
కడలూరు బోట్ల అక్రమ వేట ఆపే వరకు వేట బహిష్కరణ
ప్రకాశం, నెల్లూరు జిల్లాల మత్స్యకార గ్రామాల్లో దండోరా
కూటమి ప్రభుత్వం అక్రమ సోనాబోట్ల చేపల వేటను అడ్డుకోవాలని డిమాండ్
ఒంగోలు, టాస్క్ ఫోర్స్: తమిళనాడులోని కడలూరు నుంచి వచ్చే సోనాబోట్ల అక్రమ చేపల వేటను కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ మూడు రోజుల పాటు చేపల వేటకు వెళ్లవద్దని గురువారం రాత్రి ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని మత్స్యకార గ్రామాల్లో దండోరా వేశారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం చాకిచర్ల గ్రామ పరిధిలో బుధవారం చేపల వేటకు వెళ్లిన సమయంలో కడలూరు బోట్లు వీరి బోట్లను చేపల వేట చేయనీయకుండా అడ్డుకున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో వారు గురువారం సమావేశమై మూడు రోజుల పాటు చేపల వేటకు వెళ్లవద్దని దండోరా వేసి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. రెండు జిల్లాల్లో మత్స్యకార గ్రామాల్లో దండోరా వేయించి శుక్రవారం చేపల వేటను బహిష్కరించారు. దీంతో బోట్లన్నీ తీరంలోనే ఉన్నాయి.
ఇటీవల కడలూరు బోట్ల కారణంగా తమ వలలు తెగిపోవటంతో పాటు తీరానికి దగ్గరగా వేట చేయటంతో చేపలు కూడా సక్రమంగా లభించడం లేదని వాపోతున్నారు. దీంతో వేటకు వెళ్లిన ప్రతిసారీ ఖర్చులు, కూలీ డబ్బులు రావటం లేదని, ఇలా అయితే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కడలూరు బోట్లను పూర్తిగా అడ్డుకోవాలని మత్స్యకారులు పట్టుబడుతున్నారు.