జ్వరాల విజృంభణ | - | Sakshi
Sakshi News home page

జ్వరాల విజృంభణ

Sep 19 2026 5:50 AM | Updated on Sep 19 2026 5:50 AM

జాగ్రత్తలు ముఖ్యం

వివిధ జ్వరాల లక్షణాలివీ..

చిన్నా, పెద్ద తేడా లేకుండా

అందరికీ జ్వరాలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా

అందని వైద్య సేవలు

ప్రైవేట్‌ హాస్పిటళ్లకు జనం పరుగులు

చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కార్‌

డెంగీ జ్వరం: ఏడిస్‌ ఈజిప్ట్‌ దోమకాటు వల్ల ఈ జ్వరం వస్తుంది. తీవ్రజ్వరం, తలనొప్పి, కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, ఆకలి మందగించటం, శరీరంపై దద్దుర్లు, ముక్కు, మలం ద్వారా రక్తం పోవటం తదితర లక్షణాలు జ్వరం వచ్చిన వారిలో ఉంటాయి. 2025లో 230 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 56 నమోదయ్యాయి.

చికెన్‌గున్యా: డెంగీ జ్వరం లక్షణాలన్నీ ఈ జ్వరం సోకిన వారిలో కూడా ఉంటాయి. రక్తస్రావం మాత్రం ఉండదు. తీవ్రమైన ఒళ్లునొప్పులు దీర్ఘకాలం ఉంటాయి. జిల్లాలో మూడేళ్లుగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని వైద్యాధికారులు తెలిపారు. 2013లో చికెన్‌ గున్యా బాధితులు అధిక సంఖ్యలో నమోదు అవ్వటంతో వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ ఎమర్జన్సీ సైతం ప్రకటించింది. ప్రస్తుతం ఐదు కేసులు నమోదయ్యాయి.

మలేరియా జ్వరం: ఎనాఫిలిస్‌ దోమ కుట్టడం వలన మలేరియా జ్వరం వస్తుంది. చలి, వణుకుతో కూడిన విపరీతమైన జ్వరం వస్తూ పోతూ ఉంటుంది. జ్వరం తగ్గినప్పుడు చెమట పోస్తుంది. వ్యాధి లక్షణాలు పూర్తిగా బయటపడేందుకు రెండు వారాలు పడుతుంది. జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి మందులు వాడకుండా రక్త పరీక్ష చేయిస్తే మలేరియా ఉందో లేదో తెలుస్తుంది. సరైన వ్యాధి నిర్ధారణ, చికిత్స చేయకపోతే నెలల తరబడి వేధిస్తుంది. జిల్లాలో వైద్యాధికారుల లెక్కల ప్రకారం 2025లో 86 మంది మలేరియా బారిన పడ్డారు. ప్రస్తుతం ఐదుగురు చికిత్స పొందుతున్నారు.

ఫైలేరియా: క్యూలెక్స్‌ దోమ వలన ఈ వ్యాధి సోకుతుంది. తరచుగా జ్వరం రావటం, చంకల్లో, గజ్జల్లో బిళ్లలు కట్టడం, శరీరంలోని అవయవాల వాపు కనిపిస్తుంది. ప్రత్యేకించి కాళ్లు, చేతులు, స్తనాలు, జననేంద్రియాలు వాపునకు లోనవడం ఈ వ్యాధి ముఖ్యలక్షణాలు. వ్యాధి లక్షణాలు గుర్తించి సకాలంలో వైద్యం చేయించకపోతే బోదకాలుతో శాశ్వతంగా బాధపడాల్సి వస్తుంది. జిల్లాలో 1,400 మంది బాధితులు ఉన్నారు. ఏడేళ్లుగా జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వైద్యాధికారులు తెలిపారు.

మెదడువాపు: క్యూలెక్స్‌ దోమ కాటు వల్ల ఈ వ్యాధి ఎక్కువగా 15 ఏళ్లలోపు వారికి వస్తుంది. చిన్నప్పుడే వ్యాక్సిన్‌ వేయిస్తే వచ్చే అవకాశం తక్కువ. జ్వరం వచ్చి తగ్గుతూ ఉండటం దీని లక్షణం. చికిత్స చేయించకపోతే పక్షవాతం, ఫిట్స్‌ వచ్చి శాశ్వతంగా అంగవైకల్యంగా మారే ప్రమాదం ఉంది. జిల్లాలో మూడేళ్లుగా కేసులు నమోదు కాలేదని వైద్యాధికారులు తెలిపారు.

