ఆమె మాటే శాసనమా? | Kanaka Mahalakshmi Temple Employees Protest Against EO's Attitude | Sakshi
Sakshi News home page

ఆమె మాటే శాసనమా?

Jun 6 2026 11:42 AM | Updated on Jun 6 2026 11:52 AM

Kanaka Mahalakshmi Temple Employees Protest Against EO's Attitude

విశాఖపట్నం: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వ్యవహారశైలి, సిబ్బంది సమస్యల పట్ల నిర్లక్ష్యం, పోస్టుల కుదింపు చర్యలపై ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయటకు మాట్లాడితే ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే భయంతో సిబ్బంది మౌనంగా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. 

భక్తుల రద్దీ పెరిగినా... సిబ్బంది మాత్రం తగ్గింపు 
రోజురోజుకూ కనకమహాలక్ష్మి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. అదే స్థాయిలో ఆలయ ఆదాయం కూడా గణనీయంగా వృద్ధి చెందుతోంది. 2011లో సుమారు రూ.3 కోట్లుగా ఉన్న వార్షిక ఆదాయం ప్రస్తుతం రూ.13 కోట్లకు చేరింది. అయితే పెరిగిన ఆదాయానికి, భక్తుల రద్దీకి అనుగుణంగా సిబ్బందిని పెంచాల్సిన పరిస్థితిలో, ఇప్పటికే ఉన్న పోస్టులను సైతం కుదించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉద్యోగుల్లో ఆగ్రహం రేకెత్తిస్తున్నాయి. 

కేడర్‌ స్ట్రెంగ్త్‌పై వివాదం 
గతంలో ఆలయ అవసరాలను గుర్తించిన దేవదాయ శాఖ అధికారులు కేడర్‌ స్ట్రెంగ్త్‌ను బలోపేతం చేసి ఉద్యోగులకు పదోన్నతులు కలి్పంచారు. అయితే ప్రస్తుతం సిబ్బంది సంఖ్య పెంపుపై ప్రతిపాదనలు పంపాల్సిన చోట, పోస్టుల తగ్గింపునకు సంబంధించి దేవదాయ శాఖ కమిషనర్‌కు లేఖ పంపినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన ఉద్యోగులు ఈవోతో పాటు ఏపీ ప్రధాన దేవాలయాల ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య నాయకత్వానికి వినతిపత్రాలు సమరి్పంచినప్పటికీ స్పందన కనిపించలేదని వాపోతున్నారు. 

కీలక పోస్టుల రద్దు.. ప్రమోషన్లకు బ్రేక్‌ 
దేవదాయ శాఖ ఆదేశాల మేరకు ఒక కార్యనిర్వాహక ఇంజనీర్, ఒక సహాయ కార్యనిర్వహణాధికారి పోస్టులను రద్దు చేసినట్లు సమాచారం. దీంతో సీనియర్‌ ఉద్యోగుల పదోన్నతుల అవకాశాలు దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఇప్పటికే డిప్యూటీ ఇంజనీర్‌ పోస్టు అప్‌గ్రేడ్‌ పేరుతో కనుమరుగైన పరిస్థితుల్లో, త్వరలో పదవీ విరమణ చేయనున్న ఈఈ పోస్టును కూడా రద్దు చేయనున్నారనే ప్రచారం ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతోంది. 

ఆదాయం పెరిగితే ఉద్యోగాలు తగ్గాలా? 
ఆలయ ఆదాయం నాలుగు రెట్లు పెరిగినప్పటికీ, కేడర్‌ స్ట్రెంగ్త్‌ను కుదించాలనే ఆలోచన వెనుక కారణాలేమిటో ఉద్యోగులకు అర్థం కావడం లేదంటున్నారు. భక్తుల సంఖ్య పెరిగిన కొద్దీ సేవల విస్తరణ అవసరం పెరిగిందని, కానీ సిబ్బంది పెంపు దిశగా చర్యలు కనిపించకపోవడం ఆశ్చర్యకరమని అభిప్రాయపడుతున్నారు. 

దత్తత ఆలయ భారం కూడా వీళ్లపైనే.. 
జగదాంబ జంక్షన్‌ సమీపంలోని అంబికాబాగ్‌ రామాలయాన్ని కనకమహాలక్ష్మి ఆలయం దత్తత తీసుకుని నిర్వహిస్తోంది. అయితే ఆ ఆలయ నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించకుండా, కనకమహాలక్ష్మి ఆలయ ఉద్యోగులతోనే పనులు చేయిస్తున్నారు. దీంతో ఇప్పటికే సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులపై అదనపు పనిభారం పడుతోంది. ముఖ్యంగా మార్గశిర ఉత్సవాల వంటి కీలక వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కొత్త ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌కు ఉద్యోగుల వినతి 
ఇటీవల ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కందుల నాగరాజుకు ఉద్యోగులు తమ సమస్యలను వివరించారు. సిబ్బంది కొరత, పెరుగుతున్న పనిభారం, పోస్టుల కుదింపు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను వివరించి, కేడర్‌ స్ట్రెంగ్త్‌ను పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement