
కల్యాణ వేదిక వద్ద నమాజ్ చేసిన వ్యక్తి
షాక్‌కు గురైన శ్రీవారి భక్తులు
టీటీడీ వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం.. వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ మండిపాటు
నిందితుడు తమిళనాడు వాహనంలో వచ్చినట్లు గుర్తింపు
తిరుమల: తిరుమలలో మరో అపచారం చోటుచేసుకుంది. తిరుమల పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో ఓ వ్యక్తి నమాజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ దృశ్యాలు చూసిన భక్తులు షాక్‌కు గురయ్యారు.
సీసీ కెమెరా ఉన్న ప్రాంతంలో ఓ వ్యక్తి నమాజ్(Namaz) చేస్తుంటే టీటీడీ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో కొత్త పాలక మండలి ఏర్పాటైన తర్వాత వరుసగా అపచారాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు.
మద్యం సేవించడం, ఎగ్ బిర్యానీ తినడం, ఆలయంపై డ్రోన్లు తిరగడం వంటి ఘటనలను మర్చిపోకముందే.. ఇప్పుడు ఏకంగా కల్యాణ వేదిక వద్ద ఓ వ్యక్తి నమాజ్ చేశాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, నమాజ్ చేసిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాహనంలో తిరుమలకు వచ్చినట్లు టీటీడీ సిబ్బంది గుర్తించారు.
