ప్ర‘గతి’ తప్పిన నివేదిక
మళ్లీ అవే అబద్ధాలు.. వాస్తవాలకు ముసుగు
రెండేళ్ల చంద్రబాబు పాలనలో విద్యుత్ శాఖ ప్రగతి నివేదికను విడుదల చేసిన మంత్రి గొట్టిపాటి
రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.20 వేల కోట్లకు పైగా చార్జీల భారం
చంద్రబాబు గత హయాంలో అనవసర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సంస్కరణలతో తగ్గిన విద్యుత్ కొనుగోలు ఖర్చు
వాస్తవాలను వక్రీకరించి చెప్పిన ఇంధన శాఖ మంత్రి.. తప్పుబట్టిన సెకీ విద్యుత్‌ను అదే ధరకు తీసుకుంటున్నట్లు వెల్లడి
గతంలో ఫైవ్ స్టార్ రేటెడ్ ట్రాన్స్ ఫార్మర్లు కొనుగోలు చేస్తే నానా యాగీ
ఇప్పుడు అవే ట్రాన్స్‌ఫార్మర్లు, అదే సంస్థ నుంచి కొంటున్నట్లు అంగీకారం
జగన్ హయాంలోనే డిస్కంలు ఏ గ్రేడ్ సాధిస్తే, సీ గ్రేడ్ అంటూ అసత్యాలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని, ఇకపై రానున్న మూడేళ్లలోనూ ఒక్క రూపాయి కూడా పెంచేది లేదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ శాఖపై రెండేళ్ల ప్రగతి నివేదికను మంత్రి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ తయారు చేయించిన ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’ను ఆయన విలేకరులకు చదివి వినిపించారు. ఆ నివేదికలో మంత్రి చెప్పిన అవాస్తవాలు, అసలు నిజాలు ఇలా ఉన్నాయి.
అసత్యం : జగన్ ఐదేళ్ల హయాంలో తొమ్మిదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.32 వేల కోట్లు భారం వేశారు. బహిరంగ మార్కెట్‌లో యూనిట్ విద్యుత్ రూ.12–15కు కొనుగోలు చేశారు.
వాస్తవం : గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంస్కరణలు, తీసుకువచ్చిన వినూత్న విధానాల వల్ల 2019–24 మధ్య విద్యుత్ సంస్థల నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి. ఫలితంగా రాష్ట్ర ప్రజలపై రూ.5,252.93 కోట్ల ట్రూ అప్ భారం తగ్గింది. వినియోగదారులపై విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం రాలేదు.
అసత్యం : చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు.
వాస్తవం : చంద్రబాబు ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల చార్జీల భారాన్ని వేసింది. అందులో 2024 చివరి నుంచే రూ.6,072.86 కోట్లు, 2025 జనవరి బిల్లుల నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని జోడించారు. 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యూనిట్ కి రూ.0.40 పైసలు చొప్పున వసూలు చేశారు. ఇది దాదాపుగా రూ.2,787.18 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ లెక్కన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలపై రూ.20,135.50 కోట్లు విద్యుత్ చార్జీల భారం వేసింది.
అసత్యం : గత ప్రభుత్వంలో విద్యుత్ సంస్థలపై రూ.49,596 కోట్ల అప్పుల భారం మోపారు.
వాస్తవం : చంద్రబాబు గత పాలనలో సగటున అప్పుల వృద్ధి రేటు 24 శాతం. అదే జగన్ హయాంలో కోవిడ్ లాంటి సంక్షోభాలున్నా, అది కేవలం 7.3 శాతం మాత్రమే. అంతకు ముందు ప్రభుత్వంలో తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించడం కోసం అదనంగా రూ.38,836 కోట్ల రుణాలను ఆర్థిక సంస్థల నుంచి డిస్కంలు తీసుకోవాల్సి వచ్చింది.
అసత్యం : జగన్ ప్రభుత్వం ఏపీ జెన్కోలో బొగ్గు లేకుండా చేసి నిర్వీర్యం చేసింది.
