తాజాగా మంగళవారం బడ్జెట్ అప్పు రూ.4,600 కోట్లు
దీంతో చంద్రబాబు రెండేళ్ల పాలనలో రూ.3,51,695 కోట్ల అప్పు
ప్రతీ నెలా అప్పులతో పాటు చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్‌లతో పాలన
రాష్ట్రాన్ని కోలుకోలేని అప్పుల ఊబిలోకి నెట్టేసిన సర్కారు
అప్పులు పెరుగుతున్నా కనిపించని ఆస్తుల కల్పన.. మరోవైపు అభివృద్ధి లేదు.. సంక్షేమమూ లేదు
ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు విరుద్ధంగా అప్పుల పరంపర
కొత్తగా సంపద సృష్టి లేదు గానీ ఉన్న ఆస్తులు ప్రైవేట్ పరం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే భారీగా అప్పులు చేస్తోంది. ఫలితంగా రాష్ట్ర అప్పుల చిట్టా రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రతి నెలా అప్పులతో పాటు చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్‌లతోనే పాలన కొనసాగుతోంది. అప్పు చేయకుండా రోజు గడవడం లేదని, రోజువారీ ఖర్చులకు అప్పులు చేస్తున్నారని, ఏడాదిలో 357 రోజులు చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్‌లేనని కాగ్ కూడా ఎత్తి చూపింది. అయినా సరే చంద్రబాబు సర్కారు అప్పులు చేయడంలో వేగంగా దూసుకుపోతోంది తప్ప వెనకడుగు వేయడం లేదు.
మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.4,600 కోట్ల అప్పును ఆర్‌బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల.. కేవలం రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఏకంగా రూ.3,51,695 కోట్లకు చేరాయి. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసిన ఘనత చంద్రబాబు సర్కారుకే దక్కుతుంది. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వాలు ఇంత తక్కువ సమయంలో ఇంత భారీగా అప్పులు చేయలేదు.
ఒక పక్క అప్పులు భారీగా.. వేగంగా పెరిగిపోతుండగా, మరో పక్క రాష్ట్ర రాబడులు తగ్గిపోతున్నాయి. ఇంత అప్పు చేసినా అభివృద్ధి లేదు. సంక్షేమ కార్యక్రమాల అమలు లేదు. అప్పులతో కొత్తగా ఆస్తులు సృష్టించకపోగా, ఉన్న ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగిందంటూ ఒక పక్క చంద్రబాబు గొప్పలు చెబుతుండగా, అందుకు తగినట్లు రాష్ట్ర రాబడులు పెరగనందున బాబు గొప్పలన్నీ అబద్ధాలని తేలిపోతోంది.
చేసిన అప్పులను సంక్షేమ పథకాల అమలుకు గానీ, ప్రభుత్వ రంగంలో వైద్య, విద్యా మౌలిక సదుపాయాల కల్పనకు గానీ వెచ్చించకుండా రెవెన్యూ వ్యయాలకు మళ్లించేస్తోంది. దీంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వెచ్చించక పోవడంతో ప్రస్తుతమే కాకుండా భవిష్యత్ అభివృద్ధిని సైతం శూన్యం చేశారని కాగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కేంద్ర నిబంధనలు, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను తుంగలో తొక్కి.. దొరికిన చోటల్లా అప్పులు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతోంది. మద్యం ఆదాయంతో పాటు, గనులను తాకట్టు పెట్టి, బడ్టెట్ బయట చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తూనే ఉంది. కొత్తగా ఆస్తులు, సంపద సృష్టి లేకపోగా, ఉన్న ఆస్తులు సైతం ప్రైవేట్ పరం చేస్తుండటం గమనార్హం.





