దారిపొడవునా భక్తుల పొర్లుదండాలు..శివసత్తుల పూనకాలు
జయజయధ్వానాలతో ఉప్పొంగిన భక్తిపారవశ్యం
సారలమ్మతో పాటు గద్దెలకు చేరిన పగిడిద్దరాజు, గోవిందరాజు
ఘనంగా ప్రారంభమైన మేడారం మహాజాతర
నేడు చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం
మేడారం నుంచి సాక్షిప్రతినిధి, వరంగల్: కోట్లాది భక్తుల కొంగుబంగారం.. కోరిన కోర్కెలు తీర్చే వన దేవతలు..సబ్బండ జనాల ఆరాధ్యదైవాలు..సమ్మక్క–సారలమ్మల మహాజాతర అంగరంగవైభవంగా ప్రారంభమైంది. అశేష భక్తజన సందోహం నడుమ ములుగు జిల్లా మేడారంలో జయజయధ్వానాల భక్తినినాద హోరులో ఆధ్మాత్మిక ఘనసంరంభం మొదలైంది. బుధవారం సారలమ్మ ఆగమనం క్షణక్షణం అత్యంత ఉద్విగ్నభరితంగా సాగింది. భక్తుల పొర్లుదండాలు..శివసత్తుల పూనకాలు..కొమ్ము, బూర, డోలు వాయిద్యాల మధ్య సారలమ్మ తల్లి గద్దెను చేరడంతో భక్తజనం పులకించిపోయారు.
కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడి నుంచి మొంటె (వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరారు. జంపన్నవాగులో నీటితో కాళ్లు కడుక్కుని అక్కడి నుంచి సమ్మక్క గుడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి పూజారులు ముగ్గురి రూపాలను రాత్రి మేడారం గద్దెలపై చేర్చారు. కన్నెపల్లి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మ వస్తున్న వేడుకను చూసేందుకు లక్షలాది మంది భక్తులు పోటీపడ్డారు. కోరిన కోరికలు నెరవేర్చే వనదేవత సారలమ్మ మేడారం గద్దెపై కొలువుదీరారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు సారలమ్మతోనే గద్దెలపైకి చేరారు. జాతర తొలిరోజు ఆచారాల ప్రకారం కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత గద్దెపైకి రాకతో మహాజాతర అంకురార్పణ జరిగింది.

ఆచారాల నడుమ ఆగమనం.. ఎదురేగిన భక్తజనం..
ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం సారలమ్మ యేతేంచగా... అడుగడుగునా అశేషంగా తరలివచ్చిన భక్తజనం ఎదురేగారు. బుధవారం ఉదయం 11:00 నుంచి 12:00 గంటల మధ్య సమ్మక్క, సారలమ్మ పూజారులు గద్దెల వద్దకు చేరుకుని పుట్టమన్నుతో గద్దెలను అలికి శుద్ధి చేశారు. గొట్టు గోత్రాల ప్రకారం, ఆదివాసీ సంప్రదాయ పద్ధతుల్లో పీఠ ముగ్గులు వేసి అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీర సారెలను సమర్పించి ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 5.45 గంటల సమయంలో సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ మేడారంలోని సమ్మక్క గుడికి బయలుదేరారు.
అప్పటికే అక్కడికి చేరుకున్న గోవిందరాజు, పగిడిద్దరాజులు సారలమ్మతో కలిసి గుడికి వెళ్లారు. సారలమ్మ పూజారులు గుడిలో సారలమ్మ పీఠం పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు నిర్వహించారు. సమ్మక్క పూజారులు కూడా కట్టడి పూజలు చేశారు. అనంతరం మాఘ శుద్ధ పౌర్ణమి వెన్నెలలో సమ్మక్క అమ్మవారు, పగిడిద్దరాజులకు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం కల్యాణ మహోత్సవం నిర్వహించారు. తదనంతరం తల్లి అనుమతి తీసుకున్న సారలమ్మతో పాటు గద్దెలకు చేరిన గోవిందరాజు, పగిడిద్దరాజులను పూజారులు గద్దెలపై ప్రతిష్టించారు. ఈ సమయంలో దేవాదాయశాఖ అధికారులు పూజా కార్యక్రమాల సమయంలో విద్యుత్ దీపాలను ఆర్పివేయడంతో పూజారులు పూజా, ప్రతిష్ట క్రతువును పూర్తి చేశారు.

వరంబట్టిన మహిళలు..
కన్నెపల్లి నుంచి హనుమంతుడి రక్షా కవచం (నీడ)లో సారలమ్మ దేవత బయలుదేరి, రాత్రి మేడారం గద్దెలకు చేరుకున్నారు. కాగా సారలమ్మ గద్దె పైకి వస్తున్న సమయంలో ఎదురెళ్లి వరం పడితే సంతానభాగ్యం కలుగుతుందని, కోర్కెలు నెరవేరతాయని మహిళల నమ్మకం. ఈ సందర్భంగా సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను మొంటెలో తీసుకొస్తుండగా ఆలయం మెట్ల నుంచి వంద మీటర్ల పొడవునా భక్తులు కింద పడుకుని వరం పట్టారు. కాగా, సారలమ్మను తీసుకొస్తున్న పూజారులు వీరిపై దాటివెళ్లారు. సారలమ్మ గద్దెలకు రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ముబూరలు ఊదారు. ప్రత్యేక డోలు వాయి ద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల శివాలుతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం భక్తిభావంతో ఉప్పొంగింది. కాగా ప్రభుత్వం తరఫున రాçష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క, ములుగు కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

నృత్యం చేసిన మంత్రులు
రాçష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కన్నెపల్లి నుంచి మేడారం గద్దెల వరకు ఆద్యంతం ఊరేగింపులో పాల్గొన్నారు. మేడారం గద్దెల వద్ద మంత్రులు, అధికారులు కలిసి నృత్యం చేశారు. కాగా, రాత్రి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అమ్మ వారిని దర్శించుకున్నారు.
నేడు సమ్మక్క తల్లి రాక..
జాతరలో అత్యంత ప్రధాన ఘట్టం సమ్మక్క అమ్మవారు మేడారం గద్దెపైకి చేరడం. చిలకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్క ప్రతిమను తీసుకొచ్చే ప్రక్రియ గురువారం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల సమయంలో గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, మరికొందరు పూజారులు చిలకలగుట్టపై నుంచి కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్కను వెదురు బొంగులో భద్రపర్చుకుని తీసుకొస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ దివాకర్ టీఎస్ ఆధ్వర్యంలో ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ గాలిలోకి కాల్పులు జరిపిన తర్వాత సమ్మక్క కుంకుమభరిణెతో పూజారులు బయల్దేరుతారు. ఆ సమయంలో భక్తులు... అమ్మవారు వచ్చే దారిలో పోటీపడి ఘన స్వాగతం పలుకుతారు. అదే సమయంలో సమ్మక్కకు ఎదురేగి కోళ్లు, మేకలతో మొక్కి బలిస్తారు. రాత్రి సమ్మక్కను ప్రతిష్టించాక భక్తుల మొక్కులు మొదలవుతాయి. శుక్రవారం నలుగురు వనదేవతలు గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు లక్షలాదిగా తరలివచ్చి తనివితీరా మొక్కులు చెల్లించుకుంటారు.


