జిల్లా సమగ్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

జిల్లా సమగ్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యం

Sep 19 2026 5:50 AM | Updated on Sep 19 2026 5:50 AM

● జిల్లా ఇన్‌చార్జి మంత్రి కందుల దుర్గేష్‌

గుంటూరు వెస్ట్‌: గుంటూరు జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌.ఎన్‌.శంకరన్‌ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ) నిర్వహించారు. సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌, రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ, జీఎంసీ కమిషనర్‌ మయూర్‌ అశోక్‌, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర, గళ్లా మాధవి, తెనాలి శ్రావణ్‌కుమార్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మంత్రి దుర్గేష్‌ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. అమరజీవి జలధార ప్రాజెక్టు రెండవ దశ పనులను శరవేగంగా పూర్తి చేయాలని, జల్‌ జీవన్‌ మిషన్‌ 2.0 పనులను వేగవంతం చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 50,527 మంది నూతన పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోగా, ప్రాథమికంగా 1,081 దరఖాస్తులను ఆమోదించినట్లు అధికారులు తెలిపారన్నారు. పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్‌ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. హౌస్‌ హోల్డ్‌ సర్వే సమస్యలను ఇప్పటికే ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. జిల్లాలో 13,657 మంది రైతుల నుంచి ఇప్పటివరకు 91,178 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, పొన్నూరు నియోజకవర్గంలో అత్యధికంగా సేకరణ జరిగిందని వెల్లడించారు. ఎరువుల కొరత రాకుండా చూడాలని, బ్లాక్‌ మార్కెటింగ్‌ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. దీపం పథకం కింద ఐదు దశల్లో రూ.168 కోట్ల లబ్ధితో 20,25,565 మందికి ప్రయోజనం చేకూరిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం కళాకారులకు పెద్దపీట వేస్తూ కందుకూరి, ఉగాది కళారత్న, గుర్రం జాషువా, బోయి భీమన్న, గిడుగు రామమూర్తి పంతులు పేరిట పురస్కారాలను ఇస్తోందన్నారు. గుంటూరు జిల్లాను సాంస్కృతిక ప్రాశస్త్యాన్ని ప్రతిబింబించేలా రాబోయే జనవరి నెలలో తెనాలి వేదికగా ‘నంది నాటకోత్సవాలు’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అనంతరం జిల్లా వార్షిక క్రెడిట్‌ ప్లాన్‌ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

రూ.55,015 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక

2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ.55,015 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించినట్లు కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను లబ్ధిదారులకు అందించడంలో ప్రైవేట్‌ బ్యాంకులు వెనకబడటం గర్హనీయమని, ఇదే పద్ధతి కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మహిపాల్‌ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి రూ.18,974 కోట్లు లక్ష్యం కాగా, జూన్‌ మాసం చివరి నాటికి రూ.6,351 కోట్లు మంజూరు చేశామన్నారు. ఎంఎస్‌ఎంఈలకు 15,996 కోట్లు లక్ష్యం కాగా, రూ.6,635... ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌కు రూ.58 కోట్లు లక్ష్యానికిగాను రూ.91 కోట్లు, విద్యా రుణాలకు రూ.210 కోట్లు లక్ష్యం కాగా, రూ.24 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. మొత్తంగా ప్రాధాన్యతా రంగానికి రూ.36,400 కోట్లు లక్ష్యం కాగా, రూ.13,234 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రాధాన్యేతర రంగానికి సంబంధించి రూ.18,615 కోట్లకుగాను రూ.6,321 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సమావేశంలో యూబీఐ డీజీఎం హనుమంత్‌ రెడ్డి, ఆర్‌బీఐ అధికారి రవీంద్ర బాబు, నాబార్డ్‌ డీడీఎం శరత్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement