సచివాలయాల ఉద్యోగుల సమరనాదం.. | Village and Ward Secretariat employees protest in Vijayawada on September 27 | Sakshi
Sakshi News home page

సచివాలయాల ఉద్యోగుల సమరనాదం..

Sep 19 2026 5:54 AM | Updated on Sep 19 2026 5:54 AM

Village and Ward Secretariat employees protest in Vijayawada on September 27

అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతున్న వీఏహెచ్‌ఏలు

27న విజయవాడలో లక్ష మందితో నిరసన 

23లోగా డిమాండ్లు పరిష్కరించకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామంటూ ప్రభుత్వానికి అల్టీమేటం 

గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో నోటీసు అందజేసిన ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు 

23న మంత్రి వద్ద జరిగే సమావేశంలో లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్‌ 

లేదంటే 25న ‘చలో కలెక్టరేట్‌’ చేపట్టాలని నిర్ణయం

సాక్షి, అమరావతి: న్యాయబద్ధంగా తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చడంతో పాటు తమ సమస్యల పరిష్కారానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ నెల 27న దాదాపు లక్షమంది సిబ్బందితో విజయవాడ వేదికగా నిరసన తెలియజేయాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక నిర్ణయించింది. ఈ మేరకు ఆయా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారు. 

రెండేళ్లుగా వివిధ సందర్భాల్లో ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇస్తూ వస్తున్న వీరు తమ సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలన్నీ ఉమ్మడిగా ఐక్య కార్యాచరణను చేపట్టాలని నిర్ణయించాయి. ఈనెల 23 కల్లా డిమాండ్లను పరిష్కరించని పక్షంలో 24 నుంచి ప్రత్యక్ష కార్యాచరణను మొదలుపెట్టనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో అందజేసిన నోటీసులో పేర్కొన్నారు. ఈనెల 25న అన్ని జిల్లాల్లో ‘చలో కలెక్టరేట్‌’ కార్యక్రమాన్ని చేపట్టి, 27న విజయవాడలో నిరసన కార్యక్రమం చేపడతామని అందులో తెలిపారు.

23 కల్లా ఏఏఎస్‌ జీఓ విడుదల చేయాలి..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌ స్కీం (ఏఏఎస్‌)ను తక్షణమే అమలుచేయాలని.. 23 కల్లా జీఓ కూడా విడుదల చేయాలని వారు ఆ నోటీసులో డిమాండ్‌ చేశారు. నోషనల్‌ ఇంక్రిమెంట్లను ప్రభుత్వం వెంటనే పరిశీలించి మంజూరుచేయాలి. ఇంకా వారి డిమాండ్లు ఏమిటంటే.. 

సచివాలయ ఉద్యోగులపై తీవ్రమైన పని ఒత్తిడి పెంచి కొందరి మరణాలకు కారణమైన అధికారులపై ఒక కమిటీ వేసి మూడునెలల్లోపు విచారణ చేయాలి. ఆయా ఉద్యోగుల మరణాలకు అధికారి నిర్లక్ష్యం లేదా పని ఒత్తిడి కారణమని తేలితే సంబంధిత అధికారిపై చర్యలు కూడా మూడు నెలల్లోపే తీసుకోవాలి. ఆయా విచారణ కమిటీల్లో తప్పనిసరిగా సచివాలయ ఉద్యోగ ప్రతినిధిని కూడా నియమించేలా ప్రభుత్వం ఆదేశాలివ్వాలి. 

 గ్రామ, వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ప్రతీ ఒక్క పోస్టుకు కూడా ప్రమోషన్‌ ఛానల్‌ ఇచ్చే క్రమంలో కనీస బేసిక్‌ పే రూ.30,000కు తగ్గకుండా చూడాలి. 
 జీఓ నెంబర్‌–11 రద్దు చేయాలి. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్లో సచివాలయ ఉద్యోగ సంఘాలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి.  
 ఉద్యోగులను పెద్ద సంఖ్యలో ఇతర విభాగాలకు డిప్యూటేషన్‌పై పంపడంవల్ల మిగతా ఉద్యోగులందరిపై పనిభారం పెరుగుతున్నందున డిప్యుటేషన్లన్నీ రద్దుచేయాలి.  

  మల్టీ బాసిజం వలన ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడికి గురయ్యే పరిస్థితి లేకుండా సింగిల్‌ లైన్‌ డిపార్ట్‌మెంట్‌ పరిధిలోనే ఆయా ఉద్యోగులు పనిచేసేలా ప్రభుత్వం ఆదేశాలివ్వాలి. 
 ఈనెల 23న ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి డోలా బాలవీరాంజనేయులు నిర్వహించే సమావేశంలో ఆయా అంశాలపై  లిఖితపూర్వక హామీ ఇవ్వాలి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement