సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్న లక్షలాది భదక్తులు
మేడారం జనసంద్రమైంది.. గద్దెలపై ఇద్దరు తల్లులు కొలువుదీరడంతో దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. సమ్మక్క, సారలమ్మ నామస్మరణతో మేడారం ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక్క కో..సారక్క కో అంటూ గద్దెల ప్రాంగణం మార్మోగింది. శివసత్తుల పూనకాలతో హోరెత్తింది. పవిత్రమైన మాఘశుద్ధ శుక్రవారం వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరి ఉండడంతో ఎక్కువ మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. చీరలు, రవిక ముక్కలు, ఎత్తు బంగారం (బెల్లం), ఎదురు కోళ్లు, ఒడిబియ్యం, కొబ్బరికాయలు..తీరొక్క రూపాల్లో భక్తులు పరవశంతో మొక్కులు సమర్పించుకున్నారు. అమ్మల ప్రసాదం, పసుపు, కుంకుమల కోసం పోటీపడ్డారు. పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో జంపన్నవాగు ప్రాంతం మొత్తం జనంతో కిటకిటలాడింది. అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే సుమారు 45 లక్షల మందికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ప్రారంభమైంది మొదలు ఇప్పటివరకు మేడారానికి సుమారుగా 1.25 కోట్ల మంది వరకు జనం వచ్చారని అధికారులు తెలిపారు.

జాతర మొదలైన ఈనెల 28నుంచి మేడారానికి భక్తుల రాక బాగా పెరిగింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. బుధవారం రాత్రి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు, గురువారం రాత్రి సమ్కక్క గద్దెలపైకి చేరారు. నలుగురు వనదేవతలు గద్దెలపైకి చేరే అపురూప ఘడియల కోసం వేచిచూసిన భక్తులు ఆర్దరాత్రి నుంచి దర్శనం కోసం బారులు దీరారు.
శుక్రవారం రాత్రి వరకు ఆదివాసీ గిరిజనులు సంప్రదాయ పద్ధతుల్లో డప్పుల మోతలు, బాకాలు, బూరనాదాలతో వీరంతా వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే శుక్రవారం ఉదయం వరకు భక్తులకు ఇబ్బందులు లేకుండానే దర్శనం జరిగింది. గరిష్టంగా గంటన్నర సమయంలో భక్తులు దర్శనం ముగించుకుని గద్దెల ప్రాంగణం బయటకు వచ్చారు. శుక్రవారం ఉదయం తర్వాత నుంచి వీవీఐపీల రాక మొదలవడంతో భక్తులకు ఇబ్బందులు మొదలయ్యాయి. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ రాక సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు జాతరలో పదే పదే వీఐపీ ద్వారాల వెంట వెళ్లి దర్శనం చేసుకున్నారు.
వీఐపీల కుటుంబాల దర్శనం కోసం పోలీసు కంట్రోల్ రూమ్ వైపు ద్వారాలను తెరిచి పెద్ద సంఖ్యలో పంపించడంతో క్యూలో నిల్చున్న భక్తులకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు అధికారులు, సిబ్బంది విధుల్లో భాగంగా భక్తులను క్యూలో పంపడానికి ప్రయత్నించినా... తరచూ వీఐపీల తాకిడి పెరగడంతో వారు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. వీఐపీ, వీవీఐపీ పాసులు లేవు లేవంటూనే విచ్చలవిడిగా పలువురు ప్రజాప్రతినిధులు ‘వీవీఐపీ’ స్టిక్కర్లతో రెండు మూడు కార్లలో అనుచరులతో గద్దెల సమీపం వరకు వెళ్లారు. దీంతో భక్తులు గంట నుంచి రెండు గంటలపాటు ఇబ్బంది పడ్డారు. తరచూ సైరన్, కాన్వాయ్‌లతో వీవీఐపీలు పర్యటించిన సందర్భంగా ఇబ్బందిపడిన భక్తులు ఇద్దరు ప్రజాప్రతినిధుల వాహనాలను అడ్డుకుని నిలదీశారు.

మేడారం దారిలో ట్రాఫిక్ జామ్..
మేడారం నుంచి తాడ్వాయి, పస్రాలకు వెళ్లే రెండు మార్గాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యింది. మేడారం నుంచి తాడ్వాయి వెళ్లే అటవీ మార్గంలో సుమారు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మేడారం నుంచి నార్లాపూర్ చింతల్‌క్రాస్ నుంచి పస్రాకు, నార్లాపూర్ చెక్‌పోస్టు నుంచి కాల్వపల్లి, కాటారం, మహదేవపూర్, మంథని, నార్లాపూర్ నుంచి బయ్యక్కపేట మీదుగా భూపాలపల్లి మార్గాలలో ప్రైవేట్ వాహనాలు ఇష్టారాజ్యంగా ఎదురెదురు కావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు శ్రమించి క్లియర్ చేశారు.

నేడు దేవతల వనప్రవేశం
వన దేవతల దర్శనం అనంతరం శుక్రవారం రాత్రి నుంచి భక్తులు తిరుగు ప్రయాణం అయ్యారు. మధ్యాహ్నం నుంచే దర్శనం కోసం బారులు దీరిన భక్తులు మొక్కులు సమర్పించుకుంటూ వెనుదిరగడం కనిపించింది. జాతరకు ముందుగా వచ్చి మేడారం చుట్టూ గ్రామాల శివారుల్లో టెంట్లు వేసుకుని, అద్దె గృహాలు, గుడారాల్లో బస చేసిన వీరు.. దర్శనం తర్వాత తరలివెళ్లిపోతుండడంతో ఆ ప్రాంతాలు ఖాళీ అవుతున్నాయి. ఇదిలా ఉండగా సమ్మక్క–సారలమ్మలు శనివారం సాయంత్రం వనప్రవేశం చేయనున్నారు. అడవిలో ఉండే వన దేవతలు జనంలోకి వచ్చి నాలుగు రోజులు మొక్కులు అందుకున్నారు. ఆదివాసీ సంప్రదాయాలతో పూజారులు వనదేవతలను నేటి సాయంత్రం వనంలోకి తీసుకెళ్లనున్నారు. మేడా రం గద్దెలపై ఉండే సమ్మక్క, సారలమ్మలు వనంలోకి.. గోవిందరాజులు, పగిడిద్దరాజును వారి వారి స్థలాలకు తీసుకెళ్లనున్నారు.


