‘విలన్‌ అంటే కోట శ్రీనివాసరావు’ | Kota Srinivasa Rao Villainous Journey Started From Visakhapatnam, Know More Interesting Facts Inside | Sakshi
Sakshi News home page

‘విలన్‌ అంటే కోట శ్రీనివాసరావు’

Jul 14 2025 7:47 AM | Updated on Jul 14 2025 9:45 AM

Kota Srinivasa Rao Villainous Journey Visakhapatnam

విలన్‌గా ప్రస్థానం ఇక్కడ నుంచే మొదలు 

బీచ్‌ అంటే చాలా ఇష్టం 

విశాఖ ఉమ్మడి జిల్లాలో ఎన్నో చిత్రాల షూటింగ్‌  

విశాఖపట్నం: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన మహానటుడు కోట శ్రీనివాసరావు. విలన్‌గా, విలక్షణ నటుడిగా, తండ్రిగా, రాజకీయ నాయకుడిగా, కామెడీ విలన్‌గా యావత్‌ తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కోటకు విశాఖతో విడదీయరాని అనుబంధం ఉంది. ప్రతిఘటన సినిమాతో విలన్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కోట శ్రీనివాసరావు.. విశాఖలో చిత్రీకరించిన ఈ సినిమాతోనే విలన్‌ పాత్రలకు కొత్త నిర్వచనం ఇచ్చారు. ఆ చిత్రం ఆయన్ని ‘విలన్‌ అంటే కోట శ్రీనివాసరావు’ అనే స్థాయికి తీసుకెళ్లింది. అప్పటి నుంచి అనేక సినిమాలు విశాఖలో చిత్రీకరించారు. విశాఖలో ఆయన నటించిన చిత్రాల్లో ప్రతిఘటన, ఆలీ బాబా అరడజను దొంగలు, జంబలకిడిపంబ, ఆ ఒక్కటి అడక్కు, కర్తవ్యం, దొరబాబు, పోలీస్‌ బ్రదర్స్, లాఠీచార్జ్, రాజధాని, ఛత్రపతి, యోగి, బుజ్జిగాడు, గణేష్‌ వంటివి ఎన్నో ఉన్నాయి.  

విశాఖ అంటే ఎంతో ఇష్టం 
నగరానికి వచ్చినప్పుడు ఆయన ఎక్కువగా దసపల్లా, మేఘాలయ హోటళ్లలో బస చేసేవారని ఆయన సన్నిహితులు తెలిపారు. విశాఖ నగరం అంటే ఆయనకు ఎంతో ఇష్టమని, షూటింగ్‌ విరామ సమయాల్లో బీచ్‌కు వెళ్లి సేదతీరేవారని సినీ మిత్రులు గుర్తు చేసుకున్నారు. విశాఖ, అరకు ప్రాంతాల్లో ఆయన సినిమాలు షూటింగ్‌ జరిగాయన్నారు.

వైజాగ్‌ ఫిల్మ్‌ సొసైటీ సంతాపం 
తాటిచెట్లపాలెం: విలక్షణ నటుడు, సుదీర్ఘకాలం తెలుగు సినీ పరిశ్రమకు సేవలందించి, ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కోట శ్రీనివాసరావు మృతి పట్ల వైజాగ్‌ ఫిలిం సొసైటీ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని సొసైటీ సెక్రటరీ నరవ ప్రకాశరావు, అధ్యక్షుడు కాశీ విశ్వేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శి బి.చిన్నారావు అన్నారు.   

తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు 
తెలుగు సినీ పరిశ్రమ ఓ మహానటుడిని కోల్పోయింది. ఏ పాత్ర వేసినా ఆ పాత్రకు న్యాయం చేసే ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు. ఎస్‌.వి.రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు వంటి దిగ్గజాల తర్వాత సినీ పరిశ్రమలో అంతటి లోటును తీర్చింది కోట శ్రీనివాసరావే. విశాఖలో సినిమా చిత్రీకరణ అంటే కోట ఎంతో ఉత్సాహంగా వచ్చేవారు. ఆయనతో పలు సినిమాల్లో నటించా. ఆయన లేరన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. 
– ప్రసన్న కుమార్, సినీ నటుడు, వైజాగ్‌  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement