అనంతపురం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న వీఏహెచ్‌ఏలు
పశుసంవర్ధక సహాయకుల డిమాండ్ .. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తక్షణమే తమ ప్రొబేషన్‌ను డిక్లేర్ చేయాలని రైతు సేవా కేంద్రాల(ఆర్బీకే)లో పని చేస్తున్న గ్రామ పశుసంవర్ధక సహాయకులు(వీఏహెచ్‌ఏ) డిమాండ్ చేశారు. ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద శుక్రవారం వీఏహెచ్‌ఏలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కలెక్టర్లు, అధికారులకు వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఏపీ గ్రామ పశుసంవర్ధక సహాయకుల సంఘం నాయకులు మాట్లాడుతూ 2023లో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ఎంపికై, 2024 ఫిబ్రవరిలో విధుల్లో చేరిన 1,896 మంది వీఏహెచ్‌ఏలు రెండేళ్ల ప్రొబేషన్ కాలాన్ని 2026 ఫిబ్రవరిలో పూర్తి చేశారని తెలిపారు. అయినా ఇప్పటివరకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వులు జారీ చేయకపోవడం బాధాకరమన్నారు.
తమ సమస్య పరిష్కారం కోసం సంబంధిత శాఖ మంత్రి, ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి వినతిపత్రాలు అందించినా ప్రయోజనం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. రెండున్నరేళ్లుగా రూ.15వేలు చాలీచాలని వేతనంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంటి అద్దెలు, కుటుంబ పోషణ, పిల్లల విద్య, వైద్యం, రవాణా తదితర ఖర్చులు రెట్టింపయ్యాయని, ప్రతి నెలా అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. మరోవైపు పశుసంవర్ధక శాఖ విధులతోపాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు, అదనపు శాఖా విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఇప్పటికైనా ప్రభుత్వం తమ ప్రొబేషన్ డిక్లేర్ చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


