బంగాళాఖాతంలో వాయుగుండం | Moderate to heavy rain forecast for South Coast and Rayalaseema | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో వాయుగుండం

Mar 4 2022 3:36 AM | Updated on Mar 4 2022 9:35 AM

Moderate to heavy rain forecast for South Coast and Rayalaseema - Sakshi

సాక్షి, విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం ఉదయం నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి శుక్రవారం ఉదయం తీవ్ర వాయుగుండంగా మారే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఇది శ్రీలంకలోని ట్రింకోమలికి 360 కి.మీ., తమిళనాడులోని నాగపట్నంకు 700 కి..మీ., పుదుచ్చేరికి 760 కి.మీ., చెన్నైకు 840 కి..మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ప్రస్తుతం గంటకు 18 కి.మీ. వేగంతో కదులుతోందని.. రాగల 48 గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణిస్తూ శ్రీలంక తూర్పు తీరం వెంబడి ఉత్తర తమిళనాడు వద్ద తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మార్చిలో తీవ్ర వాయుగుండం, తుపాను ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గడిచిన 200 సంవత్సరాల కాలంలో కేవలం 11 సార్లు మాత్రమే ఈ తరహా వాతావరణం ఏర్పడిందని.. చివరిసారిగా 1994లో బంగాళాఖాతంలో స్వల్ప తుపాను వచ్చినట్లు వారు వెల్లడించారు. ప్రస్తుత వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై తక్కువగా ఉంటుందన్నారు. దీని ప్రభావంవల్ల దక్షిణ కోస్తా, రాయలసీమలో నేడు, రేపు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయనీ.. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 50–60 కి.మీ. గరిష్టంగా 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని.. ఈ కారణంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మత్స్యకారులెవ్వరూ 6వ తేదీ వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement