
పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశం
జాతీయ దర్యాప్తు సంస్థకు నోటీసులు
సాక్షి, అమరావతి: పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్లీపర్ సెల్స్‌ను గుర్తించే విషయంలో విచారణ జరపాలని డీజీపీని ఆదేశించింది. రాష్ట్రంలో స్లీపర్స్ సెల్స్‌కు సంబంధించి తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని తేల్చిచెప్పింది.ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
స్లీపర్ సెల్స్ ఉన్నా పట్టించుకోవడం లేదు
పహల్గాం ఉగ్రదాడి తరువాత దేశవ్యాప్తంగా 20వేల మంది స్లీపర్ సెల్స్ రహస్యంగా పాకిస్థాన్ ఐఎస్‌ఐ కోసం పనిచేస్తున్నారని హైకోర్టు న్యాయవాది సూరపరెడ్డి గౌతమి, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన ఎ.శివకుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నారు. వీరిలో 1,200 మంది ఏపీలోని నంద్యాల, గుంటూరు, వైఎస్సార్ తదితర జిల్లాల్లో ఆశ్రయం పొందుతున్నారని, ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు నివేదికలిచ్చినా రాష్ట్ర హోంశాఖ, డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
ఈ పిటిషన్లపై జస్టిస్ హరినాథ్ ఇటీవల విచారణ జరిపారు. గౌతమి తరఫున కోనపల్లి నర్సిరెడ్డి, శివకుమార్ తరఫున బూదాటి జ్ఞానేంద్ర కుమార్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పహల్గాం ఉగ్రదాడి తరువాత కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 20వేల మంది స్లీపర్ సెల్స్ ఉన్నట్టు, వారంతా పాకిస్తాన్ ఐఎస్‌ఐ కోసం పనిచేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చాయని న్యాయవాది నర్సిరెడ్డి పేర్కొన్నారు.
ఏపీలో పోలీసు యంత్రాంగం ఈ హెచ్చరికలను పట్టించుకోవడం లేదన్నారు. ఉగ్రమూకలకు సహకరిస్తున్న వారి విషయంలో చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో విచారణ నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు.
ఎన్‌ఐఏకు నోటీసులు
ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు నోటీసులు జారీ చేశారు. పిటిషనర్లు సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకుని, స్లీపర్స్ సెల్స్ విషయంలో విచారణ జరిపి నివేదికను తమ ముందుంచాలని డీజీపీని ఆదేశించారు. బాంబు పేలుళ్లు సృష్టించేందుకు కుట్ర పన్నారంటూ విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, తెలంగాణకు చెందిన సమీర్‌లను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.