దుర్గగుడి పాలకమండలి సమావేశం.. భక్తులకు గుడ్‌న్యూస్‌ | Sakshi
Sakshi News home page

దుర్గగుడి పాలకమండలి సమావేశం.. భక్తులకు గుడ్‌న్యూస్‌

Published Mon, Aug 28 2023 4:36 PM

Important decisions Taken In Durga Gudi Governing Council Meeting - Sakshi

సాక్షి, విజయవాడ: దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది. ఈరోజు(సోమవారం) జరిగిన పాలక మండలి సమావేశంలో పలు కీలక తీర్మానాలకు మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ ఎస్వీబీసీ మాదిరిగా దుర్గగుడికి ఎస్‌డీఎంబీసీ ఛానల్‌ను అందుబాటులోకి తెస్తామని ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు తెలిపారు. 

ఇక, పాలక మండలి సమావేశం అనంతరం దుర్గగుడి ఛైర్మన్‌ రాంబాబు మాట్లాడుతూ.. ‘త్వరలో శివాలయాన్ని భక్తులకు అందుబాటులోకి తెస్తాం. శివాలయంలో రూ.40లక్షల అంచనాలతో నవగ్రహ మండపం ఏర్పాటు చేస్తాం. వృద్ధులు, వికలాంగులకు బ్యాటరీ వాహనాలతో పాటు రెండు డీజిల్‌ వాహనాలను ఏర్పాటు చేస్తాం. ఏడాదిలోపు చిన్న పిల్లలతో వచ్చే తల్లులకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. దూరప్రాంత భక్తులకు మహామండపం మొదటి అంతస్తులో డార్మిటరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. 

ప్రతీ భక్తుడికి అమ్మవారి కుంకుమ ప్రసాదం..
దుర్గగుడి ఫ్లై ఓవర్‌ మీద వెళ్లే భక్తులకు కనిపించేలా అమ్మవారి చిత్రాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపాం. అమ్మవారి స్థల పురాణంపై డాక్యుమెంటరీ రూపొందించేందుకు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు. అలాగే, దుర్గాఘాట్‌ను త్వరలోనే అందుబాటుకి తీసుకువస్తామన్నారు. అ‍మ్మవారి సేవలను సోషల్‌ మీడియా యూట్యాబ్‌లో లైవ్‌ టెలికాస్ట్‌ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. టీటీడీ ఎస్వీబీసీ మాదిరిగా దుర్గగుడికి ఎస్‌డీఎంబీసీ ఛానల్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. పౌర్ణమి నుంచి ప్రతీ భక్తుడికి అమ్మవారి కుంకుమ ప్రసాదం అందించనున్నట్టు తెలిపారు. 2వేల మంది అన్న ప్రసాదం స్వీకరించేలా అన్నదాన భవన్‌ విస్తరిస్తున్నామన్నారు. అన్నదాన భవన్‌కు రాబోయే నెలరోజుల్లో శంకుస్థాపన చేస్తాం’ అని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: వినాయక చవతిపై భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి కీలక ప్రకటన

Advertisement
Advertisement