
విశాఖ:: వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడుతోంది. ఇది మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగానికి (IMD) చెందిన విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం (Visakha Cyclone Warning Center) వెల్లడించింది. అల్పపీడనం వాయుగుండంగా ఏర్పడిన తర్వాత దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటుతుందని ప్రకటించింది. దీని ప్రభావంతో ఇవాళ(శుక్రవారం) రేపు(శనివారం) ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది.
దీని ప్రభావంతో ఐదు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి 40 కి.మీ నుంచి 50 కి.మీ గరిష్ఠ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఐదు రోజులు పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని పేర్కొంది. కృష్ణపట్నం మినహా మిగిలిన అన్ని ఓడరేవుల్లోనూ మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
దీనిలో భాగంగా 9 జిల్లాలకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, ఎన్‌టీఆర్, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. జారీ చేసింది. అదే సమయంలో అల్లూరి, కాకినాడ, పశ్చిమగోదావరి, కోనసీమ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్. హెచ్చరికలు జారీ చేసింది.