వాస్తవం : చంద్రబాబు గత హయాంలో ఏపీ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం చంద్రబాబు 7213 మెగావాట్ల ఉంటే అది జగన్ హయాంలో 8,789 మెగావాట్లకు పెరిగింది. అంటే 1576 మెగావాట్లు కొత్తగా వచ్చింది. మొత్తం విద్యుత్ ఉత్పత్తి 2018–19లో 27,197 మిలియన్ యూనిట్లు ఉంటే జగన్ హయాంలో 2023–24లో 34,181 మిలియన్ యూనిట్లుగా ఉంది. గత చంద్రబాబు ప్రభుత్వం కంటే ఏపీ జెన్‌కో, ట్రాన్స్ కో, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఎక్కువ లాభాలను ఆర్జించాయి.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 61,347 మిలియన్ యూనిట్లు ఇవ్వడానికే ఆపసోపాలు పడి పవర్ హాలిడేలు, విద్యుత్ కోతలు విధించేవారు. కానీ వైఎస్ జగన్ హయాంలో 81,293 మిలియన్ యూనిట్ల డిమాండ్‌ను ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా తీర్చగలిగారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి 14,948 మెగావాట్ల నుంచి 17,102 మెగావాట్లకు పెరిగింది. 2022–23లో 93 శాతం (12.40 మిలియన్ మెట్రిక్ టన్) ఉన్న బొగ్గు లభ్యత, 2023–24లో 96.52 శాతానికి (14.74 మిలియన్ మెట్రిక్ టన్)కి పెరిగింది.
అసత్యం : విద్యుత్ పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ)లను జగన్ రద్దు చేశారు.
వాస్తవం : రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా, ట్రూ అప్ చార్జీలపై తప్పుడు నివేదికలిచ్చి డిస్కంలను అప్పులు పాలు చేసిన ఘనత చంద్రబాబుదే. టీడీపీ ప్రభుత్వం 8 వేల మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను అధిక ధర (యూనిట్ రూ.7)కు కుదుర్చుకుంది. దీనివల్ల డిస్కంలు ఏటా దాదాపు రూ.3,500 కోట్ల చొప్పున 25 ఏళ్ల పాటు ఈ భారం మోయాల్సి వస్తోంది. ఈ ఒప్పందాల కోసం థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని (బ్యాక్ డౌన్) తగ్గించింది.
అసత్యం : జగన్ ప్రభుత్వంలో డిస్కంలు ‘సీ’, ‘డీ’ రేటింగులకు పడిపోయాయి.
వాస్తవం : జగన్ హయాంలో రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందించింది. ఏపీట్రాన్స్‌కో, నెడ్‌కాప్, ఏపీకి మూడు ఎనర్షియా అవార్డులు వరించాయి. ఏపీఎస్పీడీసీఎల్‌కు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ‘కన్జ్యూమర్ సర్వీస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఏపీలోని మూడు డిస్కంలకు ‘ఏ’ గ్రేడ్ లభించింది.
అసత్యం : రూ.1.50కే ఆక్వాకు యూనిట్ విద్యుత్ అందరికీ ఇవ్వలేదు.
వాస్తవం : వ్యవసాయం, ఆక్వా ,పశు సంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాలు కలిపి మొత్తం 39.64 లక్షల మంది వినియోగదారులకు ఉచిత, సబ్సిడీ విద్యుత్‌ను గత ప్రభుత్వం అందించింది. ధోబీ ఘాట్‌లు, హెయిర్ కటింగ్ సెలూన్‌లు, చేనేత కార్మికులు, లాండ్రీలు, దారిద్ర రేఖకు దిగువ ఉన్న వారికి, ప్రొఫెషనల్ గోల్డ్‌స్మిత్‌ల దుకాణాలకు కూడా ఉచిత, సబ్సిడీ విద్యుత్ సరఫరా చేసింది.
‘సెకీ’ విద్యుత్ తీసుకుంటున్నాం
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ) నుంచి ఒప్పందం మేరకు సౌర విద్యుత్‌ను యూనిట్ రూ.2.49కే కొనుగోలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు. దాదాపు 300 మెగావాట్లకు పైగా ఇప్పటికే తీసుకున్నామని, దానికి బిల్లు చెల్లించేటప్పుడు ఐఎస్‌టీఎస్ చార్జీలు పరిశీలిస్తామని తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ను వచ్చే 30 ఏళ్ల పాటు కొనసాగించేందుకు, 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సెకీ(ఎస్‌ఈసీఐ)తో గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
అది కూడా యూనిట్ కేవలం రూ.2.49కే. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర యూనిట్ రూ.2.79 కన్నా ఇది‡ తక్కువ. సెకీ విద్యుత్‌కు కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్‌మిషన్ చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు అదే వెసులుబాటుతో సెకీ విద్యుత్‌ను చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటోంది. అయినా అధిక ధర పెట్టారని గతంలో చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం తెలిసిందే. 5 స్టార్ రేటెడ్ ట్రాన్స్‌ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లపై కూడా నాడు తప్పుడు ప్రచారం చేసి, ఇప్పుడు వాటినే కొనసాగిస్తోంది. ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా మంత్రి గొట్టిపాటి రవి నుంచి మౌనమే సమాధానం వచ్చింది.


