టీడీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత | - | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత

Sep 19 2026 5:50 AM | Updated on Sep 19 2026 5:50 AM

● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ● కూటమి రెండున్నరేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ● ఈ నెల 20న వైఎస్సార్‌సీపీ సమర శంఖారావం ● ముఖ్య అతిథులుగా రీజినల్‌ కో ఆర్డినేటర్లు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి

ప్రజల్లో

పెరిగిన

అసంతృప్తి

నెహ్రూనగర్‌: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ప్రజావ్యతిరేక, అరాచక పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీఎంసీ) ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జీఎంసీ పరిధిలోని మొత్తం 76 డివిజన్లలో వైఎస్సార్‌సీపీని విజయపథంలో నడిపించేందుకు విస్తృత కార్యాచరణ సిద్ధం చేసినట్లు అంబటి రాంబాబు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన సాయంత్రం అమరావతి రోడ్డులోని ‘ఏ1 కన్వెన్షన్‌ హాల్‌’లో భారీ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. ఈ భారీ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం ఉదయం జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరి ఫాతిమా, తాడికొండ సమన్వయకర్త డైమండ్‌ బాబు పరిశీలించారు. సభకు హాజరయ్యే నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు.

బోగస్‌ ఓట్లుపై విచారణ చేయాలి

జీఎంసీ పరిధిలో పెద్దఎత్తున దొంగ ఓట్లను చేర్పించారని అంబటి ఆధారాలతో వెల్లడించారు. గుంటూరు వెస్ట్‌లో దాదాపు 14 వేలు, ఈస్ట్‌లో 3 వేలకు పైగా డబుల్‌ ఓట్లు ఉన్నట్లు క్షేత్రస్థాయిలో గుర్తించామన్నారు. హైదరాబాద్‌లో నివసించే వారి పేర్లు, ఒకే డివిజన్‌లో ఒకే వ్యక్తి పేరు రెండుసార్లు ఉన్న ఉదంతాలపై జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌కు సమగ్ర ఆధారాలతో జాబితా అందించామని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి బోగస్‌ ఓట్లను తొలగించాలని, లేనిపక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయించి పోరాటం చేస్తామని హెచ్చరించారు.

అక్రమ కేసులు, వేధింపులకు భయపడం

కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వారిపై తప్పుడు చట్టాలు, పోలీసులను అడ్డంపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా గొంతు నొక్కేందుకు చంద్రబాబు, లోకేష్‌ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనపై రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడో కేసులు పెట్టి వేధించినా భయపడే ప్రసక్తే లేదన్నారు. రానున్న ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడినా, అక్రమాలకు ఒడిగట్టినా చూస్తూ ఊరుకోబోమని, ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని హెచ్చరించారు. మేయర్‌ రిజర్వేషన్లపై ఇప్పటినుంచే అనవసర రాద్ధాంతం అవసరం లేదని, ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే పార్టీ తరఫున నిర్ణయం తీసుకుంటామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

76 డివిజన్లలో గట్టి పోటీ ఇస్తాం

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నగరంలోని మొత్తం 76 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ తరఫున బరిలోకి దిగి గట్టి పోటీ ఇస్తామని, ఎక్కడా కూటమి పార్టీలకు ఏకగ్రీవం చేసుకునే అవకాశం ఇవ్వబోమని వైఎస్సార్‌సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్‌ నూరి ఫాతిమా, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు (డైమండ్‌ బాబు) స్పష్టం చేశారు.

గత ఎన్నికల్లో మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదని అంబటి మండిపడ్డారు. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అందించిన సంక్షేమాభివృద్ధి పాలనతో నేటి పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల విశ్వాసం చూరగొన్న, నిబద్ధత గల విధేయులైన అభ్యర్థులకే టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. పార్టీ ద్వారా పదవులు పొంది ఇతర పార్టీల్లోకి వెళ్లిన అవకాశవాదులను ప్రజలే తిరస్కరిస్తున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement