ప్రజల్లోకి మరింత ఉధృతంగా..

Jagan issues instructions on bus yatra meetings from Oct 26th - Sakshi

వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలకు పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌ దిశానిర్దేశం

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గత 52 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు.. విప్లవాత్మక మార్పులతో సు పరిపాలన ద్వారా ప్రతి ఇంటికీ ప్రభుత్వం చేస్తున్న మంచిని చాటిచెప్పడానికి పార్టీ శ్రేణులు మరింత ఉధృతంగా ప్రజల్లోకి వెళ్లేలా చూడాలని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ ప్రాంతీయ సమ న్వయకర్తలకు దిశానిర్దేశం చేశారు. విజయవాడలో సోమవారం జరిగిన పార్టీ ప్రతినిధుల సదస్సులో నిర్దేశించిన అంశాలపై నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించాలని సూచించిన విషయం తెలిసిందే.

దసరా తర్వాత ఈనెల 26 నుంచి సామాజిక న్యాయ యాత్ర పేరుతో 3 ప్రాంతాల్లో చేపట్టే బస్సుయాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని ఆయన మార్గనిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్‌ సీపీ ప్రాంతీయ సమన్వయ­కర్తలతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల సద స్సులో నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై వారితో చర్చించి.. వాటిని ప్రజల్లోకి ప్రభావవంతంగా తీసుకెళ్లాలని చెప్పారు. 

ఇది నా పార్టీ అని పేదలు భావించాలి..
దసరా ముగిశాక.. అక్టోబర్‌ 26 నుంచి సామాజిక న్యాయ యాత్ర పేరుతో బస్సుయాత్ర మొదలు పెట్టాలని ప్రాంతీయ సమన్వయకర్తలకు సీఎం జగన్‌ సూచించారు. ఈ యాత్రను విజయవంతం చేయడానికి ప్రాంతాల వారీగా బాధ్యులను నియమి­స్తామన్నారు. ఈ యాత్ర సందర్భంగా మూడు ప్రాంతాల్లో నిర్వహించే బహిరంగసభల ఏర్పాట్లను సమన్వయపరచడానికి కూడా ముగ్గురు బాధ్యులను నియమిస్తామని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజ­కవర్గంలో బస్సు యాత్ర నిర్వహించి సమావేశాలు నిర్వహించాలన్నారు.

ఈ యాత్రలో భాగంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఒక్కోటి చొప్పున ప్రతి­రోజూ 3 సమావేశాలు నిర్వహించాలని స్పష్టంచేశారు. ఇది అత్యంత ముఖ్యమైన కార్యక్రమమని.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని సమావేశాలు విజయవంతమయ్యేలా చూడాలని ఆదేశించారు. స్థానిక ఎమ్మె­ల్యే లేదా నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు ఈ సమావేశాల్లో మాట్లాడతారని చెప్పారు. 52 నెలల పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు చేసిన మేలును ఈ సమావేశాల ద్వారా వివరించి.. ఆ వర్గాలకు పార్టీని మరింత చేరువ కా­వా­లన్నారు.

పేదవాడు మన పార్టీని తన పార్టీగా ఓన్‌ చేసుకునేలా బస్సు­యాత్రలు ప్రభావంతంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. వచ్చే రెండు నెలలపాటు ఈ బస్సు యాత్ర జరగాలన్నారు. నియోజకవర్గాల వారీగా నిర్వహించే సమావేశాలపై తేదీ, స్థలం సహా పక్కా ప్రణాళిక తయారుచేసుకోవాలని ప్రాంతీయ సమన్వయకర్త­లను సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారిత, పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం అంశాలను ప్రస్తావిస్తూ ఈ బస్సు యాత్ర జరగాలన్నారు.

నియోజకవర్గ స్థాయిలోనూ అవగాహన కల్పించాలి..
విజయవాడలో జరిగిన పార్టీ ప్రతినిధుల సమా­వేశంలో ప్రకటించిన కార్యక్రమాలపై నియోజకవర్గ స్థాయిలో కూడా అవగాహన కల్పించాలని ప్రాంతీయ సమన్వయకర్తలను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగే అవగాహన సమావేశాలకు గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వాలంటీర్లు హాజరయ్యేలా చూడాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించి.. ఆ కార్యక్రమాన్ని సమర్థవంతంగా జరిగేలా చూ­డాలన్నారు.

ప్రాంతీయ సమన్వయకర్తలు ఎంపీలు వి. విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎమ్యెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, తలశిల రఘరామ్, లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top