దోమల నియంత్రణ కోసం ఇంటి లోపల, బయట నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. వారానికి ఒకసారి నీటి నిల్వలు లేకుండా ఇళ్లలో ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలి. ఇంటి ఆవరణలో ఖాళీ కొబ్బరి చిప్పలు, కొబ్బరి బొండాలు, పాత టైర్లు, రోళ్లలో నీటి నిల్వలు లేకుండా చూడాలి. ఎయిర్‌ కూలర్‌లలో, పూల కుండీలలో నీటిని మూడు రోజులకు ఒకసారి మార్చాలి. ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లకు మూతలు బిగించాలి. వారానికి ఒకసారి నీటి గుంతలలో కిరోసిన్‌, మడ్డి ఆయిల్‌ చల్లించాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. దోమకాటు వల్ల వచ్చే వ్యాధుల బారిన పడకుండా దోమ తెరలు తప్పనిసరిగా వాడాలి. శాఖాపరంగా జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం.

–డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ

వైద్య రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న గుంటూరు జిల్లాలో ప్రజలు చంద్రబాబు సర్కార్‌ నిర్వాకంతో జ్వరాలతో అల్లాడిపోతున్నారు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా జ్వరాల కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఆసుపత్రులకు రోగులు పరుగులు తీస్తున్నారు. చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది.

గుంటూరు మెడికల్‌: జిల్లా వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోవడం, కాల్వల్లో మురుగు నీరు పారకపోవడంతో దోమలు వృద్ధి చెంది ప్రజలను జ్వరాల బారినపడుతున్నారు. పారిశుద్ధ్యం మెరుగు, ముందస్తుగా అవగాహన కల్పన, ప్రాథమిక దశలోనే వ్యాధుల తీవ్రత గుర్తించి కట్టడి చేయాల్సిన యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ చూసే విభాగాలు, వైద్య ఆరోగ్యశాఖ మధ్య సమన్వయ లోపం ప్రజలకు శాపంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలూ ఈ పరిస్థితికి ఓ కారణంగా ఉన్నాయి. చికిత్స కోసం ప్రజలు ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. డెంగీ జ్వరాలు సోకిన వారికి రూ.లక్షల్లోనే బిల్లులు అవుతున్నాయి. ప్లేట్‌లెట్ల పేరిట ప్రైవేట్‌ ఆసుపత్రుల వారిని పీల్చి పిప్పిచేస్తున్నాయి.

జిల్లాలో కేసుల వివరాలు...

ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన పదేళ్ల శ్రీకాంత్‌ మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతూ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మూడు రోజులకు రూ.10 వేలు బిల్లు వేయడంతో రోజువారీ పనులు చేసుకుంటున్న శ్రీకాంత్‌ తండ్రి ఒక్కసారిగా కంగుతిన్నాడు. గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గుంటూరు వచ్చి చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని వాపోయాడు. జిల్లాలో వైద్య అధికారుల గణాంకాల ప్రకారం జనవరి నుంచి ఇప్పటి వరకు 12 వేల జ్వరాల కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా వీటి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. మలేరియా 6, డెంగీ 56, చికున్‌గున్యా 5 కేసులు నమోదయ్యాయి. కుటుంబం మొత్తం జ్వరాలతో అల్లాడుతున్నప్పటికీ వైద్య సిబ్బంది సదరు గృహాలను సందర్శించి జ్వరాల తీవ్రత నిర్ధారించేందుకు పరీక్షలు చేయడంగానీ, వివరాలు తీసుక్వోడంగానీ మానేశారు. ప్రజలు వైద్య పరీక్షల కోసం ఆరోగ్య కేంద్రాలకు వెళుతుంటే అక్కడ అరకొర సేవలు అందుబాటులో ఉంటున్నాయి. వైద్యులు నిర్ణీత పనివేళల్లో ఆసుపత్రిలో అందుబాటులో ఉండటం లేదు. సిబ్బంది కూడా మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. అన్నిరకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు పలు ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేవు. మందులు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. రోజుల తరబడి ఆరోగ్య కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. గత్యంతరం లేక ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌లు రోగులతో కిటకిటలాడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement