
మీ స్వీయ నిబంధనలను మీరే పాటించరా?
రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు ఆక్షేపణ
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రాల మార్పుపై నిలదీత
పోలింగ్ కేంద్రాల మార్పుపై పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి కదా?
ఆ పనిచేయడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ విఫలమైంది
జెడ్పీటీసీ, ఎంపీపీ కార్యాలయ గోడలపై అతికిస్తే సరిపోతుందా?
అసలు ప్రకటనలు ఇవ్వకుంటే ప్రజలకు ఎలా తెలుస్తుంది?
పోలింగ్ కేంద్రాలను మార్చినట్లు బయట అతికిస్తే సరిపోదు
అభ్యంతరాలు తెలిపే అవకాశం ప్రజలకు లేకుండా పోయింది
ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ వ్యవహారంలో జోక్యానికి నిరాకరించిన హైకోర్టు
ర్యాలీ నిర్వహించారంటూ 150 మందిపై అక్రమ కేసు
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో పాల్గొనకుండా చేసే కుట్ర
కూటమి సర్కారు కుతంత్రాలకు హైకోర్టు అడ్డుకట్ట
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 కింద పెట్టిన కేసు చెల్లదు
పిటిషనర్లు, నిందితులు అలాంటి నేరం ఏదీ చేయలేదు
ఈ పరిస్థితిలో కేసును కొట్టివేయాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాది
నిందితులపై తదుపరి చర్యలొద్దంటూ న్యాయమూర్తి ఉత్తర్వులు
‘‘ఉప ఎన్నికల పోలింగ్ కేంద్రాలను మార్చిన విషయాన్ని పత్రికల్లో ప్రకటనగా ప్రచురించాలని నిబంధనలు చెబుతున్నాయి. అయినా కూడా ఎన్నికల కమిషన్ ఆ పని చేయడంలో విఫలమైంది.’’
‘‘పోలింగ్ కేంద్రాల మార్పు విషయంలో ఎన్నికల కమిషన్ తన స్వీయ నిబంధనను తానే ఉల్లంఘించింది.’’
‘‘అసలు అభ్యంతరం తెలిపే అవకాశమే లేనప్పుడు... ప్రజలు అభ్యంతరం చెప్పలేదనే కారణాన్ని చూపుతూ పోలింగ్ కేంద్రాల మార్పు విషయంలో నిర్ణయం తీసుకోవడం ఎంత వరకు సబబు?’’ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరును ఆక్షేపిస్తూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చిన విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) తీరును హైకోర్టు గట్టిగా తప్పుబట్టింది. ‘‘పోలింగ్ కేంద్రాలను మార్చిన విషయాన్ని జెడ్పీటీసీ, ఎంపీపీ కార్యాలయాల బయట అతికిస్తే సరిపోతుందా? ఈ విషయం సాధారణ ప్రజానీకానికి ఎలా తెలుస్తుంది’’ అంటూ నిలదీసింది.
అసలు పోలింగ్ కేంద్రాలను మార్చినట్లు తెలిసినప్పుడే కదా... ప్రజలకు దానిపై అభ్యంతరాలను తెలిపే అవకాశం ఉంటుంది అని అభిప్రాయపడింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎర్రబల్లి, నలగొండువారిపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను నల్లపురెడ్డిపల్లికి మార్చడాన్ని వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం విచారణ జరిపారు.
ఇప్పటికే 97 శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ జరగడం, ఆ స్లిప్పుల్లో పోలింగ్ కేంద్రాల వివరాలు ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల మార్పు విషయంలో జోక్యం చేసుకోలేకపోతున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఎన్నిక ప్రక్రియ కూడా మొదలైందని గుర్తుచేస్తూ... పోలింగ్ కేంద్రాల మార్పుపై దాఖలైన వ్యాజ్యాలను తోసిపుచ్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో 2 కి.మీ.దూరం.. నేడు 4 కి.మీ.
వైఎస్సార్‌సీపీకి చెందిన పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి, న్యాయవాదులు వీఆర్‌రెడ్డి కొవ్వూరి, యర్రంరెడ్డి నాగిరెడ్డి, వడ్లమూడి కిరణ్, సానేపల్లి రామలక్ష్మణరెడ్డి తదితరులు వాదనలు వినిపించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చిందని అన్నారు. పోలింగ్ కేంద్రాలను మార్చినట్లు ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదన్నారు.
అసలు మార్చినట్లు ఓటర్లకు కూడా తెలియదని పేర్కొన్నారు. గతంలో పోలింగ్ కేంద్రం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఇప్పుడు దానిని నాలుగు కిలోమీటర్లకు మార్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మార్పుపై పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాల్సి ఉన్నా ఆ పని చేయలేదని తెలిపారు. ఎన్నికల సంఘం తన నిబంధనలను తానే అమలు చేయలేదన్నారు.
