
ఢిల్లీలో జరగనున్న స్వాతంత్య్ర వేడుకలకు నిమ్మాడ సర్పంచ్ కింజరాపు సురేష్ ఎంపిక
ఈయన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు సొంత అన్న కొడుకు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుకు సొంత బాబాయ్ కొడుకు
జిల్లాలో ఎంతో మంది ఆదర్శవంతులైన సర్పంచ్‌లను పక్కన పెట్టి మరీ ఎంపిక
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా అన్నీ వచ్చి చేరుతాయనే సామెత అందరికీ తెలిసిందే. అయితే ఆ కేటాయింపులో సైతం పూర్తిగా బంధు ప్రీతి చూపిస్తూ మిగిలిన వారిని పక్కన పెట్టేయడం కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడుకే చెల్లుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న స్వాతంత్య్ర వేడుకలకు జిల్లాలో కోట»ొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ సర్పంచ్ కింజరాపు సురేష్‌ను ఎంపిక చేశారు. అయితే ఇందులో విషయం ఏముంది అనుకుంటున్నారా..? ఆయన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు సొంత అన్న కుమారుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుకు సొంత బాబాయ్ కుమారుడు.
జిల్లాలో ఎంతో మంది ఆదర్శవంతంగా సేవలు అందజేసిన సర్పంచ్‌లు ఉన్నప్పటికీ కేవలం బంధుప్రీతిని చూపించుకుంటూ సొంత కుటుంబ సభ్యుడిని స్వాతంత్య్ర వేడుకలకు ఎంపిక చేయడంపై సొంత పారీ్టకి చెందిన వారే విస్తుపోతున్నారు. అటు రాజకీయాల్లోనూ అవకాశం ఇవ్వకపోగా, కనీసం ఇలాంటి సామా జిక కార్యక్రమాల్లో సైతం ఇతరులకు అవకాశం ఇవ్వకపోవడంపై ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గత ఏడాది ఇదే మాదిరిగా ఢిల్లీలో ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు కేంద్రమంత్రికి వరుసకు మామ, రాష్ట్ర మంత్రికి వరుసకు మేనత్త కొడుకైన దోమ మోహన్‌రావు, ఆయన భార్య పుణ్యవతిని ఆదర్శ రైతులుగా ఎంపిక చేసి అప్పట్లో విమర్శలపాలయ్యారు.
వేడుకల ఎంపిక సిఫార్సులో పూర్తిగా పక్షపాతం..
ఢిల్లీలో జరగనున్న స్వాతంత్య్ర వేడుకలకు గ్రామ స్థాయిలో సర్పంచ్‌ల ఎంపిక విషయంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు పూర్తిగా పక్షపాత వైఖరి చూపించా రు. వాస్తవంగా ప్రతి పంచాయతీలో అభివృద్ధికి సంబంధించి ఆయా సర్పంచ్‌లు చేసిన కృషి, నిధుల వినియోగంలో అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని వేడుకలకు సిఫార్సులు చేస్తారు. ఇక్కడ పూర్తిగా విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి.
జిల్లాలో తమకు అడ్డే లేదన్న మాదిరిగా మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి మరీ కింజరాపు కుటుంబం బంధు ప్రీతిని చూపించుకున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇదే సురేష్ పై పోటీకి సిద్ధమైన వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌తో పాటు కొంత మంది వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి చేసిన సంఘటనల్లో నిమ్మాడ సర్పంచ్ సురేష్ కీలకంగా వ్యవహరించారు. అలాంటి వ్యక్తికి అవార్డుకు ఎంపిక చేయడంపై విమర్శలు వస్తున్నాయి.