
తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తు అధికారి వెంకటరావుకు హైకోర్టు ఆదేశం
సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన ‘సిట్’లో ఆయన సభ్యుడు కాదు
అలాంటప్పుడు ఆయన్ను దర్యాప్తు అధికారిగా ఎలా నియమిస్తారు?
ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అవుతుంది
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశం
సాక్షి, అమరావతి: ‘తిరుమల లడ్డూ వివాదంపై విచారణ పేరుతో మీరు ఎవరికీ నోటీసులు ఇవ్వొద్దు. విచారణ చేయొద్దు...’ అని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) దర్యాప్తు అధికారిగా ఉన్న అదనపు ఎస్పీ జె.వెంకటరావును హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు అనుమతి తీసుకోకుండానే సిట్ దర్యాప్తు అధికారిగా అదనపు ఎస్పీ జె.వెంకటరావును నామినేట్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ ప్రొసీడింగ్స్ జారీ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌లో వెంకటరావు భాగం కాదని గుర్తుచేసింది. అలాంటప్పుడు సుప్రీంకోర్టు అనుమతి తీసుకోకుండా విచారణ పేరుతో సాక్షులకు నోటీసులు జారీ చేయడం కోర్టు ధిక్కారమే అవుతుందని అభిప్రాయపడింది.
సిట్ దర్యాప్తు అధికారిగా వెంకటరావును నియమిస్తూ సీబీఐ డైరెక్టర్ ఇచి్చన ప్రొసీడింగ్స్ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని తేల్చి చెప్పింది. సీబీఐ, సిట్ దర్యాప్తు అధికారి హోదాలో సాక్షులకు, నిందితులకు నోటీసులు ఇవ్వకుండా వెంకటరావును హైకోర్టు నిరోధించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుమల లడ్డూ వివాదంపై దర్యాప్తు నిమిత్తం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌లో సభ్యుడిగా లేని వెంకటరావు దర్యాప్తు అధికారి హోదాలో తనకు నోటీసు ఇచ్చి విచారణకు పిలవడాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ, ఏపీ భవన్ అప్పటి ప్రత్యేక అధికారి కె.చిన్నప్పన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ హరినాథ్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది చిత్తరవు నాగేశ్వరరావు, న్యాయవాదులు వంపుగడవల ఉదయ్‌కుమార్, పి.యుగంధర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
సుప్రీంకోర్టు నియమించిన ‘సిట్’లో వెంకటరావు సభ్యుడు కాదు
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో ప్రస్తుతం దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న వెంకటరావు భాగం కాదని సీనియర్ న్యాయవాది నాగేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు ఉండాలని, వారిని సీఐడీ డైరెక్టర్ నామినేట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేట్ చేసిన ఇద్దరు అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ చైర్మన్ నామినేట్ చేసిన సీనియర్ అధికారి ఒకరు సిట్‌లో ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిందని వివరించారు.
లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదట ఓ సిట్‌ను ఏర్పాటు చేసిందన్నారు. తిరుపతి అదనపు ఎస్పీగా ఉన్న వెంకటరావు మొదట దర్యాప్తు చేశారన్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సిట్ స్థానంలో మరో సిట్‌ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిందని చెప్పారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌లో వెంకటరావు సభ్యుడు కాదన్నారు. అయినప్పటికీ సీబీఐ డైరెక్టర్ దర్యాప్తు బాధ్యతలను వెంకటరావుకు అప్పగిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారని తెలియజేశారు.