
సాక్షి, విజయవాడ: ఎంపీ మిథున్‌రెడ్డిని జడ్జి ఎదుట సిట్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. న్యాయవాదులను కోర్టు లోపలికి అనుమతించని పోలీసులు.. కోర్టుకి అన్ని వైపులా బారికేడ్లతో దారులను మూసేశారు. కోర్టు ప్రధాన ద్వారం కూడా మూసేశారు. దీంతో పోలీసులు, న్యాయవాదులకు మధ్య వాగ్వాదం జరిగింది.
కాగా, నిన్న (శనివారం) ఎంపీ మిథున్‌రెడ్డి స్వచ్ఛందంగా సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ అక్రమ కేసులో గతంలో ఓసారి ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన మిథున్‌రెడ్డి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 వరకు సిట్ అధికారులు ఆయనను విచారించారు. అనంతరం మిథున్‌ను అరెస్ట్ చేసి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. మిథున్‌రెడ్డిని ఇవాళ ఉదయం(ఆదివారం) విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపర్చారు.
సిట్ అధికారుల విచారణలో.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేది ఎంపీ మిథున్‌రెడ్డి సాధికారికంగా తేల్చిచెప్పారు. ఎంపీ అయిన తనకు రాష్ట్ర ప్రభుత్వ విధానాలలో ఏమాత్రం ప్రమేయం ఉండదని కుండబద్ధలు కొట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై సిట్ అధికారులు మిథున్‌ను పలు ప్రశ్నలు వేశారు.
అయితే ఆయనపై అభియోగాలకు సంబంధించి సిట్ అధికారులు సరైన ఆధారాలను చూపించలేకపోయారు. ఈ కేసులో సిట్ బెదిరించి, వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే ఎంపీ మిథున్‌రెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆ అవాస్తవ ఆరోపణలను మిథున్ సమర్థంగా తిప్పికొట్టారు. సిట్ అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డితో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా సరే, ప్రభుత్వ పెద్దల కుట్రనే సిట్ అధికారులు ఏకపక్షంగా అమలు చేశారు.
