపల వేటను కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ మూడు రోజుల పాటు చేపల వేటకు వెళ్లవద్దని గురువారం రాత్రి ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని మత్స్యకార గ్రామాల్లో దండోరా వేశారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం చాకిచర్ల గ్రామ పరిధిలో బుధవారం చేపల వేటకు వెళ్లిన సమయంలో కడలూరు బోట్లు వీరి బోట్లను చేపల వేట చేయనీయకుండా అడ్డుకున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారు గురువారం సమావేశమై మూడు రోజుల పాటు చేపల వేటకు వెళ్లవద్దని దండోరా వేసి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. రెండు జిల్లాల్లో మత్స్యకార గ్రామాల్లో దండోరా వేయించి శుక్రవారం చేపల వేటను బహిష్కరించారు. దీంతో బోట్లన్నీ తీరంలోనే ఉన్నాయి. ఇటీవల కడలూరు బోట్ల కారణంగా తమ వలలు తెగిపోవటంతో పాటు తీరానికి దగ్గరగా వేట చేయటంతో చేపలు కూడా సక్రమంగా లభించడం లేదని వాపోతున్నారు. దీంతో వేటకు వెళ్లిన ప్రతిసారీ ఖర్చులు, కూలీ డబ్బులు రావటం లేదని, ఇలా అయితే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కడలూరు బోట్లను పూర్తిగా అడ్డుకోవాలని మత్స్యకారులు పట్టుబడుతున్నారు. -
మత్స్యకారుల దీక్షకు వైఎస్సార్సీపీ సంఘీభావం
సాక్షి, విశాఖపట్నం : తమను ఎస్టీల్లో చేర్చాలని 20 రోజులుగా మత్స్యకారులు చేస్తున్న దీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారుల దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వారికి సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావులు, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం మత్సకారుల వద్దకు వెళ్లి తమ సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని.. మత్స్యకారులను కూడా మోసం చేస్తే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని వారు టీడీపీని హెచ్చరించారు. -
విశాఖ పోర్టులో మత్స్యకారుల ఆందోళన
విశాఖ: జిల్లాలో ఫిషింగ్ హర్బర్‌లో బుధవారం మత్స్యకారులు ఆందోళనకు దిగారు. విశాఖ పోర్టులో చిరు దుకాణాలను తొలగించేందుకు అక్కడి యాజమాన్యం ప్రయత్నించడంతో వారు ఆందోళనకు దిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు పెద్దఎత్తునా ఆందోళన చేపట్టారు. చిరు దుకాణాలను అడ్డుకునేందుకు యత్నించిన యజమాన్యాన్ని అడ్డుకున్నారు. పోర్టు ఛైర్మన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు నినాదాలు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వారిని శాంతపరచి అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం.