కోడలి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్..! | Newly married man ends life in guntur | Sakshi
Sakshi News home page

కోడలి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్..!

Jul 17 2025 12:32 PM | Updated on Jul 17 2025 12:32 PM

Newly married man ends life in guntur

తాడేపల్లి రూరల్‌: తన చావుకు భార్య కారణమని పేర్కొంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం... తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటకు చెందిన బ్రహ్మయ్య (30) సీసీ కెమెరాల టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. మంగళగిరి టిడ్కో నివాసాల్లో ఉంటున్న యువతితో వివాహం జరిగింది. ఆమె ప్రవర్తన సరిగ్గా లేదని పుట్టింటికి పంపించేశాడు.

 అందరూ బ్రహ్మయ్యను బతిమిలాడితే ఆమెను కాపురానికి తీసుకొచ్చినట్లు బంధువులు తెలిపారు. అత్తాకోడళ్ల గొడవల కారణంగా బ్రహ్మయ్య సొంత ఇంటి నుంచి ఉండవల్లి అమరావతి రోడ్‌లోని ఒక ఇంటిలో అద్దెకు దిగాడు. అక్కడ మళ్లీ ఆమె ఫోనులో ఎక్కువగా మాట్లాడుతుండటంతో గొడవలు జరిగాయి. ఈలోగా ఆషాఢ మాసం రావడంతో పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో తన చావుకు భార్య కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని బ్రహ్మయ్య ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

తాడేపల్లి పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. భర్త చనిపోయిన ఏడాదికే ఇలా కుమారుడు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో బ్రహ్మయ్య తల్లి కన్నీరుమున్నీరైంది. ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుందామని చెప్పినా ఎందుకు ఇలా చేశావని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడి చావుకు కారణమైన కోడలు, ఆమె ప్రియుడిని శిక్షించాలని డిమాండ్‌ చేసింది.      

Advertisement
 
Advertisement
Advertisement