మహిళ చెప్పింది అర్థం కాక మనిషిని తీసుకురమ్మన్నాం | MLA Galla Madhavi Publicity Stunt Guntur Police Station | Sakshi
Sakshi News home page

మహిళ చెప్పింది అర్థం కాక మనిషిని తీసుకురమ్మన్నాం

Sep 19 2026 9:41 AM | Updated on Sep 19 2026 9:45 AM

MLA Galla Madhavi Publicity Stunt Guntur Police Station

మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్యే మాధవి

గుంటూరు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి పబ్లిసిటీ స్టంట్‌కు తెరదీశారు. నగరంపాలెంలోని మహిళా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఓ బాధితురాలి పక్షాన తానే అన్ని అయి నిలబడుతున్నట్లు సీన్‌ క్రియేట్‌ చేశారు. ఒక మహిళ ఎంతో కష్టాల్లో వస్తే అసలు పోలీసులు పట్టించుకోవటం లేదంటూ మీడియా ఎదుట ఆరోపించారు. అయితే కేవలం గంటల వ్యవధిలోనే.. పోలీసులు అసలు బాధితురాలి ఫిర్యాదుపై నిర్లక్ష్యం చేయలేదంటూ నేరుగా ప్రకటన విడుదల చేయడం విశేషం.

వివాదం ఏమంటే.. 
గుంటూరు రూరల్‌ మండలం అడవితక్కెళ్లపాడుకు చెందిన షేక్‌ రిజ్వానాకు ఎనిమిది సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతానికి చెందిన సైదులతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. భర్త సైదులు మద్యం తాగి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని, తనపై అనుమానంతో ఇబ్బందులు గురి చేస్తున్నాడని బాధితురాలు మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఫిర్యాదు చేసే క్రమంలో బాధితురాలు రిజ్వానా చెప్పిన మాటలు అర్థం కాని రిసెప్షన్‌లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ తనకు తెలిసిన వారిని ఎవరినైనా సమస్యను వివరించేందుకు తీసుకురావాలని సూచించింది. అయితే సదరు మహిళ పోలీసులు చెప్పిన వైనాన్ని.. అర్థం చేసుకోలేక టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి వద్దకు వెళ్లింది. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుని ఎమ్మెల్యే మాధవి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. 

స్టేషన్‌లో హడావుడి... 
ఎమ్మెల్యే గళ్లా మాధవి వద్దకు వెళ్లిన రిజ్వానను తీసుకుని తన కారులో స్టేషన్కు వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ.. యాక్షన్‌ చేశారు. తనకు సంబంధించిన వాళ్లను ఎవరైనా తీసుకురావాలని చెప్పారని.. నియోజవర్గ ప్రజలంతా తన వారేనని.. ఫిర్యాదు ఎందుకు తీసుకోలేదంటూ పోలీసుల దగ్గరకు వెళ్లి మీడియా ఎదుట చెప్పారు. రిజ్వాన పక్షాన తాను ఉన్నానని ఇప్పుడు ఫిర్యాదు తీసుకుంటారా అంటూ... నిలదీశారు. ఈ క్రమంలో పచ్చ మీడియా, టీడీపీ సోషల్‌ మీడియా ఎమ్మెల్యే ఏదో చేసేసినట్లు పూర్తిస్థాయిలో పబ్లిసిటీ ఇచ్చారు. అయితే గంటల వ్యవధిలోనే మహిళా పోలీస్‌ స్టేషన్‌ అధికారులు ఒక ప్రకటన విడుదల చేయడం కొసమెరుపు. 

మహిళ చెప్పింది అర్థం కాక మనిషిని తీసుకురమ్మన్నాం  
రిజ్వానా తన భర్త వేధింపులకు గురి చేస్తున్న అంశంపై ఆమె చెప్పిన విధానం అర్థం కాక వేరే మనిషిని తీసుకురావాలని పోలీసులు సూచించినట్లు ప్రకటన విడుదల చేశారు. బాధితురాలు సమస్యను స్పష్టంగా వివరించలేని పక్షంలో, ఆమె తడపడంతో తెలిసిన వ్యక్తిని తీసుకురావాలని సూచించినట్లు పోలీసులు ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాధవి వచ్చిన అనంతరం విడుదల చేసిన ప్రకటనలో మహిళా పోలీస్‌ స్టేషన్‌ డి.ఎస్‌.పి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు స్వీకరించలేదని, కేసు నమోదు చేయలేదన్న ఆరోపణలు అవాస్తవమని తేల్చారు.    

ఇదీ చదవండి: బాబు కరువు.. ఊర్లకు ఊర్లు ఖాళీ


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement