దేవుడంటే భక్తిలేని వ్యక్తి చంద్రబాబు.. అందుకే ఇలా..: పెద్దిరెడ్డి | Peddireddy Alleges Chandrababu Revived Mining Plans at Sacred Mallanna Hills | Sakshi
Sakshi News home page

దేవుడంటే భక్తిలేని వ్యక్తి చంద్రబాబు.. అందుకే ఇలా..: పెద్దిరెడ్డి

Jun 30 2026 4:49 PM | Updated on Jun 30 2026 6:22 PM

Peddireddy Alleges Chandrababu Revived Mining Plans at Sacred Mallanna Hills

తిరుపతి: దేవుడంటే భక్తిలేని వ్యక్తి చంద్రబాబు అంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. గతంలో తాము వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మాట‍్లాడి మల్లన్న కొండ మీద మైనింగ్‌ అనుమతులు రద్దు చేయించామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్‌ అనుమతులన్నీ నిలిపేశామని చెప్పారు. 2015లో చంద్రబాబు స్వయంగా లైసెన్సులు ఇచ్చారని అన్నారు. చంద్రబాబు ఎప్పుడు వచ్చినా దేవాలయాల ఆస్తులపై కన్ను వేస్తారని ఆరోపించారు.

తిరుపతిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘‘మల్లయ్య కొండలో ఇనుప ఖనిజం దోపిడీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బ తినడంతో ఆ పాపాన్ని వైసీపీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపు 20 కోట్ల రూపాయలు మల్లయ్య కొండ అభివృద్ధికి కృషి చేసింది. 

టీడీపీ పాలనలో ఒక్క పైసా అభివృద్ధి ఎందుకు చేయలేదు? గతంలో కాలిబాట కూడా సరిగ్గా లేని పరిస్థితి నుంచి ఆలయ జీర్ణోద్ధరణ చేసి, రోడ్లు వేసి, విద్యుత్ సరఫరా, మంచినీరు, ఇతర సదుపాయాలు అందించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. 2022లో ఎర్రకొండలో మైనింగ్ కు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన మాట వాస్తవమే. అయినా కూడా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఎర్రకొండలో మైనింగ్ అనుమతులు ఉన్నా కూడా మేము ఆ ప్రక్రియ కొనసాగించలేదు. అనుమతులు వచ్చినా మైనింగ్ చేయకూడదు అని నిర్ణయించాం, పూర్తి గా నిలిపివేశాం. కానీ మేం ఆపేసిన ఎర్రకొండ అనుమతులు చూపించి, ఏకంగా ఆ శివుడు కొలువై ఉన్న సాధు కొండ, శివపురం లో మైనింగ్ కు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది.

సాధు కొండలో మైనింగ్ గురించి 2004 జనవరి 1 నుంచి జియోమైసూర్ సర్వీసెస్ అనే సంస్థ ప్రభుత్వంతో అనేకమార్లు సంప్రదింపులు జరిపింది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు మళ్లీ జియో మైసూర్ సంస్థ అనేక లేఖలు ప్రభుత్వానికి రాసింది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తంబళ్లపల్లె స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆ ప్రాంతంలో మైనింగ్ జరిగితే ప్రజలతో పాటుగా తాను వ్యతిరేకిస్తాను అని స్వయంగా అప్పటి మైనింగ్ మంత్రి గల్లా అరుణ కుమారి కి చెప్పారు. 

ఈ విషయం నేను చెప్పట్లేదు….. స్వయంగా గల్లా అరుణ కుమారి ఈ అంశాన్ని ఆమె పుస్తకంలో రాసుకున్నారు. 2015లో ప్రాస్పెక్టింగ్ లైసెన్స్.... అంటే ఖనిజాలు గుర్తించేందుకు లైసెన్స్ ఇచ్చారు. అప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. సాధుకొండకు కూటమి ప్రభుత్వం 2025 నవంబర్ 27న టెండర్ పిలిచింది.     ఏపీఎండీసీ దాఖలు చేసిన టెండర్ కు ప్రిఫర్ బిడ్డర్ కింద 900 హెక్టార్లలో ఈ ఏడాది ఏప్రిల్ 23న ఎల్.సి జారీ ఎలా చేశారు? శివపురంలో 626 హెక్టార్లలో మైనింగ్ కోసం 2025 ఫిబ్రవరి 27, సెప్టెంబర్ 4న ఉన్నత స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించి కూటమి ప్రభుత్వమే’’ అని చెప్పారు.

దొంగే ‘దొంగ దొంగ..’ అన్నట్లు ఉంది..  
దొంగే దొంగ దొంగ అన్నట్టుగా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం మైనింగ్ కు పూనుకుని మాపై విమర్శలు చేస్తుందని పెద్దిరెడ్డి విమర్శించారు . ‘‘తిరుమల 7 కొండలు లానే మల్లయ్య కొండ మూడు కొండలు పవిత్రమైనవి.  మల్లయ్య కొండ జోలికి వెళితే భక్తులు ఊరుకోరు. రాష్ట్రంలో మామిడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒక్క కేంద్రం మంత్రి ఉన్నా అక్కడ మామిడికి 17 రూపాయల మద్దతు ధర ఉంది. చంద్రబాబుకు రైతులు అంటే ఎప్పుడూ ఇష్టం లేదు. రాష్ట్రంలో పాలన లేదు, కేవలం కేసులు పెట్టడం, టార్చర్ చేయడం, గోర్లు పీకేయడం, చంపేయడమే జరుగుతుంది’’ అని విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement