నంద్యాల మెడికల్ కాలేజీలో మరో అరాచకం
ప్రాక్టికల్ పరీక్షలో సెల్‌ఫోన్లతో మాల్ ప్రాక్టీస్
ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌కు పట్టుబడిన వైద్య విద్యార్థులు
వదిలేయాలంటూ కళాశాల వైద్యుల బెదిరింపులు
పరీక్ష నిర్వహించలేనని లేఖ రాసిచ్చి వెళ్లిపోయిన ఎగ్జామినర్
ఆగస్టులో ఇదే కాలేజీలో ప్రత్యేక గదుల్లో విద్యార్థులకు సెల్‌ఫోన్లు ఇచ్చి పరీక్షలు రాయించిన ఫ్యాకల్టీ
ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ప్రభుత్వం కంటితుడుపు చర్యలు
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ సభ్యుడిగా విచారణ కమిటీ ఏర్పాటు
సాక్షి, అమరావతి: కంచె చేను మేసిన చందంగా చంద్రబాబు పాలనలో హెల్త్ వర్సిటీ తీరు తయారైంది. వైద్య విద్య పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన వర్సిటీలోని ముఖ్య అధికారులే అక్రమార్కులకు అండగా నిలుస్తుండటంతో అరాచకాలు శ్రుతిమించిపోతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో నంద్యాల మెడికల్ కాలేజీలో కొందరు వైద్య విద్యార్థులను ప్రత్యేక గదుల్లో కూర్చోబెట్టి సెల్‌ఫోన్‌లు సమకూర్చి కాపీ కొట్టించిన ఘటనను ఇటీవలే ‘సాక్షి’ బట్టబయలు చేసింది.
ఈ వ్యవహారంలో అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుండగా సోమవారం అదే నంద్యాల మెడికల్ కాలేజీలో మరో ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. నంద్యాల కాలేజీ వర్గాలిచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు.. సోమవారం ఎంబీబీఎస్ విద్యార్థులకు నిర్వహించిన పాథాలజీ ప్రాక్టికల్ పరీక్షల్లో సెల్‌ఫోన్‌లు దగ్గర పెట్టుకుని మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న ఐదుగురు విద్యార్థులను ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పరీక్షలు నిర్వహించలేమంటూ వెళ్లిపోయిన ఎగ్జామినర్
సెల్‌ఫోన్‌లలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా విద్యార్థులు పట్టుబడినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కళాశాలలోని కొందరు వైద్యులు ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌పై ఒత్తిడి తెచ్చినట్టు వెల్లడైంది. ఇందుకు ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్ ససేమిరా అనడంతో బెదిరింపులకు పాల్పడ్డారని సమాచారం. ఏకంగా విద్యార్థులను సెల్‌ఫోన్‌లతో ఎగ్జామ్ హాళ్లలోకి అనుమతించడం, దీన్ని తప్పుబడితే బెదిరింపులకు దిగడంతో ఈ కాలేజీలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించే పరిస్థితులు లేవని ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్ లేఖ రాసి వెళ్లిపోయినట్టు కళాశాల వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.
ఆగస్టు నెలలోనూ 150 మంది విద్యార్థులు పరీక్ష రాస్తుండగా సీసీ కెమెరాలను ఆఫ్ చేసి కొందరు విద్యార్థులను వేరే గదిలోకి తరలించి నంద్యాల కళాశాల ఫ్యాకల్టీ కాపీ కొట్టించారు. బరితెగింపు కాపీయింగ్‌ను పట్టుకున్న స్పెషల్ అబ్జర్వర్‌ను బెదిరించడమే కాకుండా పై నుంచి వచ్చిన ఆదేశాలతోనే కాపీ కొట్టిస్తున్నామని జవాబిచ్చారు. హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ మావాడే పైకి ఫిర్యాదు చేసినా మాకేం కాదంటూ ధీమా వ్యక్తం చేశారు. వీరు చెప్పినట్టే స్పెషల్ అబ్జర్వర్ వర్సిటీకి ఫిర్యాదు చేసినా బరితెగించిన వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
విచారణ కమిటీలో రిజిస్ట్రార్
నంద్యాల మెడికల్ కాలేజీలో ఆగస్టులో చోటు చేసుకున్న బరితెగింపు కాపీయింగ్ వ్యవహారాన్ని ‘సాక్షి’ బయటపెట్టడంతో ప్రభుత్వం కంటితుడుపు చర్యలకు దిగింది. ఈ ఘటనపై విచారణ కోసం ముగ్గురు అధికారులతో ఓ కమిటీని వేసినట్టు తెలిసింది. ఆ కమిటీలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్ట్రార్ ను ఓ విచారణ అధికారిగా నియమించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారితో విచారణ చేపడితే వాస్తవాలు ఎలా వెలుగులోకి వస్తాయని నంద్యాల మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీ ప్రశ్నిస్తున్నారు. వైద్య శాఖ ఉన్నతాధికారులే తూతూ మంత్రం విచారణతో సరిపెట్టాలని చూస్తుండటంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారని వైద్య విద్య వర్గాల్లోనే విమర్శలు వస్తున్నాయి.