ప్రకటన ఇవ్వలేదు.. గోడకు అతికించాం
రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పోలింగ్ కేంద్రాల మార్పు విషయంలో నిబంధనలను అనుసరించినట్లు చెప్పుకొచ్చారు. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వలేదని అంగీకరిస్తూనే... పోలింగ్ కేంద్రాల వివరాలను జెడ్పీటీసీ కార్యాలయం బయట అతికించి ప్రజల నుంచి అభ్యంతరాలు కోరామన్నారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో పోలింగ్ కేంద్రాలను మార్చామని తెలిపారు.
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వనంత మాత్రాన పోలింగ్ కేంద్రాల మార్పు గురించి ఓటర్లకు తెలియదని భావించడానికి వీల్లేదన్నారు. ఓటర్ స్లిప్పుల్లో పోలింగ్ కేంద్రాల వివరాలున్నాయన్నారు. చివరి నిమిషంలో కోర్టుకు వచ్చి ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పోలింగ్ కేంద్రాల మార్పుపై దాఖలైన వ్యాజ్యాలను తోసిపుచ్చారు.
ర్యాలీ నిర్వహించిన వారిపై ఎలాంటి చర్యలొద్దు
మరో కేసులో రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వులు
150 మందిపై అక్రమ కేసు
వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి... వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చేసి.. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో లబ్ధి పొందాలనుకున్న కూటమి సర్కారు కుతంత్రాలను హైకోర్టు అడ్డుకుంది. ప్రభుత్వ దాడులను నిరసిస్తూ పులివెందులలో ర్యాలీ చేపట్టినందుకు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీష్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్‌తో పాటు 150 మందిపై పోలీసులు నమోదు చేసిన కేసులో హైకోర్టు సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ర్యాలీ నిర్వహించినందుకు నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్నవారి విషయంలో తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని పులివెందుల పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వ దాడులను నిరసిస్తూ ఈ నెల 6న పులివెందులలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఇందులో వైఎస్ అవినాష్‌రెడ్డి, సతీష్‌రెడ్డితో పాటు పెద్దఎత్తున నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే, అనుమతి లేకుండా ర్యాలీ తీసి, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఎంపీడీవో కృష్ణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, సతీష్‌రెడ్డితో పాటు దాదాపు 150 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును అడ్డం పెట్టుకుని వీరందరినీ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది.
దీంతో తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ గజ్జల గంగ మహేశ్వరరెడ్డి, కంచర్ల వెంకట సర్వోత్తమరెడ్డి, కంచర్ల జనార్దన్‌రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ జ్యోతిర్మయి విచారణ జరిపారు.
రాజకీయ కక్ష సాధింపునకే కేసు నమోదు
పిటిషనర్ల తరఫు న్యాయవాది వీఆర్‌రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ, కేవలం రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 కింద పెట్టిన కేసు చెల్లదని తెలిపారు. ఎన్నికల సమయంలో వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు ఈ సెక్షన్ కింద కేసు పెడతారని, కానీ, పిటిషనర్లు అలాంటి నేరం ఏదీ చేయలేదన్నారు.
ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు మొత్తం 10 మందిని నిందితులుగా పేర్కొన్నారన్నారు. వీరితోపాటు మరో 100–150 మందిని కూడా నిందితులుగా చేర్చే ప్రమాదం ఉందని వివరించారు. ఆ మరికొందరు నిందితులు ఎవరో నిర్దిష్టంగా పేర్కొనలేదని, తద్వారా వైఎస్సార్‌సీపీకి చెందినవారిని ఎన్నికల సమయంలో నిందితులుగా చేర్చి, వేధింపులకు గురి చేసే అవకాశం ఉందన్నారు.
బీఎన్‌ఎస్ సెక్షన్ 223 కింద నేరుగా కేసు పెట్టే అధికారం పోలీసులకు లేదని తెలిపారు. మేజి్రస్టేట్ అనుమతి తీసుకున్న తర్వాతే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయాల్సి ఉంటుందని వివరించారు. పిటిషనర్లపై నమోదు చేసిన కేసులన్నీ కూడా ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవేనని ప్రస్తావించారు.
మధ్యంతర ఉత్తర్వులొద్దన్న ప్రభుత్వ న్యాయవాది
పోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లపై నమోదు చేసిన కేసులు ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవేనని, వారికి బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇస్తామన్నారు. అందువల్ల ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దని కోరారు. ఒకవేళ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటే వాటిని కేవలం పిటిషనర్లకే పరిమితం చేయాలని అభ్యర్థించారు.
సెక్షన్ 223 కింద పోలీసులు కేసు పెట్టడానికి వీల్లేదు
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... సెక్షన్ 223 కింద పోలీసులు నేరుగా కేసు పెట్టడానికి వీల్లేదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది చేసిన వాదనల్లో బలం ఉందన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో పిటిషనర్లతో పాటు ఇతర నిందితులపై నమోదు చేసిన కేసులో తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు.