స్టాంప్‌ డ్యూటీ స్కామ్‌లో మరిన్ని కంపెనీలు! | More Companies Involved In TDP MLA Amilineni Surendrababu Stamp Duty Scam, More Details Inside | Sakshi
Sakshi News home page

స్టాంప్‌ డ్యూటీ స్కామ్‌లో మరిన్ని కంపెనీలు!

Jun 25 2025 5:27 AM | Updated on Jun 25 2025 9:34 AM

More companies involved in stamp duty scam

అన్నీ కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సన్నిహితులవే

నకిలీ చలానాలతో రూ.కోట్లు కొల్లగొట్టిన అమిలినేని కంపెనీ  

బ్యాంకులకు ఇచ్చిన స్టాంప్‌ డ్యూటీ చలానాలన్నీ నకిలీవే 

అడ్డంగా దొరికిపోయినా ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ బుకాయింపు 

మీసేవ నిర్వాహకుడు బాబు పాత్రధారిగా కుంభకోణం 

బాబు ఇంట్లో సోదాలో భారీగా బంగారం, విలువైన ఆభరణాలు లభ్యం! 

రహస్యంగా విచారిస్తున్న పోలీసులు

అనంతపురం టౌన్, సాక్షి టాస్క్ ఫోర్స్: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ నకిలీ స్టాంప్‌ డ్యూటీ చలానాలు సృష్టించి రూ.900 కోట్లకుపైగా బ్యాంకు రుణాలు పొందిన వ్యవహారంలో డొంకంతా కదులుతోంది! ఈ స్టాంప్‌ డ్యూటీ కుంభకోణంలో ఎమ్మెల్యే సురేంద్రబాబుకు చెందిన ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ పాత్ర ఇప్పటికే బహిర్గతం కాగా ఆయన సన్నిహితుల కంపెనీలు నియో కన్‌స్ట్రక్షన్స్, సురాజ్‌ ఇన్‌ఫ్రా సైతం బ్యాంకులకు నకిలీ స్టాంప్‌ డ్యూటీ చలానాలు సమర్పించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ కంపెనీలు సైతం రూ.కోట్లలో బ్యాంకు రుణాలు పొందడం గమనార్హం.

ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన స్టాంప్‌ డ్యూటీ మొత్తాన్ని చెల్లించకుండా తమ ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఎస్‌ఆర్‌సీ కంపెనీ 2024 జూన్‌ నుంచి 2025 మార్చి వరకు తొమ్మిది నెలల వ్యవధిలో టాటా క్యాపిటల్స్, యూనియన్‌ బ్యాంక్‌తో పాటు వివిధ బ్యాంకుల్లో రూ.900 కోట్లకు పైగా రుణాలు అక్రమ మార్గంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రుణాలకు సంబంధించి స్టాంప్‌ డ్యూటీ 0.5 శాతం ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.4 కోట్లకు పైగా కట్టాలి. 

అయితే నకిలీ స్టాంప్‌ డ్యూటీ చలానాలను బ్యాంకులకు సమర్పించి రూ.నాలుగు కోట్లకు పైగా స్టాంప్‌ డ్యూటీ మొత్తాన్ని ఎమ్మెల్యే అమిలినేని కంపెనీ ఎగ్గొట్టింది. స్టాంప్‌ డ్యూటీ నకిలీ చలానాల కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన ఎమ్మెల్యే అమిలినేని కంపెనీ.. దొంగే.. దొంగ.. దొంగ..! అన్నట్లుగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. ఇందులో తమ తప్పు ఏమీ లేదన్నట్లు అంతా మీసేవ నిర్వాహకుడు యర్రప్ప అలియాస్‌ బాబే చేశాడంటూ ఎస్‌ఆర్‌సీ కంపెనీ అనంతపురం టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ప్రశ్నలకు బదులేది?
» స్టాంప్‌ డ్యూటీ చలానాలు తీసే ముందు ఎస్‌ఆర్‌సీ కంపెనీ ఖాతా నుంచి సదరు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలా చేయకుండా ‘మీసేవ బాబు’ బ్యాంకు ఖాతా నుంచి చెల్లించారంటే అర్థం ఏమిటి?  
» రూ.వందల కోట్ల రుణాలు తీసుకునేందుకు రూ.కోట్లలో స్టాంప్‌ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. అంత మొత్తం ‘మీ సేవ బాబు’ దగ్గర ఉంటుందా?  
» ఒకవేళ ఎస్‌ఆర్‌సీ కంపెనీనే స్టాంప్‌ డ్యూటీకి అవసరమైన మొత్తాన్ని బ్యాంకు ఖాతాలోకి జమ చేసి ఉంటే.. ఆ బ్యాంకు ట్రాన్సాక్షన్‌ వివరాలు అందుబాటులో ఉంటాయి కదా? 
» ఓ ప్రముఖ కంపెనీ తమ సంస్థ పేరిట చలానాలు తీయకుండా థర్డ్‌ పార్టీ నుంచి చెల్లిస్తుందా? అలా చేయడంలో ఆంతర్యమేమిటి?

రహస్యంగా యర్రప్ప దంపతుల విచారణ..
ఎమ్మెల్యే సురేంద్రకు అత్యంత సన్నిహితుడైన మీసేవ నిర్వాహకుడు బాబు అలియాస్‌ బోయ యర్రప్ప, ఆయన భార్య కట్టా భార్గవిని పోలీసులు అదుపులోకి తీసుకుని అత్యంత రహస్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. మూడు రోజుల క్రితమే విజిలెన్స్, సీసీఎస్‌ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు. యర్రప్ప నివాసంలో జరిపిన సోదాల్లో కిలో బంగారంతో పాటు ఓ డైమండ్‌ నెక్లెస్, ఆయన భార్య బ్యాంకు ఖాతాలో రూ.1.80 కోట్ల నగదు ఉన్నట్లు గుర్తించారని స్థానికంగా చర్చ జరుగుతోంది. 

కాగా యర్రప్పకు సహకరించిన మోహన్‌బాబు అనే యువకుడితోపాటు మీసేవలో పనిచేసే మరో వ్యక్తిని, ఆరి్థక లావాదేవీలు నడిపిన ఓ మహిళను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. యర్రప్పతో సన్నిహితంగా ఉంటూ ఆర్థిక లావాదేవీలు నడిపిన కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల గురించి కూడా సీసీఎస్‌ అధికారులు ఆరా తీస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement